రెస్టారెంట్ వ్యాపారంలో చేతులు కాల్చుకున్న క్రికెటర్లు
ఈ తరహాలో ఫుడ్ ఇండస్ట్రీలో పెట్టుబడులు పెట్టి నష్టపోయిన పలువురు టీమిండియా క్రికెటర్ల గురించి తెలిసిన విషయాలివి.;
డబ్బు పుష్కలంగా ఉంటే ఎన్ని ప్రయోగాలు అయినా చేయొచ్చు. వ్యాపారం పేరుతో పెట్టుబడులు పెట్టొచ్చు. కానీ అన్ని వ్యాపారాలు విజయవంతం కావు. కొన్నిసార్లు ఫెయిలైతే తీవ్ర నష్టాలు కూడా మిగలొచ్చు. రెస్టారెంట్ వ్యాపారంలో డబ్బు పెట్టినవాళ్లంతా నాగార్జునలా సక్సెస్ సాధించాలని రూలేమీ లేదు. ఈ తరహాలో ఫుడ్ ఇండస్ట్రీలో పెట్టుబడులు పెట్టి నష్టపోయిన పలువురు టీమిండియా క్రికెటర్ల గురించి తెలిసిన విషయాలివి.
హోటల్ - రెస్టారెంట్ బిజినెస్ లో తీవ్రంగా నష్టపోయిన వారిలో క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ప్రథముడు. 2002లో సచిన్ టెండూల్కర్ ఒక హోటల్ వ్యాపారితో కలిసి `టెండూల్కర్స్` అనే చక్కటి భోజన రెస్టారెంట్‌ను ప్రారంభించాడు. ప్రారంభం ఇది బాగానే రన్ అయింది. ఈ విజయం ఇచ్చిన ఉత్సాహంతో ముంబై, బెంగళూరులో `సచిన్స్` అనే పేరుతో మరికొన్ని అవుట్‌లెట్‌లను అతడు ప్రారంభించాడు. అయితే కథ ఇక్కడే అడ్డం తిరిగింది. వ్యాపారం ఊపందుకోలేదు. 2007లో అన్ని అవుట్‌లెట్‌లు మూసివేసారు. దీనివల్ల తీవ్ర నష్టాలొచ్చాయి. ఇది ఒక రకంగా డబ్బుతో ప్రయోగం.
సౌరవ్ గంగూలీ 2004లో కోల్‌కతాలో `సౌరవ్స్ ఫుడ్ పెవిలియన్` అనే నాలుగు అంతస్తుల రెస్టారెంట్‌ను ప్రారంభించాడు. ప్రారంభంలో రెస్టారెంట్ నడపలేదు. తన పేరును ఉపయోగించినందుకు రాయల్టీ రుసుమును మాత్రమే వసూలు చేశాడు. కానీ రెండు సంవత్సరాల తర్వాత గంగూలీకి ఆశ పెరిగింది. ఆ భవంతిలోని మొత్తం రెస్టారెంట్‌ను పూర్తిగా తన చేతిలోక తీసుకుని నియంత్రించాడు. అయితే ఇది 2011లో మూసివేసారు. తద్వారా ఫుడ్ ఇండస్ట్రీ గంగూలీకి కలిసి రాలేదు.
2006లో ఢిల్లీలోని మోతీ నగర్ ప్రాంతంలో `సెహ్వాగ్స్ ఫేవరెట్స్` అనే శాకాహార రెస్టారెంట్‌ను వీరేందర్ సెహ్వాగ్ ప్రారంభించారు. ప్రారంభం బావుంది. జనం కిటకిటలాడారు. కానీ రెస్టారెంట్‌లో నెమ్మదిగా కస్టమర్లు మాయమయ్యారు. సెహ్వాగ్ సహ యజమానులను మోసం చేశారని ఆరోపిస్తూ కోర్టుకు కూడా లాగారు.
భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి మనవడు దివాకర్ శాస్త్రితో కలిసి అజయ్ జడేజా ఢిల్లీలో `సెన్సో` అనే ఇటాలియన్ రెస్టారెంట్‌ను ప్రారంభించారు. రెస్టారెంట్ ఆశించిన సంఖ్యలో కస్టమర్లను ఆకర్షించడంలో విఫలమైంది. దీని ఫలితంగా భారీ ఆర్థిక నష్టాలు సంభవించాయి. చివరికి వారు వ్యాపారాన్ని మూసివేయాల్సి వచ్చింది.
ప్రస్తుతం విరాట్ కోహ్లీకి మెట్రో నగరాల్లో రెస్టారెంట్లు ఉన్నాయి. కానీ అతడి మొదటి ఫైన్ డైనింగ్ వెంచర్ అంత విజయవంతం కాలేదు. కోహ్లీ 2017లో న్యూఢిల్లీలోని ఆర్కే పురంలో `నువా` అనే తన మొట్టమొదటి రెస్టారెంట్‌ను ప్రారంభించాడు. ప్రారంభ బావుంది అనుకుంటుండగానే, అది కాలక్రమేణా ఆదరణ లేక డీలా పడిపోయింది. కోహ్లీ ప్రస్తుతం `వన్ 8 కమ్యూన్` పేరుతో రెస్టారెంట్ బిజినెస్ లో ఉన్నాడు.
స్పోర్ట్స్ థీమ్‌తో వెటరన్ క్రికెటర్ కపిల్ దేవ్ `ఎలెవన్` అనే రెస్టారెంట్ ని నిర్వహిస్తున్నారు. రవీంద్ర జడేజా - జడ్డూస్ ఫుడ్ ఫీల్డ్, సురేష్ రైనా - రైనా హోటల్స్, జహీర్ ఖాన్ - డైన్ ఫైన్, శిఖర్ ధావన్ - ది ఫ్లైయింగ్ క్యాచ్, మహిళా క్రికెటర్ స్మృతి మందాన ఎస్ఎం 8 కేఫ్ ని నిర్వహిస్తున్నారు.