ఏపీ ప్రభుత్వ సలహాదారు రాజీనామా.. కారణమదేనా?

Update: 2020-08-25 11:30 GMT
ఏపీ ప్రభుత్వంలో అనుకోని ట్విస్ట్ చోటు చేసుకుంది. ‘ఏపీ ప్రభుత్వ ప్రజా విధానాల’ సలహాదారు రామచంద్రమూర్తి తన పదవికి రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది. రాజీనామా చేసి లేఖను ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజయ్ కల్లెంకు సమర్పించారు.

కాగా రామచంద్రమూర్తి సీనియర్ జర్నలిస్టు.. పలు పత్రికల్లో ఎడిటర్ గా చేసిన వ్యక్తి. వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రభుత్వ సలహాదారుగా జగన్ నియమించారు. అంతకుముందు సాక్షి దినపత్రిక ఎడిటోరియల్ డైరెక్టర్ గా కీలక బాధ్యతలు నిర్వహించారు. పార్టీ అధికారంలోకి రావడంతో ఆయన పత్రిక ద్వారా చేసిన సేవలకు గాను జగన్ సలహాదారు పోస్టు ఇచ్చారని టాక్.

అయితే రామచంద్రమూర్తి వ్యక్తిగత కారణాలతోనే తాను రాజీనామా చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఆయన రాజీనామా వెనుక అసలు కారణాలు తెలియరాలేదు. కానీ ఏ పని లేకుండా ఖాళీగా జీతాలు తీసుకోవడం ఇష్టం లేకనే రామచంద్రరావు పదవికి రాజీనామా చేసినట్టుగా ప్రచారం జరుగుతోంది.

సీఎం జగన్ సీఎంగా గద్దెనెక్కాక సంక్షేమ పథకాలు.. నవరత్నాలు.. అధికారులతో పనులు చేయించుకోవడాలు.. ఢిల్లీ లాబీయింగ్, రాజధాని పనులు, చంద్రబాబు ఎత్తులు పైఎత్తులు.. మీడియా చిత్తులు ఇలా ఇవన్నీ చక్కదిద్దడానికే సమయం పోయింది. ఇక ఈ బిజీలో ఆయన మంత్రులకే టైం ఇవ్వడం లేదు.. ఇక సలహాదారుల పరిస్థితి చెప్పక్కర్లేదు. అసలు పనిలేని ఉత్సవ విగ్రహాలుగా సలహాదారులందరూ మిగిలిపోయారనే అపవాదు ఉంది.

జగన్ ప్రభుత్వంలో ఇప్పటికే వివిధ రంగాల్లో 33 మంది సలహాదారులున్నారు. ఏదో వారు వైసీపీ కోసం పాటుపడ్డారని వారందరినీ జగన్ ప్రభుత్వ సలహాదారు పోస్టుల్లో సర్దుబాటు చేశారనే ప్రచారం ఉంది.

సీనియర్ జర్నలిస్టు రాంచంద్రమూర్తి ఆంధ్రజ్యోతి నుంచి సాక్షి వరకు జర్నలిస్టు సర్కిల్స్ లో ఎంతో సీనియర్. విలువైన వ్యక్తి. ఆయన ప్రస్తుతం జగన్ కొలువులో సలహాదారు పోస్టులో ఉన్నారు. కానీ జగన్ కు సలహాలు ఇవ్వలేకపోవడం.. ఇచ్చినా ఆయనకు దగ్గరకు పోలేకపోవడం.. ఉత్సవ విగ్రహం లాంటి కుర్చీలో కూర్చోలేక.. ఊరికే జీతం తీసుకోలేక కొన్ని నెలలు జీతాలు కూడా తీసుకోలేదని ప్రచారం జరిగింది.. జగన్ ఇచ్చిన పదవిలో పనిలేక.. ఖాళీగా జీతం తీసుకోలేకనే ఆయన రాజీనామాకు సిద్ధపడ్డట్టు ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.
Tags:    

Similar News