క్రికెటర్ రచిన్ రవీంద్ర పేరు వెనుక మరో స్టోరీ ఉందా?

Update: 2021-11-20 05:04 GMT
'రచిన్ రవీంద్ర'.. పేరు విన్నంతనే మనోడిలా ఉన్నాడన్న భావన కలుగుతుంది. ఆ అంచనా నిజమే. పేరుకు న్యూజిలాండ్ క్రికెటర్ అయినా.. మూలాలు అన్ని మనమే. మామూలుగా అయితే టీమిండియా జెర్సీ అతడు వేసుకొని ఉండాల్సింది. కానీ.. అతగాడి తల్లిదండ్రులు న్యూజిలాండ్ కు వెళ్లి.. అక్కడ స్థిరపడిపోవటం.. అక్కడే పుట్టిన రచిన్ రవీంద్ర క్రికెటర్ గా ఎదగటమే కాదు ఈ రోజున కివీస్ జట్టులో ఆడుతున్నాడు. టీమిండియాను ఎదుర్కొంటున్నాడు.

రచిన్ రవీంద్ర తల్లిదండ్రులు బెంగళూరుకు చెందిన వారు. తండ్రి పేరు రవి క్రిష్ణమూర్తి కాగా.. తల్లి పేరు దీపా క్రిష్ణమూర్తి. 1990లలోనే వీరు న్యూజిలాండ్ కు వెళ్లి స్థిరపడిపోయారు. క్రికెట్ మీద ఉన్న ఆసక్తితో ఎదిగిన రచిన్ పేరు మిగిలిన వారికి భిన్నంగా ఉంటుందని చెప్పాలి. చాలామంది అతడి పేరు వెనుక స్టోరీ ఉందని.. రాహుల్ ద్రవిడ్.. సచిన్ టెండూల్కర్ రెండు పేర్లను కలిపి రచిన్ అన్న పేరును పెట్టారా? అన్న సందేహం పలువురు వ్యక్తం చేస్తుంటారు. ఇదే విషయాన్ని రచిన్ వద్ద ప్రస్తావిస్తే.. 'నాకు ఆ విషయం తెలీదు. ఎప్పుడూ నా పేరు గురించి నా తల్లిదండ్రుల్ని అడగలేదు. ఈ విషయం మీద క్లారిటీ కావాలంటే మా పేరెంట్స్ నే మీరు అడగాలి' అంటూ వ్యాఖ్యానించాడు.

ప్రస్తుతం న్యూజిలాండ్ జట్టు తరఫున టీమిండియాతోతలపడుతున్న అతడు.. పలు ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు. 2016, 2018లలో కివీస్ అండర్ 19 జట్టుకు ప్రాతినిధ్యం వహించిన రచిన్.. అప్పట్లో టీమిండియా అండర్ 19 జట్టుతో తాను తలపడినట్లుగా చెప్పాడు. అనంతరం ఇండియా ఏ జట్టుతోనూ తాను ఆడినట్లు చెప్పాడు. ఈ సందర్భంగా యువ ఆటగాళ్లకు కోచ్ గా వ్యవహరిస్తున్న రాహుల్ ద్రవిడ్ తో పరిచయమైందని.. ఆయన నుంచి పలు మెలుకువలు నేర్చుకున్నట్లు చెప్పారు.

ఈ ఏడాది బంగ్లాదేశ్ టూర్ లో కివీస్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన న్యూజిలాండ్ జట్టులో రచిన్ కు చోటు లభించింది. దీంతో అంతర్జాతీయ క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఇతడు.. ఇప్పుడు టీమిండియాతో జరుగుతున్న టీ20 సిరీస్ లోనూ కివీస్ జట్టు తరఫున ఆడుతున్నాడు. ఈ సందర్భంగా రాహుల్ ద్రవిడ్ నుంచి మరిన్ని మెలుకువలు నేర్చుకునే అవకాశం ఉందని తాను భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక.. రచిన్ గురించి టీమిండియా ఆటగాడు ఆశ్విన్ మాట్లాడుతూ.. రచిన్ ప్రపంచ స్థాయి స్పిన్నర్ అని.. అతడికి మంచి రికార్డు ఉందన్నారు. ఆశ్విన్ ను కలిసే అవకాశం వస్తే.. అతడి నుంచి కొత్త విషయాలు నేర్చుకుంటానని చెబుతున్నారు.

ఇక.. ద్రవిడ్ గురించి మరిన్ని విషయాలు చెబుతూ.. 'సర్..లెజెండరీ ఆగటాడు. ఆయన అండర్ 19, ఇండియా ఏ జట్టుకు శిక్షణ ఇస్తున్న వేళలోనే వారు కివీస్ పర్యటనకు వచ్చారు. అప్పుడే ఆయనతో పరిచయమైంది. ఆటలో చాలా విషయాల్ని నేర్చుకున్నా. మళ్లీ ఈ సిరీస్ ఆడుతున్నందున మళ్లీ ద్రవిడ్ ను కలిసే అవకాశం దక్కింది. ఆయన నుంచి మరిన్ని విషయాల్ని నేర్చుకునేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ద్రవిడ్ తో కలిసి ప్రయాణిస్తే.. నా కెరీర్ కు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నానంటూ రచిన్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
Tags:    

Similar News