మాట‌లు కాదు కేటీఆర్‌..ఏపీలో చేసి చూపించు

Update: 2018-05-27 04:43 GMT
టీఆర్ ఎస్ పార్టీ అధినేత‌ - తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కుటుంబ‌స‌భ్యుల‌కు ఉన్న బ‌లం...తాము అనుకున్న అంశాన్ని చాలా స్ప‌ష్టంగా, ఆక‌ట్టుకునేలా తెలియ‌జెప్ప‌డం. కేసీఆర్ త‌న‌యుడైన మంత్రి కేటీఆర్‌ - మేన‌ల్లుడు హ‌రీశ్ రావు - ఎంపీ క‌విత ఇలాంటి అంశాల్లో చాలా అనుభ‌వం గ‌డించార‌నేది ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇక కేసీఆర్ గురించి అయితే... అంద‌రికీ తెలిసిన సంగ‌తే. అలాంటి మాట‌కారిత‌నం క‌లిగిన గులాబీ ఫ్యామిలీ అనేక సంద‌ర్భాల్లో చెప్పిన మాట... తెలంగాణలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో సాగుతున్న పరిపాలన యావత్‌ దేశానికి ఆదర్శంగా నిలిచింద‌ని - ప్ర‌ధానంగా రాష్ట్ర విభ‌జ‌న అనంత‌రం పొరుగున ఉన్న ఏపీ కంటే తామే ఎన్నో అంశాల్లో ముందున్నామ‌ని ప్ర‌క‌టించ‌డం. ఇక్క‌డితోనే ఆగిపోకుండా టీఆర్ ఎస్ పార్టీని ఏపీలో ఏర్పాటు చేయాల‌ని ప‌లువురు కోరుతున్నార‌ని వెల్ల‌డించడం తెలిసిన సంగ‌తే.

తాజాగా ఇలాంటి కామెంట్ల‌నే మ‌రోమారు మంత్రి కేటీఆర్ చేశారు. నల్లగొండ నియోజకవర్గం నుంచి పలువురు కాంగ్రెస్ నేతలు - పదవీ విరమణ చేసిన ఉద్యోగులు మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్ ఎస్‌ లో చేరారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ మహారాష్ట్రలోని ధర్మాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 40 గ్రామాల ప్రజలు మన రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు - ఇక్కడి రోడ్లు - 24 గంటల కరంటు - రైతుబంధు పథకాలను చూసి తెలంగాణలో కలుపుకోవాలని కోరుతూ మంత్రి పోచారం - ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ కు అక్కడి ఎమ్మెల్యే దరఖాస్తు చేశారని వెల్లడించారు. సీఎం కేసీఆర్ పాలనకు ఇంతకంటే ఏం కితాబు కావాలన్నారు. ఏపీలో సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలుచేస్తున్నారని తెలిపారు. తమ రాష్ట్రంలోని రాజకీయ వ్యవస్థలు విఫలమయ్యాయని - ఏపీలో కూడా టీఆర్ ఎస్ పెట్టి పోటీచేయాలని సామాజిక మీడియాలో - స్వయంగా కలిసి కోరుతున్నారని చెప్పారు.

ఇదంతా బాగానే ఉంది కానీ...మంత్రి కేటీఆర్ చేసిన కామెంట్ల‌పై ప‌లువురు ఆస‌క్తిక‌రంగా స్పందిస్తున్నారు. ఏపీలో పార్టీ ఏర్పాటుకోసం త‌మ‌ను కోరుతున్నార‌ని కేటీఆర్ చెప్ప‌డం ఇదే మొద‌టిసారి. ఆయ‌న చెప్తున్న‌దే నిజ‌మైతే...ఇంత పెద్ద ఎత్తున డిమాండ్ ఉన్న నేప‌థ్యంలో ఏపీలో టీఆర్ ఎస్‌ ను విస్త‌రించ‌వ‌చ్చు క‌దా అనేది అనేక మంది ప్ర‌శ్న‌. త‌ద్వారా తెలంగాణ రాష్ట్ర స‌మితిని తెలుగు రాష్ట్ర స‌మితిగా పేరు మార్చుకోవ‌చ్చ‌ని వ్యాఖ్యానిస్తున్నారు. త‌ద్వారా టీఆర్ ఎస్ గురించి ఆశ‌ప‌డ్తున్న వారి కోరిక‌ నెర‌వేరుతుంద‌ని...అదే స‌మయంలో గులాబీ పార్టీ స‌త్తా తేలుతుంద‌ని అంటున్నారు. ఎలాగూ గతంలో...భీమ‌వ‌రం నుంచి పోటీ చేసే ఆలోచ‌న‌ను వ్య‌క్తం చేసిన కేటీఆర్‌ కు కూడా ఈ పార్టీ విస్త‌ర‌ణ తోడ్పడుతుందని ఇంకొంద‌రు చ‌మ‌త్క‌రిస్తున్నారు.
Tags:    

Similar News