ఇక ఏపీలో ముఖ గుర్తింపు ద్వారా పథకాలు!

Update: 2022-05-23 03:15 GMT
ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమ పథకాల అమలులో ప్రస్తుతం ఉపయోగిస్తున్న ‘బయోమెట్రిక్‌’ బదులుగా ‘ఫేషియల్‌ అథంటికేషన్‌’ అనే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టేందుకు జగన్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. భవిష్యత్‌లో వేలిముద్రల ఆధారంగా కాకుండా ముఖం ఆధారంగా లబ్ధిదారులను గుర్తిస్తారు.

ప్రస్తుతం ప్రభుత్వం ఏ సంక్షేమ పథకం అమలుచేస్తున్నా.. ఆయా పథకాల లబ్ధిదారుల అందరి నుంచి వేలిముద్రలను సేకరించి, వాటిని లబ్ధిదారుని ఆధార్‌ నమోదు సమయం నాటి వేలిముద్రలతో ధృవీకరించుకుంటోంది . అదే ఫేషియల్‌ ఆథంటికేషన్‌ (ముఖ గుర్తింపు) విధానం అమలులోకి వస్తే వేలిముద్రలకు బదులు లబ్ధిదారుని ముఖాన్ని.. ఆధార్‌లోని ముఖకవళికలతో పోల్చి ధృవీకరించుకుంటారు.

ప్రస్తుతం అమలుచేస్తున్న బయోమెట్రిక్‌ విధానంలో లబ్ధిదారుల వేలిముద్రలు సరిపోక సమస్యలు తలెత్తడంతో ప్రభుత్వం ముఖ గుర్తింపుకు సిద్ధమవుతోంది. వృద్ధులు, ఎక్కువ కాయకష్టం పనులు చేసేవాళ్ల వేలిముద్రలు అరిగిపోతుండడంతో బయోమెట్రిక్‌ పడక సమస్యలొస్తున్నాయి. దీంతో వారు పథకాలు పొందడం కష్టమవుతోంది. బయోమెట్రిక్‌కు బదులు ఐరిష్‌ విధానం అమలుచేసినా.. కళ్ల శుక్లం ఆపరేషన్‌ చేసుకున్న వారితో సమస్యలు ఏర్పడుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది.


ఉదా.. పింఛన్ల పంపిణీలో వేలిముద్రలు సరిపోక ప్రతీనెలా దాదాపు రెండు లక్షల మందికి ఆధార్‌తో సంబంధం లేకుండా పంపిణీ జరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. అలాంటి వారి ఫొటోలు ముందుగా యాప్‌లో నమోదు చేసి, పంపిణీ చేసే సమయంలో ఆ లబ్ధిదారుని ఫొటోతో సరిపోల్చుకుని పంపిణీ చేస్తున్నారు. ఇందులో సిబ్బంది చేతివాటం ప్రదర్శించే అవకాశముంది. దీంతో ఫేషియల్‌ అథంటికేషన్‌ విధానాన్ని అమలుచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

ఇక సంక్షేమ పథకాల కోసం ప్రస్తుతం మొబైల్‌ ఫోన్లు, కంప్యూటర్లతో పాటు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు మూడు లక్షల బయోమెట్రిక్‌ పరికరాలను ప్రభుత్వ యంత్రాంగం వినియోగిస్తోంది. అవి సున్నితమైనవి కావడంతో.. ఏటా 30-40 వేల పరికరాలు కొత్తవి కొనుగోలు చేయాల్సి వస్తోంది. అదే ఫేషియల్‌ అథంటికేషన్‌ విధానంలో అదనంగా ఎలాంటి పరికరాలు ఉపయోగించాల్సిన అవసరం ఉండదని అధికారులు వెల్లడించారు. మొబైల్‌ యాప్‌ ద్వారా లబ్ధిదారుని ముఖాన్ని స్కాన్‌ చేస్తే.. అది ఆధార్‌కు అనుసంధానమై లబ్ధిదారుని సమాచారంతో సరిపోల్చుకుంటుందని చెబుతున్నారు.

 బయోమెట్రిక్‌ స్థానంలో ఫేషియల్‌ అథంటికేషన్‌ అమలుచేయాలంటే కేంద్ర ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫరేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆమోదంతో పాటు ఆధార్‌ డేటా మొత్తం అనుసంధానమై ఉండే యూఏడీ విభాగం అనుమతి తప్పనిసరి. ఇక దేశంలో ఫేషియల్‌ అథంటికేషన్‌ విధానం అమలుచేసే తొలి రాష్ట్రం మన ఏపీయే కావడం గమనార్హం.
Tags:    

Similar News