అచ్చం జగన్ మాటలే ఆ మంత్రి నోటి వెంట...!

Update: 2023-01-12 02:30 GMT
జగన్ ఎపుడూ అంటూ ఉంటారు మాకు కొన్ని చానళ్ళు, పేపర్లు పూర్తి వ్యతిరేకం. అవి మాకు శత్రువులు అని. ఆయనకు ముందు వైఎస్సార్ అయితే సీఎం గా ఉండగా నిండు సభలో మాట్లాడుతూ ఆ రెండు పత్రికలు అని విమర్శించేవారు. జగన్ జమానాకు వచ్చేసరికి ఆ మీడియా సంఖ్య బాగా పెరిగింది. జగన్ పబ్లిక్ స్పీచ్ లలో కూడా రాజకీయ ప్రత్యర్ధులతో కలిపి మరీ వ్యతిరేక మీడియాను ఎండగడుతూ ఉంటారు.

ఇపుడు ఆయన మంత్రివర్గ సహచరుడు, సీనియర్ నేత అయిన ధర్మాన ప్రసాదరావు కూడా జగన్ నోటి వెంట వచ్చిన మాటలనే వల్లించడం విశేషం. తన మీద అవినీతి భూ కబ్జా ఆరోపణలు చేస్తున్న పత్రికలు మీడియా మీద మంత్రి గారు విరుచుకుపడుతూ కొన్ని టీవీ చానళ్ళు తమ ప్రభుత్వానికి పార్టీకి పూర్తి వ్యతిరేకం అని ఒక భారీ స్టాంప్ వేసేసారు. వారి మాటలను నమ్మవద్దు అంటూ ఆయన కోరుతున్నారు అన్న మాట.

తాను ఏ మీటింగ్ పెట్టినా తన దగ్గర సదరు వైసీపీ వ్యతిరేక చానళ్ళ ప్రతినిధిగా రిపోర్టర్లు ఉంటారని, వారు తాను ఒకటి చెబితే దాన్ని వారికి అనుగుణంగా మలచుకుంటూ ఎడిటింగ్ చేసి మరీ తనను బదనాం చేస్తున్నారు అని ధర్మాన మండిపడ్డారు. తాను మంచి మాటలు చెప్పినా అందులో తప్పులు తీసి తమకు అనుకూలంగా వేసుకోవడం  రాసుకోవడం ఆ టీవీ చానళ్ళు పత్రికలకు అలవాటుగా మారింది అని ధర్మాన మండిపడ్డారు.

పాపం ఆ పత్రికల తరఫున వచ్చిన రిపోర్టర్ ఏం చేస్తారు ఆయన ఒక సాధారణ ఉద్యోగి మాత్రమే అని అసలు కధ అంతా యాజమాన్యాల వద్దనే ఉంది అని ఆయన అంటున్నారు. తాము ఏ మంచి చేసిన చెప్పకుండా చూపించకుండా లేని పోనివి రాయడం వేయడమే ఆ టీవీ చానళ్ళ పని అని ధర్మాన విరుచుకుపడ్డారు.

తాను సెంటు భూమి కూడా రెవిన్యూ మంత్రిగా ఉంటూ ఇవ్వలేని స్థితి అని ఒక భూమి ఇవ్వాలన్నా మంత్రివర్గం మొత్తం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది అని ఆయన అన్నారు. అలాంటిది  తనను భూకబ్జా దారునిగా ఎలా విమర్శిస్తారు అని ఆయన ప్రశ్నించారు. తాను అవినీతికి పాల్పడలేదని ఆయన అంటున్నారు. చంద్రబాబు అవినీతిని ఆయన ప్రశ్నించారు. తన అవినీతిని రుజువు చేస్తే మాత్రం తాను రాజకీయ సన్యాసం స్వీకరిస్తాను అని ఆయన సవాల్ చేశారు.

లేనివి ఉన్నట్లుగా కొన్ని మీడియా సంస్థలు టీవీ చానళ్ళు రాయడం కరెక్ట్ విధానం కాదు అని ఆయన ఫైర్ అవుతున్నారు. జగన్ దుష్ట చతుష్టయం అంటూ ఒక సెక్షన్ ఆఫ్ మీడియాకు పేరు పెట్టేశారు. ఇపుడు ఆయన మంత్రి కూడా తమకు ఆ టీవీ చానళ్ళు శత్రువులు అని జమ కట్టేశారు. ముందు ముందు మరెందరు మంత్రులు నాయకులు ఇలా మీడియా మీద విరుచుకుపడతారో చూడాల్సి ఉంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News