అధినేతలు అలా.. ఆ పార్టీల నేతలు ఇలా!

Update: 2022-12-26 10:39 GMT
ఆంధ్రప్రదేశ్‌ లో వచ్చే అసెంబ్లీ ఎన్నికలు అప్పుడే హీట్‌ పెంచుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఆయా పార్టీలు పావులు కదుపుతున్నాయి. తమ అస్త్రశస్త్రాలకు పదును పెడుతున్నాయి. విజయమే లక్ష్యంగా భారీ వ్యూహాలను రచిస్తున్నాయి.

175కి 175 సీట్లు సాధించాలనే ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్‌ ఉవ్విళ్లూరుతున్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో కూడా వైసీపీనే గెలుస్తుందని జగన్‌ బల్లగుద్ది చెబుతున్నారు. ఇక ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు సైతం వైసీపీ 175కి 175 కాదు కదా.. పులివెందులలో కూడా జగన్‌ గెలవలేడని, ముందు పులివెందులలో గెలవాలని సవాల్‌ చేస్తున్నారు.

ఇలా జగన్, చంద్రబాబుల మధ్య మాటల తూటాల పేలుతున్నాయి. ఒకరిపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేసుకుంటున్నారు. జగన్‌ సైకో అని.. సైకో పాలన పోయి సైకిల్‌ పాలన రావాలని చంద్రబాబు అంటున్నారు. మరోవైపు చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలని.. ఈ ఎన్నికలతో టీడీపీ భూస్థాపితం ఖాయమని జగన్‌ నొక్కి వక్కాణిస్తున్నారు.

మళ్లీ అధికారమే లక్ష్యంగా జగన్‌.. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టారు. ఎమ్మెల్యేలను, నియోజకవర్గ ఇన్‌చార్జులను ప్రతి ఇంటికీ పంపిస్తున్నారు. మరోవైపు చంద్రబాబు.. బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి వంటి కార్యక్రమాలతో రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు.

రెండు పార్టీల అధినేతలు అధికారమే లక్ష్యంగా ఉద్యుక్తులవుతుంటే.. ఇరు పార్టీల్లోని నేతలు మాత్రం తమ తమ పనుల్లోని మునిగిపోయారని అంటున్నారు.

అధికార వైసీపీలో ఉన్న నేతలు మరోమారు అధికారం దక్కుతుందో, లేదోనని ఆందోళనతో ఉన్నారని టాక్‌. జగన్‌ అంతా సవ్యంగా ఉందని చెబుతున్నా క్షేత్ర స్థాయి పరిస్థితులు అలా లేవని నేతల ఆందోళనగా ఉందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో జగన్‌ ప్రభుత్వానికి ఇంకా ఉంది ఏడాది సమయమే. ఈ నేపథ్యంలో అధికారం అండతో భారీగా సంపాదించుకోవడానికి మార్గాలు వెతుక్కుంటున్నారని టాక్‌. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న రీతిలో వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారని చర్చ జరుగుతోంది.

ప్రతిపక్ష నేతలను తిట్టడానికి వెచ్చించే సమయం మీద కంటే సంపాదన మార్గాలపైనే వైసీపీ నేతలు అధిక దృష్టి పెడుతున్నట్టు టాక్‌. ఇక టీడీపీ నేతలు సైతం తామేమీ తక్కువ తినలేదన్నట్టు కొన్ని చోట్ల వైసీపీ నేతలతో కలిసి వ్యాపారాలు చేస్తున్నారని.. వాటిపైనే దృష్టి సారించారని అంటున్నారు.

చంద్రబాబు, లోకేష్‌ తమ నియోజకవర్గాల పర్యటనలకొస్తే కనిపించడం తప్ప ఆ తర్వాత మళ్లీ తమ కార్యకలాపాల్లో మునిగిపోతున్నారని చెబుతున్నారు. మరికొంతమంది నేతలు జగన్‌ ప్రభుత్వం పెట్టే కేసులు, పోలీసుల వేధింపులు తట్టుకోలేక సైలెంట్‌ గా ఉంటున్నారని పేర్కొంటున్నారు. ఇరు పార్టీల అధినేతలు సమరానికి సై అని కాలు దువ్వుతుంటే.. ఇరు పార్టీల్లో నాయకుల తీరు మాత్రం ఇలా లేదని టాక్‌ నడుస్తోంది. 



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News