అశోక్ గజపతిరాజుకు హైకోర్టులో ఊరట

Update: 2021-12-30 13:11 GMT
టీడీపీ సీనియర్ నేత, కేంద్రమాజీ మంత్రి అశోక్ గజపతిరాజుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట లభించింది. రామతీర్థం ఘటనకు సంబంధించి అశోక్ గజపతిరాజుపై నమోదైన ఎఫ్.ఐ.ఆర్ తదుపరి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది.

విజయనగరం జిల్లా రామతీర్థం బోడికొండపై కోదండరాముడి ఆలయ పునర్నిర్మాణ శంకుస్థాపన సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈకార్యక్రమ నిర్వహణలో ప్రొటోకాల్ పాటించలేదని ఆలయ అనువంశిక ధర్మకర్తగా ఉన్న అశోక్ గజపతిరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయ శంకుస్థాపన కార్యక్రమానికి ధర్మకర్తగా ఉన్న తనకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని మండిపడ్డారు.

ఈ క్రమంలోనే రామతీర్థం ఆలయ శిలాఫలకాన్ని నెట్టే ప్రయత్నం చేశారు. అధికారులు, పోలీసులు అశోక్ గజపతిని అడ్డుకున్నారు. అనంతరం వైసీపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. కొబ్బరికాయ కొట్టకుండానే మంత్రి వెల్లంపల్లి తనను అడ్డుకున్నారని అశోక్ గజపతి అసహనం వ్యక్తం చేశారు.  

రామతీర్థం కోదండరాముని ఆలయ పునర్నిర్మాణ శంకుస్థాపన సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలపై ఆలయ ఈవో డీవీవీ ప్రసాదరావు నెలిమర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆలయ పునరుద్ధరణ పనుల శంకుస్థాపన సందర్భంగా ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించడంతోపాటు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారని అశోక్ గజపతి రాజుపై అభియోగాలు మోపారు. దీంతో పోలీసులు అశోక్ గజపతిరాజుపై కేసులు నమోదు చేశారు. దీనిపై అశోక్ గజపతి తాజాగా హైకోర్టును ఆశ్రయించారు.

హైకోర్టులో తనపై నమోదైన ఎఫ్ఐఆర్ ను రద్దు చేయాలని ఫిర్యాదులో కోరారు. అరెస్ట్ తోపాటు ఎఫ్ఐఆర్ ఆధారంగా తదుపరి చర్యలన్నింటినీ నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఇద్దరి వాదనలు విన్న హైకోర్టు ఎఫ్ఐఆర్ పై తదుపరి చర్యలు నిలిపివేయాలని ఆదేశించింది.
Tags:    

Similar News