తాజాగా ‘ఆ నలుగురి’కే జగన్ ఛాన్సు ఇచ్చారట!

Update: 2021-06-11 04:30 GMT
ఇవాల్టితో (శుక్రవారం) ఏపీలోని నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. మండలిలో వివిధ విభాగాల నుంచి సభ్యుల్ని ఎంపిక చేయటం తెలిసిందే. స్థానిక సంస్థల నుంచి.. ఎమ్మెల్యే కోటా నుంచి.. ఉపాధ్యాయ వర్గాల నుంచి.. గ్రాడ్యుయేట్స్ నుంచి.. గవర్నర్ కోటా నుంచి.. ఇలా పలు రకాలుగా సభ్యుల్ని ఎంపిక చేసుకోవటం తెలిసిందే. కరోనా కాలంలో ఖాళీ అయిన ఎమ్మెల్సీస్థానాల్ని భర్తీ చేసేందుకు అవసరమైన ఎన్నికల్ని ఇప్పట్లో వద్దని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేయటం తెలిసిందే.

అయితే.. ఈ రోజు ఖాళీ అయ్యే నాలుగు స్థానాలు గవర్నర్ కోటాలోనివి. అంటే..ఆయన విచక్షణతో ఎవరికైనా ఆ పదవిని అప్పజెప్పొచ్చు. పేరుకు గవర్నర్ కోటానే అయినప్పటికీ.. రాష్ట్ర ముఖ్యమంత్రి తనకు నచ్చిన వారి పేర్లను జాబితాగా పంపటం.. వాటిని గవర్నర్ ఓకే చేయటం ఎప్పుడూ జరిగేదే. తాజాగా ఖాళీ అయ్యే నాలుగు ఎమ్మెల్సీ స్థానాల్ని భర్తీ చేసేందుకు సీఎం జగన్ ఇప్పటికే పూర్తిగా సిద్ధమైనట్లుగా చెప్పాలి.

ఇప్పటికే గవర్నర్ కోటాలో ఎంపిక చేయాల్సిన నలుగురు ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాను గవర్నర్ కు పంపినట్లుగా తెలుస్తోంది. ఇంతకూ జగన్ మనసును దోచుకొని.. గవర్నర్ కోటాలో నేరుగా మండలిలోకి అడుగు పెట్టే నేతలు ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఏపీ సర్కారు ప్రతిపాదించిన పేర్లలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మోషేను రాజు.. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన తోట త్రిమూర్తుల్ని ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది.

మిగిలిన ఇద్దరిలో గుంటూరు జిల్లాకు చెందిన లేళ్ల అప్పిరెడ్డి.. కడపకు చెందిన ఆర్వీ రమేశ్ యాదవ్ లను ఎంపిక చేస్తూ ప్రతిపాదనలు పంపినట్లుగా సమాచారం. గవర్నర్ వాటిపై సంతకం పెడితే.. అధికారికంగా ఆ నలుగురు ఎమ్మెల్సీలు అవుతారు. తాజా ఎంపిక చూస్తే.. వీర విధేయులైన వారిని ఎంపిక చేయటమే కాదు.. మూడు ప్రాంతాల వారికి ప్రాధాన్యత ఇవ్వటం కనిపిస్తుంది.
Tags:    

Similar News