ఆ మంత్రికి చెందిన మరో వీడియో వైరల్‌!

Update: 2022-11-23 07:34 GMT
గుజరాత్‌ ఎన్నికల ముంగిట ఆమ్‌ ఆద్మీ పార్టీకి చిక్కులు తప్పడం లేదు. గుజరాత్‌లో డిసెంబర్‌ 1, 5 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ గత 25 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీని ఓడించి అధికారంలోకి రావాలని అరవింద్‌ కేజ్రీవాల్‌ సారథ్యంలోని ఆమ్‌ ఆద్మీ పార్టీ ఉవ్విళ్లూరుతోంది.

అయితే ఆప్‌కు తమ పార్టీకే చెందిన మంత్రి సత్యేందర్‌ జైన్‌తో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మనీలాండరింగ్‌ కేసులో ఢిల్లీలోని అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న సత్యేందర్‌ జైన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ఈ ఏడాది మే నెలలో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

ఈ ఏడాది మే నుంచి సత్యేందర్‌ జైన్‌ ఢిల్లీలోని తిహార్‌ జైలులో ఉన్నారు. అయితే అక్కడ ఆయనకు సకల మర్యాదలు, రాజభోగాలు లభిస్తున్నాయని విమర్శలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం ఒక వీడియో హల్‌చల్‌ చేసిన సంగతి తెలిసిందే. అందులో ఒక వ్యక్తి చేత జైలు గదిలోనే సత్యేందర్‌ జైన్‌ థాయ్‌ మసాజ్, మర్దనాలు చేయించుకున్నట్టు వెల్లడైంది. ఈ వీడియో తీవ్ర దుమారం రేపింది.

బీజేపీ ఈ వీడియోను రాజకీయ అస్త్రంగా మార్చుకుని ఆప్‌పై తీవ్ర విమర్శలు చేసింది. దీంతో ఇబ్బందుల్లో పడ్డ ఆప్‌.. సత్యేందర్‌ జైన్‌కు అనారోగ్యం ఉందని.. కోర్టు అనుమతి మేరకే ఆయన చికిత్స పొందుతున్నారని ఎదురుదాడి చేసింది. చివరకు ఆ మసాజులు, మర్దనాలు చేస్తున్న వ్యక్తి వైద్య సిబ్బంది కాదని.. ఆ జైలులోనే శిక్ష అనుభవిస్తున్న రేపిస్టు అని తేలింది. దీంతో బీజేపీ తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టింది. రేపిస్టును ఆప్‌ ఫిజియోథెరపిస్టు అని ప్రచారం చేసిందని ధ్వజమెత్తింది.

మళ్లీ ఇంతలోనే సత్యేందర్‌ జైన్‌కు సంబంధించిన వీడియో ఒకటి తాజాగా వైరల్‌ అవుతోంది. జైలులో ఆయనకు ప్రత్యేక వసతులు అందుతున్నాయంటూ మరో వీడియో వెలుగులోకి వచ్చింది. మంత్రికి సలాడ్లు, పండ్లు, ఇతర ప్రత్యేక ఆహారం అందుతోంది. ఈ మేరకు సీసీ టీవీ ఫుటేజ్‌ దృశ్యాలు స్పష్టం చేస్తున్నాయి.

తాను జైలులో 28 కిలోలు తగ్గిపోయానని సత్యేందర్‌ జైన్‌ చెప్పినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆయన బరువు తగ్గకపోగా 8 కిలోలు బరువు పెరిగారని వెల్లడైంది. దీంతో ఆయనకు జైల్లో సకల రాజభోగాలు, మంచి ఆహారం అందుతున్నట్టు స్పష్టమైంది. దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోతో ఆప్‌ మరోమారు చిక్కుల్లో పడటం ఖాయంగా కనిపిస్తోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.


Full View
Tags:    

Similar News