సెటిలర్లూ... కీలకమే మీరు...!!!

Update: 2018-08-14 04:26 GMT
తెలంగాణ రాజకీయాలు సెటిలర్ల చుట్టూ తిరుగుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో వారి ఓట్లే కీలకంగా మారుతున్నాయి. దీనిని ద్రష్టిలో ఉంచుకునే కాంగ్రెస్ పార్టీ - తెలంగాణ రాష్ట్ర సమితి రెండు పార్టీలు ఆంధ్రుల వైపే తిరుగుతున్నాయి. గత ఎన్నికల్లో కూడా తెలంగాణలో సెటిల్ అయిన ఆంధ్రుల ఓట్లే కీలకం అయ్యాయి. అయితే విభజన కోపంలో ఉన్న ఆంధ్రులు తెలంగాణ రాష్ట్ర సమితిని - విభజించిన కాంగ్రెస్ పార్టీని కాదని తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేశారు. అయితే ఎన్నికల అనంతరం తెలుగుదేశం ఎమ్మెల్యేలు తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిపోయారు. దీంతో తెలంగాణలో ఉన్న సెటిలర్లు కినుక వహించారు. ఈ కసితోనే ఇన్నాళ్లూ గడిపారు. మళ్లీ ఎన్నికల సమయం వచ్చేసింది. ఈసారి వారి ఓట్లు అన్ని పార్టీలకు చాలా ముఖ్యమైనవిగా మారాయి. దీనిని ముందుగా గుర్తించిన కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్‌ కు ప్రత్యేక హోదాపై స్పందించింది. కేంద్రంలో తాము అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌ కు ప్రత్యేక హోదా ఇస్తామంటూ ప్రకటించింది. దీని ప్రభావం తెలంగాణలో జరిగే ఎన్నికలపై ఉంటుందని ఇక్కడి కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. అందుకే ఇక్కడున్న సెటిలర్లలో కొందరికి కాంగ్రెస్ పార్టీ నుంచి టిక్కట్లు కూడా ఇస్తామని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఇక హైదరాబాద్ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ కూడా సెటిలర్లను ఆకట్టుకునే పనిలో భాగంగా హైదరాబాద్ శివారులోనే తన తొలి సభను ఏర్పాటు చేశారు.

ఇక తెలంగాణ రాష్ట్ర సమితి కూడా ఆంధ్రుల ఓట్లపైనే కన్నేసింది. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు ఇక్కడున్న వారంతా తెలంగాణ వారే అనే ప్రకటన చేశారు. అయితే ఆంధ్రులు మాత్రం ఈసారి తెలంగాణ రాష్ట్ర సమితికి ఓటు వేసే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి. దీనికి కారణం తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన నాయకులే. లోక్‌ సభలో కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టిన సమయంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీలు వ్యవహరించిన తీరు - ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌ కు ప్రత్యేక హోదా ఇస్తే తమకూ ఇవ్వాలంటూ చేసిన డిమాండ్లు ఇక్కడున్న ఆంధ్రులకు ఆగ్రహం తెప్పించాయి. పైగా ఆంధ్రప్రదేశ్‌ కు ప్రత్యేక హోదా ఇస్తే ఇక్కడున్న పరిశ్రమలు అక్కడికి తరిలిపోతాయన్న వ్యాఖ్యలపై కూడా ఆంధ్రుల్లో వ్యతిరేకతను మరింత పెంచాయి. దీంతో వారంతో ఈసారి తెలంగాణ రాష్ట్ర సమితికి వ్యతిరేకంగా పని చేసే అవకాశాలున్నాయని అంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీని - తెలుగుదేశం పార్టీని నమ్మే స్థితిలో ఆంధ్రులు లేరు. దీంతో వారి ఓట్లు... ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోని ఆంధ్రుల ఓట్లు అనూహ్యంగా వైఎస్ ఆర్ కాంగ్రెస్‌ కు పడే అవకాశాలూ ఉన్నాయని అంటున్నారు.



Tags:    

Similar News