చోక్సీ డ‌మ్మీ గేమ్.. ఏం చేశాడో తెలుసా?

Update: 2021-06-17 08:30 GMT
వేల కోట్ల రూపాయల బ్యాంకు రుణాలు ఎగ్గొట్టి వ‌జ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ.. విదేశాల‌కు పారిపోయిన సంగ‌తి తెలిసిందే. ఇండియా నుంచి అంటిగ్వా పారిపోయిన చోక్సీ.. ఆ త‌ర్వాత అక్క‌డి నుంచి డొమినికా వెళ్లి, అక్క‌డి అధికారుల‌కు ప‌ట్టుబ‌డ్డాడు. అత‌డిని భార‌త్ ర‌ప్పించేందుకు కేంద్రం ప్ర‌య‌త్నిస్తోంది. అక్ర‌మంగా త‌మ దేశంలోకి ప్ర‌వేశించిన కేసులో.. అక్క‌డ న్యాయ విచార‌ణ సాగుతోంది. అత‌న్ని తీసుకొచ్చేందుకు ప్ర‌త్యేక విమానంలో డొమినికా వెళ్లిన బృందం.. విచార‌ణ వాయిదా ప‌డ‌డంతో వ‌ట్టి చేతుల‌తో తిరిగి వ‌చ్చింది.

అయితే.. చోక్సీ చేసిన నేరాల్లో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. 2017లో ఇండియా వ‌దిలి ఆంటిగ్వా పారిపోయిన చోక్సీ.. అంత‌కు ముందే తన ప‌థ‌కాన్ని ప‌క్కాగా అమ‌లు చేసేందుకు ప్ర‌య‌త్నించిన‌ట్టు సీబీఐ వెల్ల‌డించింది. తాజాగా సిద్ధం చేసిన అనుబంధ ఛార్జి షీట్లో ఈ వివ‌రాలు పేర్కొన్న‌ట్టు ఎక‌న‌మిక్స్ టైమ్స్ ప‌త్రిక తెలిపింది.

హాంకాంగ్ లో త‌న సంస్థ‌లో ప‌నిచేస్తున్న వారిని డైరెక్ట‌ర్లుగా చూపించి పారిపోవాల‌ని ఎత్తు వేశాడ‌ట‌. అంతేకాదు.. ఆ డ‌మ్మీ డైరెక్ట‌ర్ల‌ను కూడా జాగ్ర‌త్త ప‌డాల‌ని సూచించాడ‌ట‌. ఇండియా నుంచి ఈడీ అధికారులు రావొచ్చ‌ని, అందువ‌ల్ల మీరు కూడా ఏ బ్యాంక్ కో, సింగ‌పూరో పారిపోవాల‌ని చెప్పాడ‌ట‌. ఆ విధంగా తాను క్రిమిన‌ల్ నేరం చేస్తున్నాన‌నే విష‌యం చోక్సీకి ముందే ఊహించాడ‌ని అనుబంధ ఛార్జి షీట్ లో సీబీఐ వెల్ల‌డించింద‌ట‌.

ఈ కేసులో మొత్తం 12 మంది పేర్ల‌ను సీబీఐ చేర్చింది. ఇందులో పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్ మాజీ అధికారి విపుల్ చిటాలియా పేరు కూడా ఉండ‌డం గ‌మ‌నార్హం. చోక్సీ వేల కోట్లు మోస‌గించింది పంజాబ్ బ్యాంక్ నే కావ‌డం గ‌మ‌నించాల్సిన అంశం. మొత్తానికి ప‌క్కాగా ప్లాన్ చేసి, వేల కోట్లు దొబ్బేసిన చోక్సీ.. విదేశంలో దాక్కున్నాడు. పైగా.. తాను భార‌త పౌర‌స‌త్వం వ‌దిలేసుకున్నాన‌ని, తాను భార‌తీయుడిని కానే కాద‌ని చెబుతున్నాడ‌ట‌. మ‌రి, డొమినికాలో కేసు విచార‌ణ ఎప్పుడు పూర్త‌వుతుందో? చోక్సీని ఇండియాకు పట్టుకురావడం ఎప్పుడు సాధ్యమవుతుందో చూడాలి.


Tags:    

Similar News