కేసీఆర్ కు కౌంటర్ ఇచ్చిన ఏపీ మంత్రి అనిల్

Update: 2021-10-26 05:27 GMT
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏపీలో ఎంత మంది స్నేహితులు.. అభిమానులు... చుట్టాలు ఉన్నారో తెలీదు. వారికి సంబంధించిన వివరాల్ని ఆయన వెల్లడించింది లేదు. అంత మంది ఏపీలో ఉన్నప్పుడు.. వారి ఇళ్లల్లో జరిగే ఈవెంట్లకు సీఎం కసీఆర్ తరచూ ఎందుకు వెళ్లరు? అన్నది మరో డౌట్. ఏది ఏమైనా.. సీఎం కేసీఆర్ కు ఏపీలో ఉన్న ఇమేజ్ అంతా ఇంతా కాదన్న సంగతి తెలిసిందే. అదెంత నిజమన్నది పక్కన పెడితే.. ఆయన మాత్రం ఎప్పటికప్పుడు ఆ విషయాన్ని చెప్పుకుంటూ.. ఏపీకి చెందిన వారు తనకు ఫోన్ చేసి మాట్లాడారని చెబుతుంటారు.

తాజాగా నిర్వహించిన 20 ఏళ్ల పార్టీ ప్లీనరీ సందర్భంగా ఏపీలో టీఆర్ఎస్ పార్టీని పెట్టాలని ఏపీ ప్రజల నుంచి పెద్ద ఎత్తున వినతులు వస్తున్నాయని.. పార్టీ పెడితే చాలు.. గెలిపిస్తామన్న విన్నపాలు వస్తున్నట్లు వెల్లడించారు. ఏపీలో కరెంటు కోతులు ఉన్నాయి. తెలంగాణలో సంక్షేమ పథకాలు బాగా అమలవుతున్నాయి.. ఏపీలోనూ టీఆర్ఎస్ పార్టీ రావాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారన్నారు. ఈ వ్యాఖ్యలపై ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు. కేసీఆర్ చెప్పినట్లుగా.. ఏపీలో కరెంటు కోతలు లేవని.. బొగ్గు సమస్య ఏపీకి మాత్రమే పరిమితం కాలేదని. దేశ వ్యాప్తంగా ఈ సమస్య ఉందన్నారు. తెలంగాణతో పోలిస్తే.. ఏపీలోనే సంక్షేమ పథకాలు ఎక్కువగా అమలవుతున్నాయన్నారు.

ఉప ఎన్నికల స్టంట్ లో భాగంగానే తెలంగాణ సీఎం కేసీఆర్ అలా ప్లీనరీలో మాట్లాడి ఉండొచ్చన్న అభిప్రాయాన్ని మంత్రి అనిల్ వ్యక్తం చేశారు. తెలంగాణలో అమల్లో ఉన్న పథకాల కంటే కూడా ఏపీలోనే ఎక్కువ పథకాలు అమల్లో ఉన్నాయని చెప్పారు.

ఇటీవల కాలంలో సీఎం కేసీఆర్ నోటి నుంచి అదే పనిగా ప్రస్తావిస్తున్న దళితబంధు పథకం మీదా మంత్రి అనిల్ మాట్లాడారు. దళితబంధు పథకాన్ని తెలంగాణలో ఇప్పటివరకు ఒకే ఒక్క నియోజకవర్గంలో అమలు చేశారని.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయలేదన్నారు. ఏపీలో తమ పార్టీని ఏర్పాటు చేయాలన్న కేసీఆర్ మాటకు స్పందిస్తూ.. ‘కావాలంటే ఏపీలో పార్టీ పెట్టుకోవచ్చు. పార్టీ పెట్టుకోవటాన్ని స్వాగతిస్తున్నాం. మాకెలాంటి అభ్యంతరాలు లేవు. ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాం’ అని వ్యాఖ్యానించారు. మొత్తానికి తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు సూటిగా కౌంటర్ ఇచ్చింది మాత్రం మంత్రి అనిల్ ఒక్కరే కావటం గమనార్హం.
Tags:    

Similar News