తిరుపతిలోమరో ఎన్నికల రచ్చ.. వైసీపీ అలాంటి దౌర్జన్యాలకు తెర తీసిందా?

Update: 2022-07-20 08:30 GMT
ఎన్నికలు ఎన్నికలే. అది ఎంపీ స్థానానికైనా.. ఎంపీపీ స్థానానికైనా అన్నట్లుగా ఏపీ అధికారపక్షం వైసీపీ తీరు ఉందన్న మాట ప్రతిపక్షాల నోటా వినిపిస్తోంది. ఆ మధ్యన తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా.. ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడూ చూడని సిత్రాల్ని చూడటం తెలిసిందే అని అంటున్నారు . తిరుపతితో ఏ మాత్రం సంబంధం లేని ప్రాంతాల నుంచి బస్సుల్లో వచ్చి మరీ ఓటేశారంటూ విపక్షాలు విరుచుకుపడినా.. జరగాల్సింది జరిగిందే తప్పించి.. అలాంటి వాటిని అడ్డుకున్నది లేదు అని చెబుతున్నారు . చివరకు మీడియా సైతం వీడియోల ఆధారంతోమొత్తుకున్నా పట్టించుకున్న నాథుడే లేడన్న ఆరోపణ తెలిసిందే.

ఇదిలా ఉంటే.. ప్రతి ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవటమే కాదు.. తాము తప్పించి మరెవరూ గెలవకూడదన్న కాన్సెప్టు విషయంలో వైసీపీ నేతలు చాలా బలంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఈ తీరు కొత్త రచ్చకు కారణమవుతోంది.

ప్రస్తుతం తిరుపతిలో నగర టౌన్ బ్యాంక్ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఈ ఎన్నికల్లోనూ అధికార పార్టీ పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతోందన్నది టీడీపీ నేతల వాదన. ఈ బ్యాంకులో సభ్యులు కాని వారితోనూ ఓట్లు వేయిస్తున్నారంటూ మండిపడుతున్న వారు.. తాము బలపరిచిన అభ్యర్థులను బయటకు లాగేసి మరీ.. ఇష్టారాజ్యంగా ఎన్నికల్ని నిర్వహిస్తున్నట్లుగా తెలుగు తమ్ముళ్లు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఎన్నికల పోలింగ్ సందర్భంగా జరుగుతున్న అక్రమాలపై ప్రశ్నిస్తే వారిని అరెస్టు చేస్తున్నారంటున్నారు. బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు ఈ ఎన్నికల పోలింగ్ ముగుస్తుంది. మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఓట్లను లెక్కించనున్నారు. పోలింగ్ సందర్భంగా వైసీపీ నేతలు ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారన్నది టీడీపీ నేతల ప్రధాన ఆరోపణ.

దొంగ ఐడీ కార్డుల్ని ప్రింట్ చేయించి ఎన్నికల్లో ఓట్లు వేయించటం అరాచకానికి పరాకాష్ఠగా చెబుతున్నారు. అధికార బలంతో టౌన్ బ్యాంక్ ఎన్నికల్లో గెలవొచ్చేమో కానీ సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం గెలుపు సాధ్యం కాదని స్పష్టం చేస్తున్నారు.

పట్టపగలు వైసీపీ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుంటే.. పోలీసులు చూస్తుండిపోతున్నారే తప్పించి ఇంకేమీ చేయటం లేదని తెలుగు తమ్ముళ్లు మండిపడుతున్నారు. టౌన్ బ్యాంక్ ఎన్నికల్లోని అక్రమాలపై ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకోవటంతో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. మొత్తంగా చూస్తే.. తిరుపతి టౌన్ బ్యాంక్ ఎన్నికలు మరోసారి టెంపుల్ టౌన్ లో ఉద్రిక్త వాతావరణాన్ని తీసుకొచ్చాయని చెబుతున్నారు.
Tags:    

Similar News