మోడీ బర్త్ డే...హరిబాబు షాకింగ్ కామెంట్స్

Update: 2020-09-17 17:30 GMT
పార్టీ గొప్పా? ఆ పార్టీలో తనకంటూ ఓ ఇమేజ్ ఉన్న నాయకుడు గొప్పా? ఈ ప్రశ్నకు మన దేశంలోని రాజకీయ పార్టీలు భిన్నవాదనలు వినిపిస్తాయి. అయితే, ఆర్ఎస్ఎస్ మహావృక్షానికి పట్టుకొమ్మ అయిన బీజేపీలో మాత్రం వ్యక్తికన్నా పార్టీనే గొప్ప. 130 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీలో సిద్ధాంతాలకు ఇచ్చే ప్రాధాన్యత కన్నా బీజేపీలో ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలకు ఇచ్చే ప్రాధాన్యత ఎక్కువని చెప్పవచ్చు. మరీ ముఖ్యంగా బీజేపీలో వ్యక్తి పూజకు అస్సలు తావులేదు. పదవులు, హోదాలు, గౌరవాలు, వ్యక్తుల కంటే నమ్మిన సిద్ధాంతం గొప్పదన్నది ఆర్ఎస్ఎస్ భావన. అందుకే, ఆ సంస్థ అనుబంధంగా ఉన్న బీజేపీలో రాజకీయ దిగ్గజం, బీజేపీలో భీష్ముడు వంటి వాజ్ పేయి అంతటి గొప్ప నేత కూడా పార్టీ సిద్ధాంతానికి కట్టుబడే పనిచేశారు. అయితే, పరిస్థితులు మారాయి. కాలం మారింది. దానికి తగ్గట్లుగానే రాజకీయం మారింది. ఈ నేపథ్యంలోనే తాజాగా బీజేపీలో పార్టీ కంటే ప్రధాని మోడీ ఇమేజ్ కు ఎక్కువ ప్రాధాన్యం లభిస్తోందన్న అభిప్రాయాలు కొందరు బీజేపీ నేతలు పరోక్షంగా వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని మోడీ జన్మదినాన ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు హరిబాబు చేసిన కామెంట్ చర్చనీయాంశమైంది.

బీజేపీలో నాయకుల జన్మదినాలు ఉత్సవాలుగా జరిపే కల్చర్ లేదంటూ హరిబాబు చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. ఏపీలో ఏడు రోజుల పాటు మోడీ జన్మదిన వేడుకలు నిర్వహించడంపై హరిబాబు పరోక్షంగా కామెంట్ చేశారని టాక్ వస్తోంది.వాస్తవానికి మోడీ ప్రధాని పగ్గాలు చేపట్టాక...బీజేపీ కన్నా మోడీనే ఎక్కువ అన్న భావన చాలామంది బీజేపీ కార్యకర్తల్లో కలిగిందన్న భావన ఉంది. ఇంకా చెప్పాలంటే మోడీనే పార్టీకి సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అని, ఎన్నికల్లో మోడీ ఫేస్ వ్యాల్యూ, ఇండివిడ్యువల్ ఇమేజ్ తోనే బీజేపీ గెలుస్తోందనన్న వాదన మోడీ అభిమానుల్లో ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మోడీ పుట్టిన రోజు నాడు హరిబాబు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. మోడీ పుట్టిన రోజు గతంలో జరిగినా కూడా ఒక్క రోజు మాత్రమే కార్యక్రమాలు జరిగేవి. కానీ, ఇపుడు ఏపీలో ఏడు రోజుల పాటు వేడుకలు నిర్వహించడంపైనే హరిబాబు పరోక్షంగా కామెంట్స్ చేశారని టాక్ వస్తోంది. మరి, హరిబాబు వ్యాఖ్యలపై బీజేపీ నేతల స్పందన ఎలా ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారింది.
Tags:    

Similar News