రాజ‌ధానికి భూములు ఇవ్వ‌ని రైతుల‌పై కొత్త అస్త్రం

Update: 2017-03-10 04:14 GMT
న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అమరావతి భూముల వివాదం మ‌రోమారు తెర‌మీద‌కు వ‌చ్చింది.  రాజధాని నిర్మాణానికి దేశంలోనే వినూత్న రీతిలో భూ సమీకరణకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టి, 29 గ్రామాల పరిధిలో 33 వేల ఎకరాలను సేకరించింది. మరో 3 వేల ఎకరాలను ఈ విధానంలో సేకరించేందుకు ప్రభుత్వం ప్రయత్నించినా, రైతులు ముందుకు రాకపోవడంతో ఆ భూముల సేకరణ నిలిచిపోయింది. ఇలా  రాజ‌ధాని నిర్మాణానికి సంబంధించి భూ సమీకరణకు ముందుకు రాని రైతులపై ప్రభుత్వం గ్రీన్ బెల్ట్ అస్త్రాన్ని ఏపీ ప్ర‌భుత్వం ప్రయోగించనుంది. భూసమీకరణకు ముందుకురాని రైతులను దారిలోకి తెచ్చుకునేందుకు భూ అమ్మకాలపై నిషేధ వ్యూహాన్ని పరోక్షంగా అమలు చేయనుంది.

అమరావతి రాజధాని డిజైన్ల ప్రక్రియ కొలిక్కివస్తున్నప్పటికీ, ఈ భూముల వ్యవహారం తేలకపోవడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఉండవల్లి - పెనుమాక - లింగాయపాలెం - రాయపూడి - నిడమర్రు గ్రామాలకు చెందిన కొంతమంది రైతులు భూములను ఇచ్చేందుకు విముఖత వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఎంత ప్రయత్నించినప్పటికీ, రైతులు సుముఖత వ్యక్తం చేయకపోవడంతో ప్రభుత్వం గ్రీన్‌ బెల్ట్ అస్త్రాన్ని ప్రయోగించేందుకు తాజాగా నిర్ణయించింది. ఆ భూములను గ్రీన్‌ బెల్ట్ ప్రాంతంగా ప్రకటించడం వల్ల ఆ భూముల్లో కేవలం వ్యవసాయ సంబంధిత పనులు మాత్రమే చేసేందుకు అనుమతి ఉంటుంది. భూములను ప్లాట్లుగా వేసి అమ్ముకునే వీలు ఉండదు. రైతులను తమదారిలోకి తెచ్చుకునేందుకు ఇదో వ్యూహంగా భావిస్తున్నారు. భూ సమీకరణకు ముందుకు రాని రైతుల నుంచి భూసేకరణ చట్టం 2013 ప్రకారం భూములు సేకరిస్తామని గతంలో ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, ఇప్పుడు ఆ విధానంలో సేకరణను పక్కకు పెట్టి గ్రీన్ బెల్ట్ ప్రాంతంగా ప్రకటించే ప్రయత్నం చేయడాన్ని కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. అయితే దాదాపు 54 వేల ఎకరాల్లో రాజధాని ప్రతిపాదిత ప్రాంతం ఉందని, ఇప్పటికే 29 గ్రామాల్లో కొంత చొప్పున మొత్తం భూమిలో 10 శాతాన్ని గ్రీన్ బెల్ట్ అభివృద్ధికి కేటాయించారని ఆయా గ్రామాల రైతులు గుర్తు చేస్తున్నారు. గత ఏడాది విడుదల చేసిన మాస్టర్ ప్లాన్‌ లోనూ ఈ వివరాలను పొందుపరిచారని, దీనికి అదనంగా 3 వేల ఎకరాలను గ్రీన్ బెల్ట్‌ గా ఏలా ప్రకటిస్తారని, దీని వల్ల కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రభుత్వ తాజా నిర్ణయం భవిష్యత్తులో కొత్త సమస్యలు సృష్టించే అవకాశం ఉందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News