ఫలితం తర్వాత.. ఏపీ ఓటర్ల కాళ్లకు మొక్కాల్సిందే

Update: 2019-04-13 05:24 GMT
ఓటు వేయటానికి ఇంటి పక్కనున్న పోలింగ్ కేంద్రానికి వెళ్లటానికే బద్ధకం. అలాంటిది.. వందల కిలోమీటర్లు.. వేలాది రూపాయిలు ఖర్చు పెట్టుకొని మరీ సొంతూరు వెళ్లి ఓటేసి రావటాన్ని ఊహించగలమా?  కాస్త టైం కేటాయించి ఓటు వేయటానికి ప్రయత్నించండంటూ.. పెద్దగా రియాక్ట్ కాని జనాన్ని చూస్తాం. ఇక.. హైదరాబాద్ లో ఎన్నికల పోలింగ్ ఎంత దారుణంగా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే ఉండదు.

అలాంటిది.. అదే హైదరాబాద్ నుంచి తక్కువలో తక్కువ 12 లక్షల మంది ఆంధ్రోళ్లు ఏపీలో తమ ఊళ్లకు వెళ్లి ఓటు వేయటానికి వెళ్లటాన్ని ఎలా చూడాలి?  ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఓటు వేసేందుకు గంట నుంచి ఐదారు గంటల వరకూ క్యూ లైన్లో వెయిట్ చేయటం మరి దేనికి సంకేతం.

ఏపీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు?  మరెవరు ఓడతారన్నది పక్కన పెడదాం. ఒక్క విషయం మాత్రం చెప్పొచ్చు. ఏపీ ఓటరు ఎన్నికల ఫలితాలకు ముందు గెలిచేసేశాడు. ఓటు కోసం ఇంతగా శ్రమిస్తారా? అన్నట్లుగా వారు వ్యవహరించారు. క్యూలైన్లో చంటిబిడ్డల్ని ఎత్తుకున్నోళ్ల దగ్గర నుంచి.. ఎండ వేడి ఇబ్బంది పెడుతున్నా.. చెమటలు కారుతున్నా.. పట్టించుకోకుండా ఓటు వేయటానికి ఉత్సాహాన్ని చూపించిన తీరుకు మాత్రం శభాష్ అనాల్సిందే.

అర్థరాత్రి దాటినా.. ఓటు వేసే విషయంలో ఉత్సాహం తగ్గకుండా తమ తీర్పును చెప్పేందుకు వెనుకాడని వైనం ఇప్పుడు అందరి నోటా హాట్ టాపిక్ గా మారింది. ఇలాంటి సీన్ .. ఆంధ్రాలోనే సాధ్యమన్నట్లుగా ఆంధ్రోళ్లు వ్యవహరించారని చెప్పాలి. తుది ఫలితం ఏమైనా సరే.. మెజార్టీ ఓటర్లు ఏం కోరుకున్నారో.. అదే జరుగుతుందని చెప్పాలి.

ఒక చానల్లో ఏపీకి చెందిన ఒక మహిళ మాటలు ఇప్పుడు వైరల్ గా మారాయి.  ఓటు వేసేందుకు వెయిట్ చేస్తున్న ఆమె మాట్లాడుతూ.. తిరుపతి వెంకన్న కోసం ఇలాగే వెయిట్ చేస్తాం. మాకు అలాంటి దేవుడు కావాలని చెప్పి.. ఇలా నిల్చున్నాం. మాకు అలాంటి నాయకుడు కావాలి. ఆయనే బాగా చూసుకోగలరు. ఆయన ఎవరన్నది చెప్పను. ఎంత ఎండ ఉన్నా.. ఇలాగే నిలుచుంటామంటూ ఓటు వేసే విషయంలో తమకున్న కమిట్ మెంట్ ఎలాంటిదో చెప్పేశారు. ఆమె ఒక్కరే కాదు.. ఇలాంటి లక్షలాది మంది ఓటర్లు ఓపిగ్గా వెయిట్ చేయటంతోనే.. అర్థరాత్రి దాటిన తర్వాత కూడా పోలింగ్ కొనసాగిందన్న మర్చిపోకూడదు.
Tags:    

Similar News