బిగ్ బాస్ షోపై ఏపీ హైకోర్టు సీరియస్

Update: 2022-05-03 05:44 GMT
బిగ్ బాస్ రియాలిటీషోపై దాఖలైన పిటీషన్ పై సోమవారం ఏపీ హైకోర్టులో కీలక విచారణ జరిగింది. ఓ ప్రముఖ టీవీ చానెల్ సహా ప్రస్తుతం ఓటీటీ వేదికగా ప్రసారం అవుతున్న బిగ్ బాస్ షోలో అసభ్యత, అశ్లీలత, హింస పాళ్లు మించిపోతున్నాయని అభ్యంతరం వ్యక్తం చేస్తూ తెలుగు యువ శక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి 2019లోనే హైకోర్టు లో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశాడు. దానిపై సోమవారం హైకోర్టు న్యాయమూర్తులు విచారణ జరిపారు.

ఈ వ్యాజ్యంపై అత్యవసర విచారణ జరపాలని పిటీషనర్ తరుఫున న్యాయవాది గుండాల శివప్రసాద్ రెడ్డి ఇటీవల కోరారు. దానికి అంగీకరించిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. బిగ్ బాస్ వంటి రియాలిటీ షో వల్ల సమాజం దెబ్బతింటోందని హైకోర్టు అభిప్రాయపడింది.. ఈ మేరకు జస్టిస్ అసమద్దీన్ అమానుల్లా, జస్టిస్ టి.రాజశేఖరరావుతో కూడిన ధర్మాసం తెలిపింది.

 మా  పిల్లలు బాగున్నారు. ఇలాంటి షోతో మాకేం పని అని ప్రజలు అనుకుంటే సరిపోదని, భవిష్యత్ లో సమస్య ఎదురైనప్పుడు కూడా పట్టించుకోరని కోర్టు తెలిపింది.  రియాలిటీ షో పేరుతో ఏది పడితే అది ప్రసారం చేస్తామంటే సహించేది లేదన్నారు. ఓవైపు హింసను ప్రోత్సహిస్తూ  దాన్ని సంస్కృతి అని ఎలా చెబుతారని ధర్మాసనం ప్రశ్నించింది.

ఈ వ్యాజ్యంపై అత్యవసర విచారణ అవసరమని భావిస్తే.. ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ఎదుట దీని గురించి అడగాలని.. అలా ఎందుకు చేయలేదని పిటీషన్ ను నిలదీసింది.

అయితే హైకోర్టు సీజే ముందు 10 రోజుల కింద పిటీషనర్ అత్యవసర విచారణ చేపట్టాలని అభ్యర్థించాడని.. సీజే ధర్మాసనం అనుమతించలేదని న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. ఇన్చార్జి కోర్టు ముందు విచారణ కోరే హక్కు పిటీషనర్ కు ఉందని తెలిపారు.

అయితే ఈ వాదనలపై హైకోర్టు డివిజన్ బెంచ్ అసంతృప్తి వ్యక్తం చేసింది. సీజే బెంచ్ విచారణ జరిపేందుకు నిరాకరించిన విషయాన్ని తమ ముందు నిజాయితీగా ఒప్పుకొని ఉండాల్సిందనని..  ఎందుకు దాచారని ప్రశ్నించింది. మళ్లీ సీజే బెంచ్ వద్ద అత్యవసర విచారణ కోసం అభ్యర్థించే వెసులుబాటును పిటీషనర్ కే వదిలేసింది.
Tags:    

Similar News