నెల్లూరు వైసీపీలో బాబాయ్ అబ్బాయ్ పోరు

Update: 2023-01-26 18:00 GMT
నెల్లూరు సిటీ వైసీపీలో రాజకీయం రోజురోజుకీ వేడెక్కుతోంది. నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసేది తానేనని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పదేపదే చెప్పుకొంటున్నారు. ఆయన్ను వెంకటగిరి నియోజకవర్గానికి మారుస్తారన్న ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతుండడంతో ఆ ప్రచారానికి చెక్ పెట్టడం కోసం అనిల్ కుమార్ రోజూ ఇలా చెప్పుకోవాల్సి వస్తోంది.

అయితే.. అనిల్ కుమార్‌కు సెగ తగలడానికి కారణం ఎవరో కాదు, ఆయన సొంత బాబాయే. అనిల్‌ను రాజకీయంగా పైకి తీసుకురావడంతో పాటు ఆయన మంత్రిగా ఉన్న కాలంలో నియోజకవర్గ బాధ్యత అంతా తానే చూసుకున్న అనిల్ బాబాయి నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ ఇప్పుడు అసెంబ్లీలో అడుగు పెట్టాలనుకుంటున్నారు.

ఆ క్రమంలోనే ఇద్దరి మధ్య రగడ మొదలైంది.ఇది హఠాత్తుగా మొదలైంది ఏమీ కాదు.. అనిల్ మంత్రి పదవి పోయినప్పటి నుంచి రూప్ కుమార్ యాదవ్ జోరు పెంచారు. గత ఆగస్టులో ఆయన ఏకంగా నెల్లూరులో వైసీపీ రెండో కార్యాలయం కూడా శంకు స్థాపన చేశారు. జగనన్న భవన్‌ పేరుతో కొత్త కార్యాలయానికి రూప్‌కుమార్‌ శంకుస్థాపన చేశారు. అప్పటికే అనిల్ గతంలో రాజన్న భవన్ పేరుతో ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు.

నెల్లూరు కార్పొరేషన్‌ ఎన్నికల్లో గెలిచిన తర్వాత జగన్ తనకు డిప్యూటీ మేయర్‌గా బాధ్యతలు అప్పగించారని, కార్యకర్తలు, నాయకులు తన వద్దకు రావడానికి వీలుగా పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుంటున్నానని రూప్ కుమార్ చెబుతూ వస్తున్నారు. ప్రస్తుతం బాబాయ్, అబ్బాయి మధ్య ఏమాత్రం పొసగడం లేదు సరికదా రూప్ కుమార్ కూడా జగన్‌కు సన్నిహితంగానే మెలగుతుండడంతో అనిల్ కుమార్‌కు టికెట్ భయం మొదలైంది.

మరోవైపు నెల్లూరు జిల్లాలో వైసీపీ నేతలు ఎవరితోను అనిల్ కుమార్‌ యాదవ్‌కు సత్సంబంధాలు లేకపోవడంతో ఆయనకు మద్దతుగా మాట్లాడేవారే కరవవుతున్నారు. ప్రధానంగా రెడ్డి సామాజిక వర్గం నేతలతో అనిల్ మొదట్లో కయ్యానికి కాలు దువ్వడంతో, మంత్రి పదవి పోయిన తర్వాత ఆయనకు ఇబ్బందులు తప్పడం లేదు. ఆయన ప్రత్యర్థి ఎమ్మెల్యేలు కూడా రూప్ కుమార్ యాదవ్‌ను ఎంకరేజ్ చేస్తున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో అనిల్‌ను వెంకటగిరి పంపుతారన్న ప్రచారం జరుగుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News