శ‌భాష్ ద్వివేది సాబ్.. ఇప్ప‌టికైనా మేలుకున్నారు?

Update: 2019-04-18 08:23 GMT
ఏపీలో ఎన్నిక‌ల గంట మోగే వ‌ర‌కూ గోపాల కృష్ణ ద్వివేది పేరు ప‌రిచ‌యం ఉన్నోళ్లు చాలా త‌క్కువ‌మందే. సీనియ‌ర్ ఐఏఎస్ అధికారిగా.. ముక్కుసూటి మ‌నిషిగా.. నిజాయితీకి నిలువెత్తు రూపంగా ఆయ‌న్ను ప‌లువురు చెబుతుంటారు. పెద్ద ప్ర‌లోభాల‌కు సైతం లొంగ‌కుండా.. ఒక ప‌ట్టాన కొరుకుడుప‌డ‌ని తీరు ఆయ‌న సొంతమ‌న్న పేరుంది. దీంతో.. ఇలాంటి వ్య‌క్తి నేతృత్వంలో ఏపీలో ఎన్నిక‌లు అంటే వివాదాల‌కు దూరంగా జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని ప‌లువురు భావించారు. అదేం సిత్ర‌మో కానీ.. ఎన్నిక‌ల వేళ జ‌రిగిన ర‌చ్చ అంతా ఇంతా కాదు.

ప‌క్క‌నున్న తెలంగాణ‌లో ఈవీఎంలు సుబ్బ‌రంగా ప‌ని చేస్తే.. ఏపీలో మాత్రం మ‌హా ఇబ్బందిని పెట్టేశాయి. ఈవీఎంల మొరాయింపుతో గంట‌లు.. గంట‌ల పాటు ఓట‌ర్లు క్యూ లైన్లో నిలుచొని ఓటు వేయాల్సిన ప‌రిస్థితి. అంతేనా..?  ఉద‌యం ఏడు గంట‌ల‌కు మొద‌లైన పోలింగ్ ప‌క్క‌రోజు తెల్ల‌వారుజామున ఐదు గంట‌ల వ‌ర‌కూ కొన‌సాగిన తీరును చూసి ముక్కున వేలేసుకున్న వారెంద‌రో.

ఈవీఎంలు ఇంత అధ్వానంగా ప‌ని చేయ‌టం ఏమిటి?  దానికి కార‌ణం ఏమిటి?  అన్న ప్ర‌శ్న‌ల‌తో పాటు.. ద్వివేది ప‌ని తీరు మీద సందేహాలు వ్య‌క్త‌మ‌య్యాయి. పోలింగ్ ఏర్పాట్ల తీరు మీద.. ఈవీఎంల మొరాయింపు మీద అధికార తెలుగుదేశం పార్టీ అభ్యంత‌రాలు లేవ‌నెత్తింది. కనీస ఏర్పాట్ల‌తో పాటు.. భ‌ద్ర‌త విష‌యంలోనూ సరిగా ప్లాన్ చేయ‌లేద‌న్న విమ‌ర్శ చేసింది. మొద‌ట్లో విప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ నేత‌లు ఈ అంశాల మీద గ‌ళం విప్ప‌న‌ప్ప‌టికి.. తాజాగా మాత్రం అందుకు భిన్నంగా వారు కూడా ఫిర్యాదులు చేస్తున్న ప‌రిస్థితి.

ఇలాంటివేళ‌.. దాదాపుగా పోలింగ్ జ‌రిగిన ఏడు రోజుల త‌ర్వాత ద్వివేది సాబ్ స్పందించ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. పోలింగ్ కేంద్రాల వ‌ద్ద ఓట‌ర్ల కోసం చేసిన ఏర్పాట్లు.. సౌక‌ర్యాలు.. పోలింగ్ కేంద్రాల్లో త‌లెత్తిన ఇబ్బందుల‌పై త‌క్ష‌ణం నివేదిక ఇవ్వాలంటూ జిల్లా క‌లెక్ట‌ర్ల‌కు ఆదేశించ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.

11న జ‌రిగిన ఎన్నిక‌ల‌కు 17న స్పందించ‌టం ఏమిటి?  త‌క్ష‌ణ‌మే నివేదిక పంపాలంటూ హ‌డావుడి చేయటం ఏమిట‌న్న ప్ర‌శ్న‌లు వెల్లువెత్తుతున్నాయి. నియోజ‌క‌వ‌ర్గానికి ముగ్గురు చొప్పున భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్.. ఈసీఐఎల్ నిపుణుల్ని కేటాయించినా.. వారి సేవ‌ల్ని వాడ‌క‌పోవ‌టం ఏమిట‌న్న ఆగ్ర‌హాన్ని ఆయ‌న వ్య‌క్తం చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. నియోజ‌క‌వ‌ర్గాల వారీగా ఈవీఎంల‌లో త‌లెత్తే సాంకేతిక స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం ఈసీఐఎల్ నిపుణుల‌ను కేటాయించినా.. వారికి నియోజ‌క‌వ‌ర్గ మ్యాపుల్ని ఇవ్వ‌క‌పోవ‌టాన్ని గుర్తించిన ద్వివేది.. ఎందుకిలా జ‌రిగింది? అన్న ప్ర‌శ్న‌ను ఇప్పుడు వేస్తుండ‌టం గ‌మ‌నార్హం.

సాయంత్రం ఆరు గంట‌ల త‌ర్వాత పోలింగ్ జ‌ర‌గ‌టానికి కార‌ణాలు ఏమిట‌న్న విష‌యాన్ని వివ‌రంగా త‌మ‌కు తెల‌పాలంటూ ఆదేశాలు జారీ చేయ‌టం. .ఉద్దేశ్య‌పూర్వ‌కంగా త‌ప్పులు చేసిన వారిపై ఎఫ్ ఐఆర్ లు న‌మోదు చేస్తామ‌ని హెచ్చ‌రించ‌టం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. ఎప్పుడూ లేని విధంగా ద్వివేది ప‌ని తీరు మీద అధికార తెలుగుదేశం పార్టీ అసంతృప్తి వ్య‌క్తం చేయ‌టం ఒక ఎత్తు అయితే.. పోలింగ్ ముగిసిన ఇన్ని రోజుల‌కు ద్వివేది స్పందించ‌టం ఏమిట‌న్న‌ది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.



Tags:    

Similar News