నెమలి పుంజు దెబ్బ - రసంగి అబ్బ... పందెంలో కోటి గెలిచిన కోడి!

కోడిపందేలపై కోట్ల వర్షం కురిసింది. ఈ క్రమంలో ప్రధానంగా కోటి రూపాయలకు పైగా గెలిచిన కోడి పందెం విషయం నెట్టింట వైరల్ గా మారింది.

Update: 2025-01-15 12:00 GMT

సంక్రాంతి పండుగ సంబరాలు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అంబరాన్ని అంటాయి. పట్టణాలను వదిలి పల్లెలకు చేరిన జనాలు కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో కలిసి సందడి చేశారు. ఈ సందర్భంగా పిండి వంటలు, రంగవల్లులు ఒకెత్తు అయితే.. కోడి పందేల సందడి మరొకెత్తు అన్నట్లుగా సాగింది. ఈ సారి కోస్తాంధ్రలో మాత్రమే కాకుండా.. సీమలోనూ కోడిపుంజులు సందడి చేశాయి.

ఈ సందర్భంగా... కోడిపందేలపై కోట్ల వర్షం కురిసింది. ఈ క్రమంలో ప్రధానంగా కోటి రూపాయలకు పైగా గెలిచిన కోడి పందెం విషయం నెట్టింట వైరల్ గా మారింది. ఈ పందెం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జరిగింది. తాడేపల్లిలోని పైబోయిన వెంకట్రామయ్య కోడి పందేల బరిలో ఈ పందెం నిర్వహించారు. ఈ పందెంపై సంక్రాంతి సంబరాలకు ముందు నుంచే చర్చ జరుగుతుందని అంటున్నారు.

మంగళవారం సంక్రాంతి రోజున ఈ పందెం నిర్వహించగా.. ఈ పందెంలో గుడివాడ ప్రకార రావుకు చెందిన నెమలి పుంజు - రత్తయ్యకు చెందిన రసంగి పుంజు పోటీ పడ్డాయి. ఈ సమయంలో రూ.1.25 కోట్లతో కోళ్లను పందెం బరిలోకి దింపారు. ఈ సమయంలో రెండు కోళ్ల మధ్య పందెం రసవత్తరంగా జరిగింది. మరోపక్క పుంజులపై బెట్టింగులు భారీగా జరిగినట్లు చెబుతున్నారు.

ఈ సమయంలో అత్యంత రసవత్తరంగా జరిగిన ఈ పందెంలో గుడివాడ ప్రభాకర్ కు చెందిన నెమలి పుంజు విజేతగా నిలిచింది. ఈ పందెంలో రత్తయ్య రసంగి పుంజు ఓడిపోవటంతో చాలా మంది లక్షల్లో నష్టపోయినట్లు చెబుతున్నారు. మరోపక్క గుడివాడ ప్రభాకర్ రావు అనుచరులు.. ఆయన కోడిపై బయటి పందెం కాసినవాళ్లు సంబరాలు చేసుకుంటున్నారని అంటున్నారు.

Tags:    

Similar News