సీఎం గా జగన్ రికార్డే మరి...?

Update: 2022-02-26 10:38 GMT
జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి మూడు నెలల వ్యవధిలో మూడేళ్ళు పూర్తి అవుతుంది. జగన్ ఈ కాలమంతా  కూడా అత్యధిక భాగం తాడేపల్లిలోనే గడిపారు. దాని మీద విపక్షాల విమర్శలు కూడా ఉన్నాయి. మరో వైపు చూస్తే జగన్ ముఖ్యమంత్రిగా పెద్దగా టూర్లు చేసినదీ లేదు. అయితే జగన్ సీఎం కెరీర్ లోనే ఒక రికార్డు అయితే నమోదు కాబోతోంది. కేవలం ఒక నెలలో మూడు సార్లు ఆయన విశాఖ రావడం అంటే ఇప్పటికది రికార్డుగానే చూడాలి అంటున్నారు.

జగన్ ఫిబ్రవరి నెలలో విశాఖకు ముచ్చటగా మూడవసారి ఈ నెల 27న వస్తున్నారు. భారత నావికాదళం విశాఖలో తలపెట్టిన మిలాన్ లో పాలుపంచుకునేందుకు ఆయన విశాఖ వస్తున్నారు. ఒక విధంగా చంద్రబాబు తరువాత ఈ గౌరవాన్ని అందుకుంటున్నది జగనే అని చెప్పాలి. 2016లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖలో జరిగిన ఈ తరహా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆరేళ్ళ తరువాత జరిగే మిలాన్ కి జగన్ చీఫ్ గెస్ట్ గా రావడం అంటే ఒక గౌరవం.

ప్రపంచం మొత్తం మీద ఉన్న 40 దేశాలకు చెందిన యుద్ధ విమానాలు, నౌకలు అన్నీ కలసి విశాఖలో పెరేడ్ చేయడమే దీని విశేషం. ఒక విధంగా దేశాల మధ్య సుహృద్భావ వాతావరణం తీసుకురావడం, అదే టైమ్ లో నావికాదళ సామర్ధ్యాన్ని ఎప్పటికపుడు పెంచుకుంటూ పరస్పర సహకారాన్ని అందుకోవడం దీని వెనక ముఖ్య ఉద్దేశ్యం.

ఇక జగన్ ఈ కార్యక్రమం కోసం  27న విశాఖ రావడమే కాకుండా దాదాపు ఆరేడు గంటల పాటు గడపబోతున్నారు. ఇక జగన్ ఇదే ఫిబ్రవరి నెల మొదటి వారంలో శారదాపీఠంలో జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాలుపంచుకోవడానికి విశాఖ వచ్చారు. ఇక ఈ నెల 20న రెండవసారి జగన్ విశాఖ వచ్చారు. విశాఖ వచ్చిన రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ కి స్వాగతం పలకడానికి జగన్ ఆ రోజు రావడం జరిగింది.

ఇక తాజా పర్యటన మిలాన్ కోసం షెడ్యూల్ చేయబడింది. మొత్తానికి చూస్తే అతి చిన్న నెల ఫిబ్రవరిలో జగన్ మూడు సార్లు విశాఖ రావడం, గతంలో ఎన్నడూ లేని విధంగా ఆయన ఎక్కువ గంటలు కూడా ఈసారి ట్రిప్పులలో గడపడం చూస్తూంటే జగన్ నిజంగా రికార్డ్ క్రియేట్ చేశారనే చెప్పాలి. మరి మంచి రోజు చూసుకుని విశాఖలో క్యాంప్ ఆఫీస్ పెట్టి షిఫ్ట్ కావాలనుకుంటున్న జగన్ విశాఖ మీద మోజు పెంచుకుంటున్నారు అనే చెప్పాలి.
Tags:    

Similar News