జగన్ కీలక వ్యాఖ్య.. 'నా చేతికి ఎముక ఉండదని అందరూ అంటుంటారు'

Update: 2022-01-07 11:30 GMT
గడిచిన కొద్ది రోజులుగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ మీద తర్జనభర్జనలు సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై మాట్లాడేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో భేటీ అయిన సందర్భంగా ఉద్యోగ సంఘాలతో ఆయన అన్న మాటలు ఆసక్తికరంగా మారాయి. మంచి చేయాలని తాను తపిస్తుంటానని చెప్పిన ఆయన.. ముఖ్యంగా తన చేతికి ఎముక ఉండదని అందరూ అంటుంటారని పేర్కొనటం గమనార్హం. ఇప్పటివరకు జరిగిన ఏ చర్చల్లోనూ.. సమావేశాల్లోనూ తన గురించి.. తన గొప్పతనం గురించి.. తనను తాను కితాబును ఇచ్చుకునేలా జగన్ వ్యాఖ్యలు చేయటం కనిపించదు.

అంతేకాదు.. ఉద్యోగ సంఘాల నేతలకు తనదైన రీతిలో విన్నపాన్ని చేయటం కనిపిస్తుంది. ఉద్యోగ సంఘాల నేతలు తమ డిమాండ్లతో పాటు.. ప్రభుత్వం నుంచి తాము కోరుకుంటున్నదేమిటి? అన్న విషయంపై చెప్పిన మాటల్ని విన్న జగన్ స్పందిస్తూ.. ‘మీరు చాలా విషయాలు చెప్పారు. కొన్ని అంశాల్నిమీ ముందు ఉంచుతున్నాను. ఉదారంగా ఉండే విషయంలో.. మానవతా దృక్పథంతో ఉండే విషయంలో.. నాకన్నా బాగా స్పందిచే వాళ్లు.. నాకన్నా ఎక్కువగాస్పందించే వాళ్లు తక్కువ మంది ఉంటారు. ఎవరికైనా మంచే చేయాలని తాపత్రయ పడతాను. వీలైనంత ఎక్కువ మందికి మంచి చేయాలని ఆరాటపడతాను. ఆ మంచిలో ఏ ఒక్కరు కూడా భాగస్వామ్యులు కాకుండా మిగిలిపోకూడదనేది నా నైజం’’ అంటూ తన గురించి.. తన మైండ్ సెట్ గురించి సుదీర్ఘంగా వివరించటం గమనార్హం.

ఎందుకిలా? ఉద్యోగసంఘాల నేతలకు తన గురించి అంతలా సీఎం జగన్ ఎందుకు చెప్పుకున్నట్లు? అన్న విషయంలోకి వెళితే.. అసలు విషయం ఆయన నోటి మాటలే చెప్పేశాయి. ‘‘రాష్ట్ర ప్రభుత్వంపై మోయలేని భారాన్ని మోపకుండా కాస్త సానుకూల దృక్పథంతో ఉండాలి. ఇదే సమయంలో మీరు చెప్పినవన్నీ పరిగణలోకి తీసుకుంటాను. ఆర్థిక శాఖ చెప్పిన దానికి.. మీరు చెప్పిన దానికి వ్యత్యాసం ఉంది. అందుకే మీతో మాట్లాడుతున్నాను. నేను మీ అందరి కుటుంబ సభ్యుడిని. మీ అంచనాలు కూడా కాస్త తగ్గాలి. వీళ్లు కూడా కాస్త పెరగాల్సిన అవసరం ఉంది. మీకు మనసా.. వాచా మంచి చేయాలనే తపనతో ఉన్నాను. ఇది నా హామీ’’ అని ఉద్యోగ సంఘాలతో చెప్పటం చూస్తే..వారు కోరుకున్నంత పీఆర్సీ ఇచ్చే విషయంలో ప్రభుత్వానికి ఇబ్బంది ఉందన్న విషయాన్ని జగన్ చెప్పకనే చెప్పేశారని చెప్పాలి.

కరోనా కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతుందని.. ఈ రోజున దేశంలో 98 వేల కేసులు నమోదయ్యాయని.. రేపటికి 2 లక్షలు అంటున్నారని.. అనేక రాష్ట్రాల్లో రాత్రి కర్ప్యూ కూడా వచ్చేసిందన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఆర్థిక పరిస్థితుల మీద ఎలాంటి ప్రభావం ఉంటుందో చెప్పలేని పరిస్థితి ఉందన్నారు. దీనికి తోడు.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా పరిగణలోకి తీసుకొని ప్రభుత్వ ఉద్యోగులు కాస్త ఆలోచించమని చెప్పటం ద్వారా..వారి డిమాండ్లను తగ్గించుకోవాలన్న విషయాన్ని ఆయన చెప్పారని చెప్పాలి.

రాష్ట్ర ఆదాయం గడిచిన మూడేళ్లలో తగ్గటమే తప్పించి పెరగటం లేదంటూ.. ‘‘2018–19లో ఎస్‌ఓఆర్‌ రూ.62,503 కోట్లు అయితే 2019–20లో అది రూ.60,934 కోట్లకు, 2020–21లో రూ.60,688 కోట్లకు తగ్గింది.మామూలుగా ప్రతి ఏటా 15 శాతం పెరగాలి. ఈ లెక్కన 2018–19లో ఉన్న రూ.62 వేల కోట్లు 2019–20లో రూ.72 వేల కోట్లు కావాలి. 2020–21లో రూ.72 వేల కోట్లు రూ.84 వేల కోట్లు కావాలి. కానీ.. ఆదాయం తగ్గుతుంది. అదే సమయంలో జీతాలు.. పెన్షన్ల వ్యయం పెరుగుతోంది. 2018–19లో ఉద్యోగులకు జీతాలు, పెన్షన్ల రూపేణా చేసిన వ్యయం రూ.52,513 కోట్లు కాగా, 2020–21 నాటికి అది రూ.67,340 కోట్లకు చేరుకుంది’’ అని చెప్పారు.

అంతేకాదు.. ఆర్టీసీ ఉద్యోగుల్ని ప్రభుత్వంలోకి తీసుకోవటంతో పాటు.. మరికొన్ని విధానాల వల్ల ఖర్చు పెరిగిందని చెప్పిన ఆయన.. ప్రభుత్వం మీద పడిన ఖర్చు లెక్కలు చెప్పుకొచ్చారు.

తమ ప్రభుత్వం మొదటి నుంచి ప్రభుత్వ ఉద్యోగులతో స్నేహపూర్వకంగా ఉండే ప్రభుత్వమని పేర్కొన్నారు. పొరుగున ఉన్న తెలంగాణలో వస్తున్న ఆదాయాలు మనకు రాకున్నా.. వారి తలసరి ఆదాయం అంత లేకున్నా.. వారి జీతాల కంటే మన జీతాలు.. పెన్షన్ల బిల్లు ఎక్కువన్న విషయం జగన్ నోటి నుంచి రావటం గమనార్హం. కాగ్ రిపోర్టు ప్రకారం తెలంగాణలో జీతాల మీద ఏప్రిల్ నుంచి అక్టోబరు ఏడు నెలల కాలానికి చేసిన ఖర్చు రూ.22,608 కోట్లు అని చెప్పారు. అందులో జీతాల కోసం రూ.17వేలకోట్లు.. పెన్షన్ల కోసం రూ.5603 కోట్లు అని చెప్పారు. అదే సమయంలో మన రాష్ట్రంలో అదే ఏడునెలల కాలానికి జీతాల రూపంలో రూ.24,681 కోట్లు.. పెన్షన్ల రూపంలో రూ11,324 కోట్లు.. మొత్తంగా రూ.36వేల కోట్లు చెల్లించినట్లు చెప్పుకొచ్చారు.

విభజనలో హైదరాబాద్ ను కోల్పోవటం వల్ల ఏపీ రాష్ట్ర ఆదాయం తగ్గుతుందని.. తెలంగాణ ఆదాయం పెరుగుతుందని పేర్కొన్నారు. కమిటీ చెప్పినట్లుగా 14.29 శాతం ఫిట్ మెంట్ ఇస్తే ఏడాదికి ప్రభుత్వం మీద పడే భారం రూ.7,137 కోట్లు అని.. ఇతరరాష్ట్రాలతో పోలిస్తే ఈ వ్యయం మన రాష్ట్రంలోనే అధికమన్న సీఎం జగన్ మాటల్ని చూస్తే.. ప్రభుత్వ ఉద్యోగులు కోరినట్లు కాకుండా మహా అయితే 15 శాతం కానీ 16 శాతానికి పరిమితం చేసే అవకాశం ఉందంటున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.
Tags:    

Similar News