వెనక్కు తగ్గని దేవధర్..చంద్రబాబుకు హెచ్చరిక!

Update: 2019-07-06 16:38 GMT
భారతీయ జనతా పార్టీ ఏపీ వ్యవహారాల ఇన్ చార్జి  సునీల్ దేవధర్ తన ప్రకటనలతో పతాక శీర్షికలకు ఎక్కుతున్నాడు. తెలుగుదేశం పార్టీ తరఫున ఇటీవల ఎన్నికల్లో నెగ్గిన  23 మంది ఎమ్మెల్యేల్లో తమతో 18 మంది టచ్లో ఉన్నారని ప్రకటించి ఇది వరకే  ఆశ్చర్యపరిచారు ఈ బీజేపీ నేత.

ఆ ప్రకటన అంత నమ్మశక్యంగా లేదని విశ్లేషకులు అంటున్నారు. ఉత్తుత్తిగా అలా మాట్లాడుతున్నారని, తెలుగుదేశం పార్టీని బెదరగొట్టే ప్రయత్నంలో భాగంగానే సునీల్ దేవధర్ అలా మాట్లాడారనే  టాక్ వినిపిస్తూ ఉంది.  టచ్లో ఉంటే ఎందుకు చేర్చుకోవడం లేదనే.. ప్రశ్నకు దేవధర్ నుంచి కానీ, బీజేపీ నుంచి కానీ సమాధానాలు లేవు.

ఆ సంగతలా ఉంటే.. మరోసారి ఘాటు వ్యాఖ్యలు  చేశారు ఈ బీజేపీ నేత. ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లడం ఖాయమని దేవధర్ వ్యాఖ్యానించారు. గుంటూరులో ఈ మేరకు ఆయన వ్యాఖ్యానించారు.

చంద్రబాబు నాయుడు హయాంలో భారీ ఎత్తున  అవినీతి చోటు చేసుకుందని.. దానిపై విచారణ జరగాల్సిన అవసరం ఉందని దేవధర్ అన్నారు.  చంద్రబాబు నాయుడు హయాంలో చోటు చేసుకున్న అవినీతి గురించి ఏపీ లోని జగన్ మోహన్  రెడ్డి ప్రభుత్వం పూర్తి నివేదిక ఇవ్వాలని దేవధర్ అన్నారు.  అందుకు సంబంధించి పూర్తి వివరాలతో కేంద్రానికి నివేదికలు సమర్పించాలని.. చంద్రబాబుపై తప్పకుండా చర్యలు ఉంటాయని  దేవధర్ ప్రకటించడం గమనార్హం.

కరకట్ట మీద నివాసం నుంచి చంద్రబాబును  ఖాళీ చేయించాలని ఏపీ  ముఖ్యమంత్రి జగన్ మోహన్  రెడ్డికి సలహా ఇచ్చారు దేవధర్. గరిష్టంగా రెండేళ్లలో చంద్రబాబు నాయుడు అవినీతి పై పూర్తి గా తేలిపోతుందని, అప్పుడు ఆయన జైలుకు వెళ్లక తప్పదని  దేవధర్ వ్యాఖ్యానించడం విశేషం.


Tags:    

Similar News