ఏపీలో కరోనా కంటే నిమ్మగడ్డ ఎపిసోడే ఇంటరెస్టింగబ్బా!

Update: 2020-04-26 16:30 GMT
నిజమే... ప్రాణాంతక మహమ్మారి కరోనా వైరస్ విశ్వవ్యాప్తంగా విలయ తాండవం చేస్తున్న ఈ పరిస్థితుల్లో నవ్యాంధ్రలో కరోనాను మించిన ఇంటరెస్టింగ్ అంశంగా రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వ్యవహారం మారిపోయింది. ఎస్ఈసీ పదవి నుంచి తనను దించే విషయంలో జగన్ సర్కారు నిబంధనలు పాటించలేదన్న వాదనతో నిమ్మగడ్డ హైకోర్టుకు ఎక్కగా... తామేమీ నిమ్మగడ్డను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం లేదని, ఎస్ఈసీని మరింత పారదర్శకంగా తీర్చిదిద్దేందుకే ఆర్డినెన్స్ ను తీసుకువచ్చామని జగన్ సర్కారు చెబుతోంది. మొత్తంగా రోజుకో ట్విస్ట్ తో సాగుతున్న నిమ్మగడ్డ ఎపిసోడ్,... కరోనా కంటే కూడా  ఇంటరెస్టింగ్ పాయింట్ గా మారిపోయింది.

కరోనా విజృంభణకు ముందు జగన్ సర్కారు స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమైపోయిన నేపథ్యంలో... ముందు జాగ్రత్త చర్యగా ఎన్నికలను రద్దు చేసేశారు. అయితే ఎన్నికల వాయిదాను తీవ్రంగా వ్యతిరేకించిన జగన్ సర్కారు... నిమ్మగడ్డ చర్యలపై బహాటంగానే విరుచుకుపడింది. నిమ్మగడ్డ వర్సెస్ జగన్ సర్కారు వ్యవహారం కాస్తా... జగన్ సర్కారు వర్సెస్ విపక్షాలుగా మారిపోయింది. ఆ తర్వాత నిమ్మగడ్డను ఎస్ఈసీ పదవి నుంచి తొలగించేందుకు ఏకంగా ఆర్డినెన్స్ ను తీసుకువచ్చిన జగన్ సర్కారు.. ఏకంగా ఆ పదవిలో మద్రాస్ హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ కనగరాజ్ ను నియమించేసింది. దీంతో హైకోర్టును ఆశ్రయించిన నిమ్మగడ్డ... జగన్ సర్కారుపై ప్రత్యక్ష పోరుకే సిద్ధమైయారు. నేరుగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నిమ్మగడ్డ... తనను ఎస్ఈసీ పదవి నుంచి దింపే అధికారం జగన్ సర్కారుకు లేదంటే లేదని చెబుతున్నారు.

నిమ్మగడ్డ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు... జగన్ సర్కాురుకు నోటీసులు జారీ చేసింది. దీంతో కోర్టులో జగన్ సర్కారు కౌంటర్ దాఖలు చేయక తప్పలేదు. ఎస్ఈసీ పదవి నుంచి నిమ్మగడ్డను తొలగించడంలో తామేమీ వ్యక్తిగత కక్షలు, కార్పణ్యాలకు పోలేదని, ఎస్ఈసీ పదవిలో నియమితులు అయ్యే వ్యక్తి హైకోర్టు జడ్జి స్ధాయి ఉంటే.. మరింత పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించే వీలుంటుందని భావించి ఆర్డినెన్స్ తెచ్చామని చెప్పింది. ఇంతదాకా బాగానే ఉన్నా.. విషయం కోర్టు పరిధిలో ఉండగా వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి చేసిన ఫిర్యాదు ఆధారంగా సీఐడీ రంగంలోకి దిగిపోవడం, కేంద్ర హోం శాఖకు నిమ్మగడ్డ రాసిన లేఖపై విచారణ చేపట్టడం, అందులో నిమ్మగడ్డ తప్పు చేసినట్లుగా ప్రకటనలు వెలువడటం నిజంగా  ఆసక్తికరంగా మారిపోయిందని చెప్పాలి. తాజాగా అసలు ఎన్నికల రద్దుకు సంబంధించి నిమ్మగడ్డ వ్యవహరించిన తీరు సరిగా లేదన్న రీతిలో ఏకంగా ఎన్నికల సంఘం కార్యదర్శి చేత జగన్ సర్కారు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయించడం చూస్తుంటే... నిజంగానేే నిమ్మగడ్డ వ్యవహారం ఏపీలో కరోనాను మించిన ఇంటరెస్టింగ్ పాయింట్ గా మారిందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News