‘టెంపరరీ’ ఖర్చు టెంపరేచర్ పెంచేస్తోంది

Update: 2016-04-07 06:15 GMT
ఏపీ తాత్కాలిక సచివాలయం - అసెంబ్లీ కోసం పెడుతున్న ఖర్చు చూస్తుంటే ఆశ్చర్యం కలగక మానదు.  పేరుకు తాత్కాలిక నిర్మాణాలే అయినా చేస్తున్న ఖర్చు మాత్రం భారీగా ఉంది. సచివాలయ ఖర్చులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. నిర్మాణ వ్యయం రూ.180 కోట్ల నుంచి రూ.220 కోట్లకు పెరిగిపోగా, దీని విస్తరణ, లోపలి హంగుల కోసం మరో రూ.581 కోట్లు వెచ్చించనున్నారు. దీంతో తాత్కాలిక సచివాలయానికే వ్యయం ఏకంగా రూ.800 కోట్లకు చేరుతోంది.
    
తాత్కాలిక సచివాలయ నిర్మాణంలో భాగంగా అత్యాధునిక  హంగుల కల్పనకు గాను రూ.581 కోట్ల అంచనాతో క్రిడా అధికారులు తాజాగా ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనలు మౌలికాభివృద్ధి శాఖ ద్వారా ఆర్థిక శాఖకు చేరాయి. వాటిని ఆమోదించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.  సచివాలయానికి తాగునీరు - విద్యుత్‌ - లోపలి ఇతర సదుపాయాలు - పైపులైన్ల నిర్మాణం వంటివి ఈ అంచనాల్లో ఉన్నాయి. కార్పొరేట్‌ స్థాయిలో మౌలిక సౌకర్యాలు - ఏసీలు - కూలర్ల వంటివి కూడా సమకూర్చాలని నిర్ణయించారు.  తాత్కాలిక సచివాలయం నిర్మాణ మవుతు న్న వెలగపూడి ప్రాంతంలో ఉన్న విద్యుత్‌ లైన్లు సచివాలయానికి విద్యుత్‌ అందించేందుకు సరిపోవంటున్నారు. అరదువల్ల సచివాలయ వద్దే ప్రత్యేకంగా విద్యుత్‌ కోసం రూ.15 కోట్ల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుందని  అధికారులు చెప్తున్నారు.
    
కాగా తాత్కాలిక సచివాలయంలో కొనసాగేది రెండేళ్లు మాత్రమే అని చెప్తున్న నేపథ్యంలో ఇలా 800 కోట్లు ఖర్చు చేయడం అవసరమా అన్న ప్రశ్న వినిపిస్తోంది. మరోవైపు కేంద్రం ఇంతవరకు రాజధాని కోసం ఇచ్చిన నిధులు లెక్కేసినా కూడా ఈ తాత్కాలిక సచివాలయానికి  అంతకంటే ఎక్కువే ఖర్చయ్యేలా ఉంది. దీంతో తాత్కాలిక ఏర్పాట్లు కోసం ఇంత భారీ ఖర్చు చేయడంపై విమర్శలు వస్తున్నాయి.
Tags:    

Similar News