డిప్యూటీ సీఎం అయినా స్వామీ... అన్నింటా అవమానాలే సామీ

Update: 2022-10-23 06:27 GMT
ఆయన ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. రాజకీయంగా సీనియర్ మోస్ట్ నేత. ఇపుడు ఉన్న సీఎం జగన్ కి తండ్రి గారు అయిన వైఎస్సార్ కాలం నుంచే ఆయన రాజకీయాలు చేస్తూ వచ్చారు. ఒక విధంగా ప్రస్తుత సీఎం కి తండ్రి సమానులు. దళిత సామాజికవర్గంలో పుట్టి ఉప ముఖ్యమంత్రి స్థాయికి రావడం వెనక ఆయన ప్రతిభా పాటవాలే ఉన్నాయని చెప్పాలి. ఆయన వైఎస్సార్ కుటుంబానికి అత్యంత ఆప్తులుగా మెలుగుతూ వస్తున్నారు.

అందుకే జగన్ ఆయనకు రెండు సార్లు మంత్రివర్గాలను ఏర్పాటు చేసినప్పటికీ ఉప ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టారు. అయిదేళ్ళ పాటు ఈ కీలకమైన పదవిలో ఆయన ఉన్నట్లే అవుతుంది. ఇక ఆయన ఏడు పదులు దాటిన వయసులో ఇక రాజకీయాల నుంచి గౌరవంగా తప్పుకోవాలని చూస్తున్నారు.

వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీకి విముఖత వ్యక్తం చేస్తున్నారు. గట్టిగా చూస్తే ఏణ్ణర్ధం కాలం ఉంది. ఆయనకు పెద్దాయనగా గౌరవించి ఆయన ఉప ముఖ్యమంత్రి పదవికి మర్యాద మన్ననా ఇవ్వాల్సింది ఎవరో కాదు సొంత పార్టీ నేతలే. మరి వైసీపీ నేతలు ఆ విధంగా ఉన్నారా అంటే లేనే లేదు అని ఎవరో చెప్పడం లేదు సాక్ష్తాత్తు స్వామి గారే చెబుతున్నారు.

తనకు జరుగుతున్న అవమానాలు ఆనాడు అంబేద్కర్ కి కూడా జరిగాయంటూ ఆయన పోలిక తెచ్చుకుని బాధపడుతున్నారు. బీ ఫారాలు ఇచ్చి ఎంపీటీసీలుగా జెడ్పీటీసీలుగా గెలిపిస్తే వారంతా ఇపుడు తనను విమర్శిస్తున్నారు అని ఆయన తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవన్నీ ఆయన మీడియా ముందు అంటున్న మాటలే. ఇన పెనుమూరు మండల సాధారణ సర్వసభ్య సమావేశంలో తనకు అవమానం జరిగింది అని స్వామి వంటి పెద్దాయన ఆవేదన వ్యక్తం చేయడం ఇపుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఇది తనకు ఒకసారి జరిగింది కాదని గత సమావేశంలో కూడా తాను వస్తానని ముందే తెలుసుకుని పది నిముషాల్లో సమావేశాన్ని ముగించేశారని ఆయన గుర్తు చేసుకుని మరీ బాధపడుతున్నారు. తన సొంత నియోజకవర్గంలో వైసీపీ నేతలు అందరికీ పదవులు ఇచ్చానని, అయినా ఇలా తనను అవమానించడమేంటని స్వామి మండిపడుతున్నారు.

ఇదిలా ఉండగా స్వామి ప్రాతినిధ్యం వహిస్తున్న గంగాధర నెల్లూరు లో 2014లో 20 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2019 ఎన్నికల్లో ఏకంగా 45 వేల పై చిలుకు గెలిచారు. చిత్తూరు జిల్లాలో బలమైన దళిత నాయకుడు ఆయన. చంద్రబాబుని తరచూ విమర్శిస్తూ ఆయన సొంత జిల్లాలో కట్టడి చేసే నేతగా మంత్రిగా ఆయన ఉన్నారు.

అలాంటి స్వామి విషయంలో మొదటి నుంచి అక్కడ వైసీపీ నాయకులు వ్యవహరిస్తున్న తీరు చర్చనీయాంశం అవుతోంది. ఆయనను పేరుకే ఉప ముఖ్యమంత్రిగా ఉంది జిల్లాకు చెందిన కీలక మంత్రి అయిన మరో పెద్దాయన అంతా చక్త్రం తిప్పుతారు అని కూడా ప్రచారం లో ఉంది. ఏది ఏమైనా జగన్ ఆయనకు ఉన్నత పదవులు ఇచ్చి గౌరవించారు. ఇపుడు ఆయనకు అవమానం జరిగింది అని వాపోతున్న వేళ పిలిచి చర్చలు జరిపి ఆయన్ని అలా చేసిన వారిని నియంత్రించకపోతే స్వామి ఆవేదన అంతటా వ్యాపించి పార్టీకే ఇబ్బందిని తెచ్చి పెడుతుందని అంటున్నారు.
Tags:    

Similar News