ఆచార్యా! ఏమంటివి ఏమంటివి? ఫీజు కట్టనందువా?

Update: 2019-12-02 08:39 GMT
ఏపీలోని వివిధ యూనివర్సిటీల వైస్ చాన్స్‌ లర్ల నియామకం కోసం దరఖాస్తు చేసుకునే ప్రొఫెసర్లు రూ. వెయ్యి ఫీజు చెల్లించాలని ఉన్నత విద్యామండలి తీసుకొచ్చిన నిర్ణయంపై ఇప్పుడు ప్రొఫెసర్లు విమర్శలు చేస్తున్నారు. అయితే... ప్రతి కోర్సులో ప్రవేశానికి నిర్వహించే పరీక్షల కోసం తమ నుంచి వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తారని.. ఇప్పుడు వీసీ దరఖాస్తులకు ఫీజులు వసూలు చేస్తే తప్పేంటని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు.

ఏపీలోని ఏడు వర్సిటీలకు వీసీలుగా నియమించేందుకు సెర్చి కమిటీలు ఏర్పాటు చేశారు. వైఎస్సార్ ఉద్యాన వర్సిటీ - ఎన్టీఆర్ వర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ -  పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం - ఆంధ్రా వర్సిటీ - ద్రవిడియన్ వర్సిటీ - కృష్ణా వర్సిటీ - ఆదికవి నన్నయ వర్సిటీ - నాగార్జున వర్సిటీ - శ్రీ వెంకటేశ్వర వర్సిటీలకు వీసీలను నియమించేందుకు సెర్చి కమిటీలు ఏర్పాటయ్యాయి. ఈ విషయాన్ని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి తన వెబ్‌ సైట్‌ లో కూడా పొందుపరిచింది. అర్హులైన ప్రొఫెసర్ల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అయితే దరఖాస్తు చేసే ఫ్రొఫెసరు ప్రాసెసింగ్ ఫీజు కింద 1000 రూపాయలు చెల్లించాలన్న నిబంధన విధించింది. ఈ నిబంధన ఇంతకుముందు లేదని - ఇప్పుడెందుకు ఫీజు వసూలు చేస్తున్నారని ప్రొఫెసర్లు ప్రశ్నిస్తున్నారు.

కాగా ఫీజు చెల్లించకపోతే దరఖాస్తులను పరిశీలించబోమని ఉన్నత విద్యామండలి స్పష్టం చేసింది. అన్ని వర్సిటీలకు కలిపి ఒక దరఖాస్తు కాకుండా విడివిడిగా దరఖాస్తు చేయాలి. ప్రతి దరఖాస్తుకు ఫీజు కింద 1000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. బర్త్ సర్ట్ ఫికెట్ - అసిస్టెంట్ ప్రొఫెసర్ - ప్రొఫెసర్‌ గా నియామక ఉత్తర్వులు - సర్వీస్ - తదితర సర్ట్ ఫికెట్లపై ఆయా వర్సిటీల రిజిస్ట్రార్‌ లు సంతకాలు చేయాలన్న షరతు కూడా విధించింది. ఉన్నత విద్యా మండలి తీరుపై కొందరు ప్రొఫెసర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఫీజు వసూలు చేయడం తమ విలువను తగ్గించడమేనంటూ వ్యాఖ్యానిస్తున్నారు. వివిధ వర్సిటీల్లో ప్రొఫెసర్లుగా పనిచేసిన తాము పోటీ పరీక్షలకు వెళ్తున్నట్లుగా ఉందని విమర్శిస్తున్నారు. ఈ తరహా ఫీజు వసూలు సరికాదని అంటున్నారు. అయితే ఉన్నత విద్యా మండలి వర్గాలు మాత్రం దీన్ని సమర్థిస్తున్నాయి. అంత సీరియస్‌ గా ప్రయత్నించని వారి సంఖ్యను తగ్గించేందుకు ఈ ఫీజు నిర్ణయించినట్లు చెబుతున్నాయి. ప్రతి వీసీ పోస్టుకు దాదాపు 150 దరఖాస్తులు వస్తున్నాయని... తాము అర్హులం కాదని తెలిసి కూడా చాలామంది దరఖాస్తు చేస్తున్నారని దాన్ని నివారించడానికే ఈ ఫీజు పెట్టామని చెబుతున్నారు.

అయితే, ఈ ఫీజు విషయంలో విద్యార్థులు మాత్రం తెగ సంతోషిస్తున్నారట. ఫీజులు విద్యార్థులకే కాదు అందరికీ ఉండాలని ఇది మంచి నిర్ణయమేనని అంటున్నారు.


Tags:    

Similar News