సమ్మెతో చావు దెబ్బ...?

Update: 2022-01-24 14:30 GMT
అలవి కాని సమయం. అనువు కాని వేళ రణ నినాదం. అన్ని వైపుల నుంచి ప్రతికూలత ఉన్న టైమ్ లో గర్జన. అదే ఏపీ ఉద్యోగుల సమ్మె. దీని మీద మేధావులు, చదువరులు, వివేకవంతులు, ఆలోచనాపరులు అయితే ఇది కాదు సరైన తరుణం అంటున్నారు. అంతవరకూ తెచ్చుకోవద్దు అని కూడా రెండు వైపులా సూచిస్తున్నారు. గత ఎనిమిదేళ్ళుగా ఏపీ విభజన తో నష్టాలతో కష్టాలతో అల్లలాడుతోంది.

అప్పుల ఆంధ్రా అని ఇపుడు వినిపిస్తున్నా చంద్రబాబు టైమ్ నుంచే అప్పు చేసి పప్పుకూడు కధ స్టార్ట్ అయింది. బాబు హయాంలో మూడు లక్షల కోట్లు తెచ్చారు అని వైసీపీ నేతలు అంటే గత రెండేళ్లలో మీరు అంతకు మించి అని  టీడీపీ నేతలు అంటారు. ఇలా పరస్పర ఆరోపణలు, విమర్శల రాజకీయాలు ఎలా ఉన్న ఏపీకి ఈ రోజుకు ఆరు లక్షల కోట్ల రూపాయల  పై చిలుకు అప్పుగా ఉందని అంతా అంగీకరించి తీరాల్సిన విషయం.

ఇక విభజన వల్ల ఏపీకి రావాల్సిన నిధులు చాలా పెండింగులో ఉండిపోయాయి. వాటి చిట్టాపద్దులు బయటకు తీస్తే కచ్చితంగా లక్ష కోట్ల రూపాయల మేరకు నిధులు ఏపీకి కేంద్రం నుంచి తెలంగాణా నుంచి ఇతర ఏజెన్సీల నుంచి రావాల్సి ఉంది. మరి వాటి విషయంలో ఈ రోజుకూ పెద్దగా పురోగతిలేదు.

ఇక ప్రపంచ సమస్యగా కరోనా విపత్తు ఉంది. ఏదీ సవ్య దిశగా అయితే ఏ రోజూ సాగడంలేదు. ఇప్పటికి మూడు దశలుగా కరోనా వచ్చి ముంచెత్తింది. అసలే రెవిన్యూ పెద్దగా రాని ఏపీ లాంటి రాష్ట్రాలకు ఇపుడు కరోనా దెబ్బ అంతా ఇంతా కాదు, రెండు విడతల కరోనాతో యాభై వేల కోట్ల దాకా ఆదాయానికి గండి పడింది అని ప్రభుత్వం లెక్క చెబుతోంది. మూడవ విడత కరోనా నడుస్తోందిపుడు. దీని వల్ల వచ్చే నష్టాలు ఇంకా తేలలేదు.

ఇక మరో రెండు నెలల వ్యవధిలో ఈ ఆర్ధిక సంవత్సరం ముగుస్తుంది. సమ్మె అంటూ జరిగితే చాలా కీలక సెక్టార్ల నుంచి రావాల్సిన దైనందిన ఆదాయం కూడా రాకుండా పోతుంది. ముఖ్యంగా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వంటి వాటి నుంచి పూర్తిగా రెవిన్యూ రాదు, అలాగే కొన్ని కీలక విభాగాల నుంచి రావాల్సిన పన్నులు కూడా రాకుండా పోతాయి. ఇలా ఆదాయం రాకుండా ఒక వైపు ఉంటే సమస్యలు కొత్తగా వస్తాయి. ఇబ్బందులు ఎదురవుతాయి.

ప్రభుత్వం మొండిగా ఉంటే వచ్చే అరకొర ఆదాయం కూడా ఖజానాకు దక్కదు అని అంటున్నారు. అలాగే ఉద్యోగులు కూడా ఆర్ధిక పరిస్థితి అంతా చూసి సమ్మెకు వెళ్తే డిమాండ్లు సాధించడం పక్కన పెడితే భారీ ఎత్తున వ్యతిరేకత మూటకట్టుకుంటారు అన్న మాట కూడా ఉంది. ఉద్యోగులు సామరస్యంగా వ్యవహరించి చర్చల ద్వారానే పరిష్కారం చూడాలని కోరుతున్నారు. అలాగే ప్రభుత్వం కూడా ఒక మెట్టు దిగిరావాలని అంటున్నారు. అలా కనుక జరగకపోతే మాత్రం అది వారికీ వీరికీ అని కాదు, మొత్తం రాష్ట్రానికే ఈ సమ్మెట పోటు చావు దెబ్బ గా మారుతుందని, యావత్తు ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలడానికే అవకాశం ఉందని అంటున్నారు.
Tags:    

Similar News