జగన్‌ పిటిషన్ పై మంగ‌ళ‌వారం విచారణ!

Update: 2018-11-09 09:14 GMT
గ‌త నెల 25న ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌ - వైసీపీ అధ్య‌క్షుడు జ‌గ‌న్ పై జ‌రిగిన హ‌త్యాయ‌త్నం దేశవ్యాప్తంగా క‌ల‌క‌లం రేపిన సంగ‌తి తెలిసిందే. అయితే, ఆ హ‌త్యాయ‌త్నం ఘ‌ట‌న‌ను ఏపీ సీఎం చంద్ర‌బాబునాయుడు ప్ర‌భుత్వం చిన్న‌దిగా చిత్రీక‌రించింద‌ని వైసీపీ నేత‌లు ఆరోపిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే తనపై జరిగిన హత్యాయత్నం కేసు విచార‌ణ‌ను కేంద్ర ప్ర‌భుత్వ అధీనంలోని విచార‌ణ సంస్థ‌కు అప్ప‌గించాల‌ని కోరుతూ జగన్ హైకోర్టులో రిట్‌ పిటిషన్ దాఖ‌లు చేశారు. ఈ క్ర‌మంలో నేడు ఆ కేసు విచార‌ణ‌కు వ‌చ్చింది. ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) విచారణ పురోగతి నివేదికను సీల్డ్‌ కవర్  లో మంగళవారం నాటికి కోర్టుకు సమర్పించాలని అటార్నీ జనరల్ ను ఆదేశించింది. ఈ కేసులో ఇరుప‌క్షాల వాద‌న‌లు విన్న ధర్మాసనం....తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.

ఏపీ పోలీసుల విచారణ తీరుపై ఉన్న అనుమానాలను జ‌గ‌న్ త‌ర‌ఫు న్యాయ‌వాదిని అడిగి తెలుసుకుంది. జ‌గన్‌ తరపున ప్రముఖ న్యాయవాది సీవీ మోహన్‌ రెడ్డి...ఆ వాదనలు వినిపించారు. జ‌గ‌న్ పై హ‌త్యాయ‌త్నం కేసులో ఏపీ ప్రభుత్వ తీరు - పోలీసుల విచారణ హాస్యాస్పదంగా ఉన్నాయని ఆయ‌న ఆరోపించారు. ప్రతిపక్ష నాయకుడిపై దాడి జరిగితే దానిని చిన్న ఘ‌ట‌న‌గా చూపార‌ని - కిందిస్థాయి ఉద్యోగుల చేత విచారణ చేయిస్తున్నారని తెలిపారు. ఆ కేసులో కుట్ర ఉందని. కేంద్ర‌ విచారణ సంస్థల చేత దర్యాప్తు జరిపించాలని న్యాయస్థానాన్ని కోరారు. హత్యాయత్నాన్ని తప్పుదోవ పట్టించేలా చంద్రబాబు - డీజీపీ ఠాకూర్‌ వ్యవహరించారని కోర్టుకు వెల్లడించారు. మ‌రోవైపు - ఆ కేసులో నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావుకు విధించిన రిమాండ్‌ ను కోర్టు పొడిగించింది. ఈనెల 23 వరకు అతడికి కస్టడీ విధించింది. శ్రీనివాసరావుకు విధించిన పోలీసు కస్టడీ ముగియడంతో అతడిని శుక్రవారం పోలీసులు మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరిచారు.


Tags:    

Similar News