గొల్డెన్ చాన్స్ : జగన్ మిస్ చేసుకుంటే కనుక...?

Update: 2022-06-03 07:38 GMT
అవకాశాలు అన్నవి చాలా తక్కువగా వస్తాయి. రాజకీయాల్లో ఎపుడేమి జరుగుతుందో కూడా ఎవరూ ఊహించలేరు. అలాంటిది ఇపుడు వైసీపీకి ఒక విధంగా గోల్డెన్ చాన్స్ వచ్చింది అని అంటున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ ఓట్లే తులాభారంగా మారనున్నాయి. దాంతో వైసీపీ మద్దతు ఇపుడు కేంద్రానికి కీలకం. 2017 నాటి అనుకూల  పరిస్థితి అయితే బీజేపీకి లేదని చెప్పాలి. నాడు ఎక్కువ శాతం ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టిన బీజేపీకి ఈసారి సౌత్ లో జగన్ మాత్రమే ఆశాకిరణంగా ఉన్నారు.

బీజేపీ తన సొంత మనిషిని రాష్ట్రపతిగా గెలిపించుకోవడానికి వైసీపీ మీద కచ్చితంగా ఆధారపడితీరాలి. దాంతో బీజేపీ మీద వైసీపీ పై చేయి సాధించినట్లే. జగన్ సీఎం గా ఎన్నికైన కొత్తలో ఢిల్లీ వెళ్లి ఒక మాట మీడియాకు చెప్పారు. అదేంటీ అంటే బీజేపీకి పూర్తి మెజారిటీ వచ్చింది కాబట్టి ప్రత్యేక హోదా సహా కీలక విషయాల్లో అడగడమే తప్ప డిమాండ్ చేసే పరిస్థితి ఉండదని.

కానీ ఇపుడు అంతకంటే మహదవకాశం రాష్ట్రపతి ఎన్నికల రూపంలో వచ్చింది. ఒక విధంగా  మోడీ, అమిత్ షాల వ్యక్తిగత ప్రతిష్టకు రాష్ట్రపతి ఎన్నికలు గీటుగాయిగా మారుతాయని అంటున్నారు. ఈ ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్ధిని ఓడగొట్టాలని విపక్ష శిబిరం కసిగా పనిచేస్తోంది. దాంతో అతి చిన్న మెజారిటీతోనే బీజేపీ రాష్ట్రపతి అభ్యర్ధి గెలిచే వీలుంది.

మరి జగన్ ఈ కీలక సమయంలో ఢిల్లీలో కేంద్ర పెద్దలను కలిశారు. ఆయన ఎప్పటిమాదిరిగానే ఏపీ సమస్యల మీద విన్నపాలు చేశారు. ఏపీకి ఉన్న రెవిన్యూ లోటుని 16 వేల కోట్ల రూపాయలను విడుదల చేయమని కోరారు. అలాగే పోలవరం ప్రాజెక్ట్ కి సవరించిన అంచనాల మేరకు నిధులు ఆమోదించి విడుదల చేయలని కోరుతున్నారు. ఇంకా చాలా పెద్ద చిట్టానే జగన్ ప్రధాని ముందు ఉంచారు.

అంతా బాగానే ఉన్నా ఇలాంటి విన్నపాలతో కూడిన వినతిపత్రాలను జగన్ మూడేళ్ల కాలంలో ఎన్నో సార్లు ఇచ్చారు కానీ ఈసారి మాత్రం ప్రత్యేకత ఉంది. మోడీ షాలు జగన్ వైపు ఆశగా చూస్తున్న వైనం ఉంది. జగన్ కనుక ఎస్ అంటే కేంద్ర పెద్దలకు మహదానందం. ఆయన నో చెబితే బీజేపీలో బీపీ చెలరేగడం ఖాయం.

అలా జగన్ వ్యవహరించిన పక్షంలో కేంద్రం దారికి వచ్చి ఏపీ కోరిన వాటిలో మెజారిటీని తీర్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇక్కడే జగన్ తన అనుభవాన్ని, సమర్ధతను, సత్తాను చూపాలని అయిదు కోట్ల మంది ఏపీ జనాలు కోరుతున్నారు. జగన్ చేతిలో ఈ రోజు ఉన్న బలం అంతా ఏపీ జనాలు ఇచ్చినదే. ఆయన ప్రత్యేక హోదాను సాధిస్తాను పాతిక మంది ఎంపీలను ఇన్వండి అని కోరితే నమ్మి చేతిలో పెట్టినదే.

మరి ప్రజలు ఇచ్చిన ఈ బలనాన్ని ప్రజల కోసం వినియోగించడం నైతిక  ధర్మం. ఆ విధంగానే జగన్ వ్యవహరించాలని అంతా కోరుతున్నారు. అలా కాకుండా కేంద్ర పెద్దలు చెప్పిన తీరున రాష్ట్రపతి ఎన్నికలలో భేషరతుగా మద్దతు ఇస్తే మాత్రం జగన్ గోల్డెన్ చాన్స్ మిస్ చేసుకున్నట్లే. అంతే కాదు అవసరం తీరాక బీజేపీ పెద్దల వైఖరి ఎలా ఉంటుందో కూడా ఎవరూ ఊహించలేరు. ఎందుకంటే కమలనాధులు ఫక్తు రాజకీయాలే ఎపుడూ  చేస్తారు అని అంటారు.

అందుకే సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ లాంటి వారు కూడా జగన్ డొంట్ మిస్ దిస్  గోల్డెన్ ఛాన్స్ అని పదే పదే చెబుతున్నారు. ఈ రోజు ఏపీ అంతా జగన్ వైపు చూస్తోంది. మరో వైపు మోడీ టీం కూడా జగన్ వైపు ఆశగా చూస్తోంది. రాష్ట్రపతి ఎన్నికల రూపంలో వచ్చిన అవకాశాన్ని వాడుకుంటే జగన్ ఏపీ రాజకీయ చరిత్రలో చిరకాలం నిలిచిపోతారని అంటున్నారు. మరి ఆయన ఏం చేస్తారో చూడాలి.
Tags:    

Similar News