బీజీపీ సీఎంతో జగన్ ...సందేశమా... సంకేతమా...?

Update: 2022-04-19 12:30 GMT
జగన్ అంటేనే ట్రెడిషనల్ పాలిటిక్స్ చేసే నేత కానే కాదు, ఆయన తనదైన స్టైల్ లో పాలిటిక్స్ చేస్తూంటారు. ఆయన పెద్దగా మర్యాదపూర్వక భేటీలు వంటివి నిర్వహించరు. ఎవరైనా తమ ప్రాంతానికి వస్తే అధికారిక కార్యక్రమాల నిమిత్తం కలవడం తప్ప జగన్ తన పాలనలో తానుంటారు. అలాంటి జగన్ ప్రత్యేక విమానంలో తాడేపల్లి నుంచి  విశాఖ రావడం ఒక బీజేపీ సీఎంతో గంటకు పైగా ఏకాంత చర్చలు జరపడం అంటే నిజంగా రాజకీయంగా అది తీవ్రమైన చర్చకు దారితీస్తోంది.

నిజానికి ఏ ముఖ్యమంత్రి అయినా కేంద్ర మంత్రి అయినా విజయవాడ దాకా వస్తే వారిని జగన్  తాడేపల్లి నివాసానికి  తీసుకెళ్ళి మాట్లాడుతున్నారు. అలా కిషన్ రెడ్డి, నితిన్ గడ్కరీ జగన్ ఇంటికి వెళ్ళి ఆతీధ్యం స్వీకరించారు. కానీ హర్యణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కధే వేరుగా ఉంది. ఆయన జగన్ని తన వద్దకు పిలిపించుకున్నారా అన్న చర్చ అయితే గట్టిగా సాగుతోంది.

ఎపుడూ పెద్దగా పర్యటనలు పెట్టుకోని జగన్ హుటాహుటిన విశాఖ రావడం, కేవలం బీజేపీ సీఎం తోనే భేటీ కావడానికే తన షెడ్యూల్ ని పరిమితం చేయడం అంటే మ్యాటర్ ఏంటి అన్న ఉత్కంఠ అయితే అందరిలోనూ ఉంది. మనోహర్ లాల్ ఖట్టర్ బీజేపీని హర్యానాలో రెండవసారి అధికారంలోకి తెచ్చిన నేత. బలమైన ఉత్తరాది కాషాయ పార్టీ  నాయకుడు. కేంద్ర పెద్దలతో సన్నిహితమైన పరిచయాలు ఉన్న వారు.

అలాంటి ఖట్టర్ ఆయుర్వేద వైద్య చికిత్స నిమిత్తం విశాఖ బీచ్ రోడ్డులోని రుషికొండలో ఉన్న పెమా వెల్ నెస్ రిసోర్ట్స్ కి వచ్చి కొద్ది రోజులుగా ఉంటున్నారు. ఆయన విశాఖలోని శారదాపీఠాన్ని కూడా సందర్శించారు. స్వామీజీ స్వరూపానందేంద్ర ఆశీస్సులు తీసుకున్నారు. మరి అది జరిగిన ఒక రోజు తేడాలో జగన్ వచ్చి ఖట్టర్ ని కలవడం అంటే ఈ భేటీ చాలా విశేషం అని అంటున్నారు.

అంతే కాదు ఖట్టర్ బీజేపీ పెద్దల నుంచి ఏదైనా సందేశాన్ని తీసుకువచ్చి ఉంటారని కూడా అంటున్నారు. జగన్ కి విశాఖ అంటే మోజు ఉంది. విశాఖను పాలనారాజధానిగా చేయాలనుకుంటున్నారు. ఈ మధ్య ఢిల్లీ వెళ్ళినపుడు కూడా ఆ విషయం మీదనే కేంద్ర పెద్దలతో చర్చించారు అని అంటున్నారు. ఈ క్రమంలో ఖట్టర్ తో చర్చలలో కచ్చితంగా విశాఖ రాజధాని అంశం ఉంటుందని అంటున్నారు. అలాగే బీజేపీకి వైసీపీకి మధ్య ఉన్న స్నేహా బంధం తెలిసిందే.

మరి కొద్ది నెలల్లో రాష్ట్రపతి ఎన్నికలు ఉన్న వేళ కేంద్ర పెద్దల నుంచి ఏదైనా సంకేతాలను కూడా ఖట్టర్ తీసుకొచ్చారా అన్నది కూడా చర్చగా ఉంది. మొత్తానికి ఈ భేటీ మామూలుది కాదు అని అంతా అంటున్నారు. మరి వన్ టూ వన్ గా సాగిన ఈ భేటీ వివరాలు ఈ రోజు బయటకు రాకపోయినా కొద్ది రోజుల్లో వచ్చే  దాని ఫలితాలను బట్టి  అక్కడ ఏం జరిగింది అన్నది ఊహించవచ్చు అని అంటున్నారు. మొత్తానికి తాడేపల్లి టూ విశాఖ గా జగన్ టూర్ సాగడం, ఒక బీజేపీ సీఎం తో మంతనాలు సాగించడం ఏపీ రాజకీయాల్లో హాట్ హాట్ టాపిక్ గానే చూడాలి.
Tags:    

Similar News