ఏపీ ప్ర‌భుత్వం వ‌ర్సెస్ నిమ్మ‌గ‌డ్డ‌.. మ‌రో వివాదం

Update: 2021-09-21 08:27 GMT
గ‌డిచిన ఏడాదిన్న కాలంలో ఏపీ ప్ర‌భుత్వానికి కంట్లో న‌లుసుగా.. పంటి కింద రాయిగా మారిన రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న్‌.. మాజీ క‌మిష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్‌కుమార్‌.. మ‌రోసారి.. ఏపీ స‌ర్కారుపై కోర్టుకెక్కారు. స్థానిక ఎన్నిక‌ల‌ను క‌రోనా పేరుతో వాయిదా వేయ‌డం.. మంత్రులు పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి స‌హా.. కొడాలి నాని వంటివారిపై ఆంక్ష‌లు విధించ‌డం.. ఎమ్మెల్యే జోగి ర‌మేష్ వంటివారిని క‌ట్ట‌డిచేయ‌డం వంటి ప‌రిణామాల‌కు తోడు.. పంచాయ‌తీ, మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో ప్ర‌భుత్వానికి ఆయ‌న చుక్క‌లు చూపించార‌ని.. అంటారు ప‌రిశీల‌కులు.

దీంతో అటు ప్ర‌భుత్వానికి, ఇటునిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్‌కు మ‌ధ్య తీవ్ర‌స్తాయిలో వివాదాలు న‌డిచాయి. అనంతర కాలంలో ఆయ‌న్ను ఎస్ఈసీ ప‌ద‌వి నుంచి తొల‌గించ‌డం, దానిపై నిమ్మ‌గ‌డ్డ న్యాయ‌పోరాటం చేసి గెలుపొందారు. ఆ త‌ర్వాత ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌పై కూడా కోర్టులో ఎస్ఈసీ, ప్ర‌భుత్వం మ‌ధ్య పోరు నడిచింది. ఇదే కాదు, త‌మ హ‌క్కుల‌కు భంగం క‌లిగేలా నిమ్మ‌గ‌డ్డ మాట్లాడారంటూ, ఆయ‌న‌పై ప్రివిలేజ్ క‌మిటీకి ఫిర్యాదు చేసిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం దానిపై విచార‌ణ న‌డుస్తోంది. అవి కోర్టుల వ‌ర‌కు వెళ్లాయి. నిత్యం ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌లు చేసుకునే దాకా దారితీశాయి.

దీంతో నిమ్మ‌గ‌డ్డ అంటే.. వైసీపీ నేత‌లు విరుచుకుప‌డేవారు. అయితే.. ఆయ‌న ఈ ఏడాది మార్చి 31న త‌న ప‌ద‌వికి విర‌మ‌ణ చేశారు. అప్ప‌టి నుంచి ఆయ‌న ఎక్క‌డా క‌నిపించ‌లేదు. ఆయ‌న మాట కూడా వినిపించ‌లేదు. దీంతో దాదాపు అంద‌రూ నిమ్మ‌గ‌డ్డ‌ను మ‌రిచిపోయారు. అయితే.. అనూహ్యంగా ఆయ‌న మ‌రోసారి మీడియాలో వార్త‌గా నిలిచారు.  అయితే.. తాజా వివాదం నేరుగా ఏపీ ప్ర‌భుత్వంతో కాక‌పోయినా.. ఏపీలో ప‌నిచేస్తున్న అధికారుల‌తో కావ‌డం గ‌మ‌నార్హం.

విష‌యంలోకి వెళ్తే.. నిమ్మ‌గ‌డ్డ సొంత ఊరు.. గుంటూరు జిల్ల‌లోని దుగ్గిరాల‌. ఇక్క‌డే ఆయ‌న‌కు సొంత ఆస్తులు.. పొలాలు కూడా ఉన్నాయి. దీంతో ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర్వాత‌.. ఆయ‌న ఇక్క‌డే శాశ్వ‌త నివాసం ఏర్పాటు చేసుకునేదుకు ప్ర‌య‌త్నించారు. ఈ క్ర‌మ‌లో త‌న ఓట‌రు ఐడెంటిటీని దుగ్గిరాల‌కు మార్చుకునేందుకు అప్ల‌యి చేశారు. ఈ విష‌యాన్ని ఆయ‌న ఎస్ ఈసీగా ఉండ‌గానే మీడియా ముందు చెప్ప‌డం గ‌మ‌నార్హం. అఅయితే.. అప్ప‌టికే త‌న విధుల నిమిత్తం హైద‌రాబాద్‌లో ఉండ‌డంతో త‌న ఓటు అక్కడ ఉంద‌ని.. సో.. దీనిని దుగ్గిరాల‌కు మార్చాల‌నేది ఆయ‌న అభ్య‌ర్థ‌న‌..

అయితే.. ఆయ‌న ఎస్ ఈసీగా ఉన్న‌ప్పుడే ఈ ప‌ని చేయించుకునేందుకు ప్ర‌య‌త్నించారు. కానీ, అప్ప‌ట్లోనే అధికారులు అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు.  గుంటూరు జిల్లా దుగ్గిరాల‌లో తాను ఓటు న‌మోదు చేసుకునేందుకు ఇచ్చిన విన‌తిని చీఫ్ ఎల‌క్టోర‌ల్ అధికారి తిర‌స్క‌రించారు. దీంతో నిమ్మ‌గ‌డ్డ హైకోర్టుకు వెళ్లారు. పుట్టిన ఊరు, నివాస ప్రాంతం, ప‌నిచేసే చోట్ల‌లో ఎక్క‌డ ఓట‌రుగా పేరు న‌మోదు చేసుకోవాల‌నేది రాజ్యాంగం భార‌త పౌరుడికి ఇచ్చిన ఐచ్ఛికమ‌ని ఆయ‌న వాదిస్తున్నారు. దుగ్గిరాల‌లో మొద‌ట ఓట‌రుగా న‌మోదు చేసుకున్నాన‌ని, త‌ర్వాత హైద‌రాబాద్‌కు బ‌దిలీ చేయించుకున్నాన‌న్నారు.

ఉద్యోగ విర‌మ‌ణ త‌ర్వాత సొంతూర్లోనే త‌న‌కు ఓటు క‌ల్పించాల‌ని చేసిన విన‌తిని అధికారులు తిర‌స్క‌రించార‌ని పిటిష‌న్‌లో పేర్కొన్నారు. దుగ్గిరాల ఓట‌రు జాబితాలో త‌న పేరు చేర్చేలా అధికారుల‌ను ఆదేశిస్తూ మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు ఇవ్వాల‌ని ఆయ‌న న్యాయ‌స్థానాన్ని అభ్య‌ర్థించారు. మ‌రి దీనిపై హైకోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి. ఏదేమైనా.. ఇప్పుడు మ‌రో వివాదంతో నిమ్మ‌గ‌డ్డ వార్త‌ల్లోకి ఎక్క‌డం ఆశ్చ‌ర్య‌క‌రంగా ఉంద‌ని అంటున్నారు పరిశీల‌కులు.
Tags:    

Similar News