ఏపీ బీజేపీ ఆఫీసుల్లో ఇలా కూడా చేస్తారా? షాకింగ్ వీడియో బయటకు

Update: 2022-01-02 05:42 GMT
అదేమీ కాలేజీ పిల్లల ఫంక్షన్ కాదు. వయోధికులు సరదాగాఏర్పాటు చేసుకున్నన్యూఇయర్ పార్టీ కూడా కాదు. ఇదంతా పక్కన పెడదాం.. పెద్ద పెద్ద స్థానాల్లో ఉండి.. కుర్రాళ్లుగా మారిపోయే కాలేజీ రీయూనియన్ వేడుక కూడా కాదు. ఒక రాజకీయ పార్టీ.. అందునా నిద్ర లేచింది మొదలు సంప్రదాయం.. సంస్కృతి.. మట్టి మసానం అంటూ అదే పనిగా విలువల గురించి.. గౌరవ మర్యాదల గురించి.. జాతి జనులకు దేశభక్తి గుర్తించి లెక్చర్లు ఇచ్చే పార్టీ ఆఫీసులో ఊహించని ఘటన అందరిని ఆశ్చర్యానికి గురి చేయటమే కాదు.. అంతకు మించి షాకింగ్ గా మారింది.

కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకొని మిగిలిన ఆఫీసుల్లో మాదిరే.. రాజకీయ పార్టీ ఆఫీసుల్లో కేక్ కటింగ్ లాంటివి చేయటం ఈ మధ్యన మొదలైంది. అందులో భాగంగా ఏపీ బీజేపీకి చెందిన విజయవాడ పార్టీ ఆఫీసులో అలాంటి వేడుకను ఈ జనవరి1న ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసిన సంతోషంలో పాత పాటల్ని ప్లే చేశారు. అలా ప్లే చేసిన పాటల్లో ఒకటి.. అప్పటి సూపర్ హిట్ పాట.. ‘ఆరేసుకోబోయి పారేసుకున్నాను’ను ప్లే చేశారు.

సర్లే.. దాన్ని కూడా సరిపెట్టుకుందామనుకోవచ్చు. అక్కడే మొదలైంది మరో ఆరాచకం. నేతలు ఆ పాటకు వేదిక మీద స్టెప్పులు వేయటం.. కాసేపటికి మహిళా నేత ఒకరు.. బీజేపీ నేతతో కలిసి స్టెప్పులు వేసిన తీరు నోట మాట రాకుండా చేస్తోంది. ఒక జాతీయ పార్టీ కార్యాలయంలో.. ప్రజా క్షేమం గురించి.. ప్రజల కష్టాల గురించి.. వారి ఈత బాధల గురించి గళం విప్పటం వదిలేసి.. ఇలా పాటలకు పార్టీ కార్యాలయంలో స్టెప్పులు వేస్తున్న వీడియోకు విస్మయానికి గురవుతున్నారు.

ఎలాంటి పార్టీలో ఎలా జరుగుతుంది? అన్నదిప్పుడు చర్చగా మారింది. మూడు.. నాలుగు రోజుల ముందు ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ.. తాము అధికారంలోకివస్తే చీప్ లిక్కర్ ను రూ.75కు అందిస్తామని.. ఒకవేళ ఆర్థిక పరిస్థితి బాగుంటే రూ.50కు ఇస్తామని చెప్పిన వైనం సంచలనంగా మారింది. ఇది ఒక కొలిక్కి రాక ముందే.. తాజాగా బయటకు వచ్చిన ఈ వీడియో పార్టీ ఇమేజ్ ను దారుణంగా దెబ్బ తీస్తుందన్నమాట వినిపిస్తోంది.





Full View

Tags:    

Similar News