ఏపీలో అదానీ ఇన్వెస్ట్‌!... మ‌త‌ల‌బేంటో?

Update: 2019-01-10 13:43 GMT
తెలుగు నేల విభ‌జ‌న త‌ర్వాత 13 జిల్లాల‌తో క‌నీసం రాజ‌ధాని కూడా లేకుండా ఏర్పడ్డ న‌వ్యాంధ్ర ఇప్పుడు ఆర్థిక స‌మ‌స్య‌ల‌తో కొట్టుమిట్టాడుతోంది. ఈ ప‌రిస్థితి నుంచి వీల‌యినంత త్వ‌ర‌లో రాష్ట్రం కోలుకోవాలంటే... పారిశ్రామిక అభివృద్ధి ఒక్క‌టే మార్గం. ఆ దిశ‌గా చంద్ర‌బాబు స‌ర్కారు ఓ అడుగు ముందుకూ... రెండడుగులు వెన‌క్కు అన్న చందంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. ఆర్భాటంగా ప్ర‌త్యేక విమానాల్లో విదేశీయానాలు చేస్తున్న చంద్ర‌బాబు అండ్ కో భారీ టూర్లేస్తున్నా... ఆ మేర‌కు స‌రిప‌డా పెట్టుబ‌డులు మాత్రం రావ‌డం లేదు. ఇక విశాఖ కేంద్రంగా ఇప్ప‌టికే ఓ మూడు సార్లు నిర్వ‌హించిన సీఐఐ భాగ‌స్వామ్య స‌ద‌స్సుల్లో... ఒక్కో స‌ద‌స్సు ద్వారా రూ.5 ల‌క్ష‌ల కోట్ల‌కు పైగా పెట్టుబ‌డులు వ‌చ్చాయ‌ని డ‌బ్బాలు కొట్టుకున్న బాబు స‌ర్కారు... అందులో ఏ మేర‌కు గ్రౌండింగ్ జ‌రిగింద‌న్న విష‌యాన్ని చెప్పేందుకు జ‌డిసి పోతోంది. ఈ క్ర‌మంలో చంద్ర‌బాబుకు భారీ ఊర‌టనిచ్చేలా నిన్న ఓ రెండు కీల‌క స‌న్నివేశాలు జ‌రిగాయి. వీటిలో గ‌తంలోనే ఒప్పందం కుదిరిన ఏపీపీ పేప‌ర్ ఇండ‌స్ట్రీ మొద‌టిది కాగా... రెండోది ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి అత్యంత స‌న్నిహితుడుగానే కాకుండా గుజ‌రాత్ బీజేపీ వ్య‌వ‌హారాల‌తో పాటు బీజేపీకి సంబంధించిన ఇత‌ర రాష్ట్రాల వ్య‌వ‌హారాల‌ను గుట్టుచ‌ప్పుడు కాకుండా మోదీ దూత‌గా వెళ్లి చ‌క్క‌బెట్టుకురాగ‌ల‌డ‌ని పేరున్న అదానీ గ్రూప్ చైర్మ‌న్ గౌతం అదానీ ఏపీ స‌ర్కారుతో చేసుకున్న భారీ ఒప్పందం రెండోది.

ఏపీపీ పేప‌ర్ ప‌రిశ్ర‌మ ప్ర‌కాశం జిల్లాలో ఏకంగా రూ.24,000 కోట్లతో ఏర్పాటు కానుండ‌గా...అంత‌కు మూడింత‌ల పెట్టుబ‌డితో విశాఖ జిల్లాలో అదానీ ఓ రెండు ప‌రిశ్ర‌మ‌లు పెట్ట‌నున్నారు. అదానీ గ్రూప్ ఇందుకోసం ఏకంగా రూ.70 వేల కోట్ల పెట్టుబ‌డి పెడుతోంది. ఈ రెండు ప‌రిశ్ర‌మ‌లు ఏపీలో భారీగానే ఉద్యోగావ‌కాశాల‌ను సృష్టిస్తాయి. ఏపీ ప్ర‌స్తుతమున్న ప‌రిస్థితుల్లో ఈ త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌లు మ‌రిన్ని రావాల్సి ఉంది. దీనిని ప్ర‌తి ఒక్క‌రూ స్వాగ‌తించాల్సిందే. అయితే ఇప్పుడు చ‌ర్చ అంతా... మోదీ స‌న్నిహితుడిగా ఉన్న అదానీ... పిల‌వ‌కుండానే ఏపీకి వ‌చ్చి బాబు ముందు ప్ర‌త్య‌క్ష‌మ‌వ‌డంతో పాటుగా ఏకంగా రూ.70 వేల కోట్ల పెట్టుబ‌డితో ఏపీలో ప‌రిశ్ర‌మ పెట్ట‌నున్న‌ట్లు ప్ర‌క‌టించ‌డం, ఆ వెంట‌వెంట‌నే చంద్ర‌బాబు స‌ర్కారుతో ఒప్పందం చేసుకోవ‌డంపై చ‌ర్చ జ‌రుగుతోంది. గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో బీజేపీ - టీడీపీ క‌లిసే పోటీ చేసినా... నాలుగేళ్ల పొత్తును చంద్ర‌బాబు సింగిల్ గోలో ప‌గుల‌గొట్టేశారు. అంతేకాకుండా ఏపీకి పెట్టుబడులు రాకుండా మోదీ స‌ర్కారు అడ్డుక‌ట్ట వేస్తోందని చంద్ర‌బాబు స‌ర్కారు నిత్యం ఆరోపిస్తూనే ఉంది. మ‌రి అలాంటి మోదీ... త‌న‌కు అత్యంత స‌న్నిహితుడైన అదానీ... ఏపీలో రూ.70 వేల కోట్ల పెట్టుబ‌డి పెడుతుంటే చూస్తూ ఊరుకుంటాడా?  బాబు అంచ‌నా ప్ర‌కారం అయితే అది దుస్సాధ్య‌మే.

మ‌రి అదానీ గ్రూప్ ఏపీతో భారీ ఒప్పందం చేసుకుంది క‌దా. మ‌రి ఏపీపై - ప్ర‌త్యేకించి చంద్ర‌బాబుపై మోదీకి ఏమీ కోపం లేద‌నే అనుకోవాలా? అయినా మోదీ - చంద్ర‌బాబుకు రాజ‌కీయాలు కావాలి గానీ... అదానీకి ఎందుకు? త‌ను ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త క‌దా. ఎంత‌టి పారిశ్రామిక‌వేత్త అయినా... మోదీకి అత్యంత స‌న్నిహితుడిగా ఉన్న అదానీ.... ఇప్పుడు మోదీకి బ‌ద్ధ విరోధిగా మారిపోయిన చంద్ర‌బాబు పాల‌న‌లో ఉన్న స్టేట్ లో పెట్టుబ‌డి... అది కూడా ఆ రాష్ట్రానికి ఇప్ప‌టిదాకా రానంత పెద్ద పెట్టుబ‌డి పెట్ట‌డ‌మంటే మాట‌లు కాదు క‌దా. దీని వెనుక మోదీ వ్యూహం ఏమైనా ఉందా? అన్న కోణంలో విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. మ‌రోవైపు చంద్ర‌బాబుకు కూడా దేశంలో ప‌లు రాష్ట్రాల‌కు చెందిన పారిశ్రామికవేత్త‌ల‌తో సంబంధాలుంటాయి కదా. ఆ సంబంధాల్లో అదానీ గ్రూపు ఉండరాద‌న్న నియ‌మం ఏమీ లేదు క‌దా. ఏది ఏమైనా... బీజేపీ, టీడీపీలు బ‌ద్ధ శ‌త్రువుల్లా పోట్లాడుకుంటున్న ఈ కీల‌క త‌రుణంలో... ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో ఈ త‌ర‌హా పెట్టుబ‌డి రావ‌డంపై నిజంగానే ఎవ‌రి కోణంలో వారు చ‌ర్చించుకుంటున్నారు.


Full View

Tags:    

Similar News