ఆంధ్రుల ఓట్లతో మైండ్ గేమ్

Update: 2016-01-01 17:30 GMT
అధికారంలోకి రాక ముందు నుంచే.. ఉద్యమ కాలం నుంచే మైండ్ గేమ్ లో తెలంగాణ రాష్ట్ర సమితి ఆరితేరిపోయింది. టీఆర్ ఎస్ మైండ్ గేమ్ ముందు ప్రతిపక్షాలు దిగదుడుపే. ఈ విషయం ఇప్పటికే ఎన్నోసార్లు రుజువైంది. అయినా మిగిలిన పార్టీలు బుద్ధి తెచ్చుకోలేదు. దాంతో ఆయా పార్టీలతో టీఆర్ ఎస్ మైండ్ గేమ్ ఆడుతూనే ఉంది. విజయం సాధిస్తూనే ఉంది.

సంక్రాంతి వెళ్లిన తర్వాతనే గ్రేటర్ ఎన్నికలు నిర్వహిస్తామని, వారి ఓట్లతోనే విజయం సాధిస్తామని తాజాగా కేటీఆర్ వ్యాఖ్యానించారు. నిజానికి - సంక్రాంతి ఎన్నికల సమయంలో 16 నుంచి 18 తేదీల మధ్యలో గ్రేటర్ ఎన్నికలు నిర్వహించనున్నారనే ప్రచారం గతంలో జరిగింది. అప్పుడు అయితే ఆంధ్రులు సంక్రాంతికి సొంత ప్రాంతాలకు వెళతారని, దాంతో ఇక్కడి తెలంగాణ ఓట్లన్నీ తమకే పడతాయనేది టీఆర్ ఎస్ వ్యూహంగా చలామణి అయింది. అయితే, ఎమ్మెల్సీ ఎన్నికలు - బీసీ రిజర్వేషన్ - వార్డుల రిజర్వేషన్ ఖరారు కాకపోవడం.. అప్పట్లో కేసీఆర్ ఆదేశించినా కమిషనర్ సోమేశ్ కుమార్ జాప్యం చేయడంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరలేదనే ప్రచారం కూడా జరిగింది.

ఇక గత ఏడాదిన్నరగా ఆంధ్రులపై దాడులు జరగలేదు కదా అని కేటీఆర్ ప్రశ్నించడాన్ని టీడీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. నిజానికి తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వెంటనే ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చినవారే ధ్యేయంగా టీఆర్ ఎస్ వర్గాలు పావులు కదిపాయని, ఒకటి రెండు చోట్ల దాడులు జరిగాయని, అయితే, ప్రస్తుతం శాంతి భద్రతల అంశాన్ని గవర్నర్ చేతిలో పెట్టడం, హైదరాబాద్ లో శాంతి భద్రతలకు సంబంధించి ఏ చిన్న సంఘటన జరిగినా శాంతి భద్రతలు మొత్తం ప్రభుత్వం నుంచి గవర్నర్ చేతికి బదిలీ అయిపోయే పరిస్థితిని తాము తీసుకు వచ్చామని, ఆంధ్రులపై దాడులు జరగకుండా ఉండడానికి అదే కారణమని టీడీపీ నేతలు వివరిస్తున్నారు. గ్రేటర్ లో టీఆర్ ఎస్ అధికారంలోకి వస్తే దాడులు జరిగే అవకాశాలు ఉండవచ్చని, కేటీఆర్ మైండ్ గేమ్ కు తలొగ్గరాదని భావిస్తున్నారు.
Tags:    

Similar News