వద్దన్నదే ముద్దయింది... ఆ ఆదాయం పెంచుకుంటున్న ఏపీ సర్కారు

Update: 2022-07-15 06:41 GMT
ప్ర‌స్తుత స‌ర్కారు రెండంటే రెండు ఆదాయ మార్గాలున్నాయి. ఒక‌టి మ‌ద్యం అమ్మ‌కం, రెండు భూముల అమ్మ‌కం. ఈ రెంటి ద్వారానే ఆదాయం తెచ్చుకోవాల‌ని చూస్తోంది. ఒక‌ప్పుడు మ‌ద్యం అమ్మ‌కాలు నియంత్రిస్తామ‌నో నిషేధిస్తామ‌నో చెప్పార‌ని గుర్తు. కానీ అదంతా పాద‌యాత్ర‌లో నాటి మాట. కానీ ఇప్పుడు మాట మార్చేశారు జ‌గ‌న్. 2025 వ‌ర‌కూ మూడేళ్ల కాల‌ప‌రిమితికి బార్ లైసెన్సులు ఇస్తున్నారు. కొత్త పుర‌పాల‌క సంఘాలు, న‌గ‌ర పంచాయ‌తీ ల్లోనూ బార్లు రానున్నాయి. ఈ మేర‌కు నియ‌మామ‌ళి విడుద‌ల చేసింద‌ని ప్ర‌భుత్వం తెలుపుతుంది.

ఇప్ప‌టికే మ‌ద్యం అమ్మ‌కాల‌కు సంబంధించి ఔట్ లెట్లు ఏర్పాటు చేసి ఫారెన్ లిక్క‌ర్ ను అందుబాటులోకి తీసుకువ‌చ్చిన ఏపీ స‌ర్కారు తాజాగా మ‌రికొన్ని బార్ల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌నుంది. గ‌తంలో ఉండే ద‌ర‌ఖాస్తు రుసుము రెండు ల‌క్ష‌ల రూపాయ‌లు ఉండ‌గా ఇప్పుడు క‌నిష్టంగా ఐదు ల‌క్ష‌ల రూపాయ‌లు కేవ‌లం బార్ లైసెన్స్ పొందేందుకు చెల్లించాల్సిన ధ‌రావ‌త్తు అని తేలిపోయింది.

గ‌రిష్టంగా ప‌ది ల‌క్ష‌ల రూపాయ‌ల వ‌ర‌కూ చెల్లించాల్సి ఉంది . మొత్తమ్మీద కొత్త బార్ విధానం ద్వారా   కేవ‌లం ద‌ర‌ఖాస్తుల ద్వారా 75 నుంచి వంద కోట్ల రూపాయ‌లు రానుంది.  కొత్త బార్ల మంజూరు ద్వారా ఆదాయం నాలుగు వంద‌ల కోట్ల రూపాయ‌లు చేకూర‌నుంద‌ని  తెలుస్తోంది. ఇదే వివ‌రంను ప్ర‌ధాన మీడియా ధ్రువీక‌రిస్తోంది.

వాస్త‌వానికి మ‌ద్యం త‌రువాత భూముల అమ్మ‌కం ద్వారా సొమ్ములు పోగేసుకోవాల‌ని చూస్తోంది. ఇందుకు జ‌గ‌న‌న్న లే ఔ ట్ల‌ను అమ‌రావ‌తిలో సిద్ధం చేసింది. హెచ్ఎండీఏ త‌ర‌హాలోనే సీఆర్డీఏ కూడా ఇందుకు సిద్ధం అయింది. ప్రాథ‌మికంగా కొంత మొత్తం పోగేసింది కూడా! కానీ కొన్ని ప్లాట్ల విలువ చాలా ఎక్కువ‌గా ఉండ‌డంతో ఉద్యోగులు వీటిని కొనుగోలు చేసేందుకు ముందుకు రావ‌డం లేదు. అస‌లు భూముల అమ్మ‌కం లో రాష్ట్ర ప్ర‌భుత్వం అనుకున్న విధంగా పురోగ‌తి సాధించ‌క‌పోవ‌డానికి కార‌ణం కూడా జ‌గ‌నే అన్న‌ది టీడీపీ చెబుతున్న అభిప్రాయం. ఎందుకంటే ఆయ‌న రాజ‌ధాని ప‌నులు నిలుపుద‌ల చేసిన దృష్ట్యా స‌మీప ప్రాంతాల‌లో ల్యాండ్ వాల్యూ ఒక్క‌సారిగా త‌గ్గిపోయింది. ఇప్పుడేమో కంటి తుడుపు చ‌ర్య‌లుగా రైతుల‌కు సంబంధించిన కొన్ని ఫ్లాట్ల‌ను డెవ‌ల‌ప్ చేసి క‌మ‌ర్షియ‌ల్  కాంప్లెక్సులుగా రూపొందించాల‌ని భావించినా, ఇప్ప‌టికిప్పుడు ఇవి సాధ్యం కాని ప‌నులేన‌ని టీడీపీ అంటోంది.

ఈ ద‌శ‌లో మద్యం అమ్మ‌కాలు, కొత్త బార్ లైసెన్సుల మంజూరు త‌దిత‌ర కార‌ణాల‌తోనే నెట్టుకుని రావాల‌ని, త‌ద్వారా  ఖ‌జానాను నింపుకోవాల‌ని, ఇంకా వీలుంటే ప‌రోక్ష ప‌న్నులు రూపేణ బేవ‌రేజెస్ వ‌సూలు చేసుకునేలా సంబంధిత ఆదేశాలు ఇవ్వాల‌ని, తద్వారా సొంత మ‌నుషుల‌కు (లిక్క‌ర్ మ్యానిఫేక్చ‌ర‌ర్స్ కు) సాయం చేయాల‌ని సీఎం యోచిస్తున్నార‌ని నెల్లూరుకు చెందిన టీడీపీ నాయ‌కులు ఆనం వెంక‌ట ర‌మ‌ణ ఆరోపిస్తూ ఉన్నారు.
Tags:    

Similar News