వైసీపీ మంత్రుల‌కు నిర‌స‌న సెగ‌లు...!

Update: 2021-11-24 16:30 GMT
ఆంధ్రప్రదేశ్‌ను వర్షాలు, వరదలు ఎలా ముంచెత్తుతున్నాయో చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా రాయలసీమలో కడప - కర్నూలు - చిత్తూరు జిల్లాలను భారీ వర్షాలు తీవ్రంగా ముంచెత్తడంతో ఆయా జిల్లాల్లో పలు ప్రాంతాల్లో పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. వరద ముంపు ప్రాంతాల్లో ప్రజల పరిస్థితి చాలా దారుణంగా తయారయింది. ప్రభుత్వం కొన్ని సౌకర్యాలు కల్పిస్తున్నా అవి ఏ మాత్రం సరిపోవడం లేదు. వరద పరిస్థితి తీవ్రంగా ఉండడంతో ప్రజాప్రతినిధుల్లో ఒకరిద్దరు మినహా మిగిలిన వారెవరు జనాల్లోకి వెళ్లలేని పరిస్థితి ఉంది. చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాత్రమే వరదల్లో తిరుగుతూ.. ఎక్కడికక్కడ చెరువు కట్టలను పటిష్ట పరుస్తూ ప్రజలకు అండగా ఉంటున్నారు.

మంత్రులుగా ఉన్న నేతలు సైతం ప్రజలను పట్టించుకోని పరిస్థితి ఉంది. కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం వరదలు తీవ్రంగా ఉన్న రెండు మూడు రోజులు జనాల్లోకి వెళ్ళలేదు. ఇప్పుడిప్పుడే క్రమంగా వరద తగ్గుముఖం పడుతూ ఉండటంతో బయటకు వస్తున్నారు. అయితే వీరిపై ప్ర‌జ‌లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులను పరామర్శించేందుకు వెళ్లారు. అయితే ఆయనకు ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత రావడంతో పాటు గట్టిగా నిరసనలు వ్య‌క్త‌మ‌య్యాయి.

నెల్లూరు జిల్లాలోని సంఘం మండలం కోలగుట్ల గ్రామానికి వెళ్లిన గౌతమ్ రెడ్డిని గ్రామస్తులు నిలదీశారు. గత నాలుగు రోజులుగా తాము వరదల్లో చిక్కుకుని ఆకలితో ఆర్తనాదాలు చేసినా... ఎవరూ పట్టించుకోలేదని వాపోయారు. తాము బ‌తుకుతామో లేదో కూడా తెలియని పరిస్థితుల్లో బిక్కుబిక్కు మంటూ జీవ‌నం కొనసాగించామని ఆగ్రహం వ్యక్తం చేశారు. తినడానికి తిండి లేక... ఉండడానికి నిలువ నీడ లేక న‌ర‌కం చూశామ‌ని మంత్రి గౌతమ్ ముందు. వాపోయారు.

ప్రజలు ఒక్కసారిగా మంత్రిని నిలదీయడంతో అవాక్కైన ఆయన వారిని ఓదార్చేందుకు ప్రయత్నించారు. ప్రభుత్వం నుంచి వీలైనంత సహాయం చేస్తామని నాలుగు ఓదార్పు మాటలు చెప్పారు. ఇదిలా ఉంటే మంగళవారం నాడు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి కూడా నెల్లూరు జిల్లాలో ఇదే చేదు అనుభవం ఎదురైంది. మంత్రి బాలినేనితో పాటు కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని, నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ ను నెల్లూరు జిల్లా వరద బాధితులు అడ్డుకుని ఫైర్ అయ్యారు. తాము వ‌ర‌ద‌ల్లో మునిగి న‌ర‌కం చూస్తుంటే.. ఇప్పుడు సినిమా చూడ‌డానికి వ‌చ్చారా ? అంటూ ప్ర‌శ్నించారు. దీంతో స‌హ‌నం కోల్పోయిన ఎమ్మెల్యే వారిపై ఫైర్ అయ్యారు.
Tags:    

Similar News