త‌రిమికొట్టాలనే మాటను మీరా చెప్పేది ర‌ఘువీరా?

Update: 2018-06-01 07:19 GMT
త‌ప్పులు మ‌నుషులు మాత్ర‌మే చేయ‌గ‌ల‌రు. త‌ప్పులు చేసి కూడా వాటిని దిద్దుకునే ఛాన్స్ మ‌నుషుల‌కే ఉంటుంది. అదే యంత్రాల‌కైతే.. ప‌క్క‌న పాడేస్తారు. వారికి రెండో ఛాన్స్ ఇవ్వ‌టం ఉండ‌దు. కానీ.. మ‌నుషుల‌కు అలాంటి ఛాన్సులు బోలెడ‌న్ని. ఇక‌.. రాజ‌కీయ నాయ‌కుల‌కైతే అన్ లిమిటెడ్‌ గా ఉంటాయి. అదెలా అంటారా?  ఏపీ కాంగ్రెస్ నేత‌ల మాట‌లు వింటే మేం చెప్పిన మాట ఎంత నిజ‌మో ఇట్టే అర్థ‌మ‌వుతుంది.

త‌ప్పులు కాదు.. చారిత్ర‌క ద్రోహం చేసిన ఏపీ కాంగ్రెస్ నేత‌లు ఇప్పుడు ఆంధ్రోళ్ల‌కు కొత్త కొత్త మాట‌లు చెబుతున్నారు. ఇష్టం వ‌చ్చిన రీతిలో రాష్ట్రాన్ని రెండు ముక్క‌లు చేసేసి.. ఆంధ్రాకి తీర‌ని అన్యాయం చేసిన వైనానికి ఇప్ప‌టివ‌ర‌కూ స‌రిగా క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌ని వారు..బీజేపీని ఏపీ ప్ర‌జ‌లు త‌రిమికొట్టాల‌న్న వ్యాఖ్య‌లు చేస్తున్నారు.

ఏపీ ప్ర‌జ‌లు ఇప్పుడు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌కు మూలం కాంగ్రెస్ పార్టీ.. దానికి చెందిన నేత‌లే. విభ‌జ‌న నాడే.. ఏపీకి రావాల్సిన వాటి విష‌యంలో స్ప‌ష్టంగా వ్య‌వ‌హ‌రించి ఉంటే.. ఇప్పుడు ఎదుర్కొంటున్న తిప్ప‌లు ఉండేవే కావు. కానీ.. అడ్డ‌గోలుగా విభ‌జ‌న చేసే స‌మ‌యంలో నోరు మూసుకొని ఉన్న వారు.. ఇప్పుడేమో బీజేపీ నేత‌ల్ని త‌రిమి కొట్టాలంటూ పెద్ద పెద్ద మాట‌లు మాట్లాడుతున్నారు.

ఆ మాట‌కు వ‌స్తే..బీజేపీతో పాటు ఏపీ కాంగ్రెస్ నేత‌ల్ని సైతం ఆంధ్రా నుంచి త‌రిమి కొట్టాల్సిన అవ‌స‌రం ఉంది. ప్ర‌త్యేక హోదాకు సంబంధించిన హామీని చ‌ట్టంలో పొందుప‌ర్చి.. దానికి చ‌ట్ట‌బ‌ద్ధ‌త క‌ల్పించి ఉంటే.. ఈ రోజు ఇన్నేసి తిప్ప‌లు ఉండేవి కాదు. కానీ.. అదేమీ లేకుండా విభ‌జ‌న చేసేశాం.. మీ చావు మీరు చావండ‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించారు. విభ‌జ‌న త‌ర్వాత అయినా.. తాము చేసిన త‌ప్పుడు ప‌ని కార‌ణంగా ఏపీ ప్ర‌జ‌లు తీవ్రంగా ఇబ్బంది ప‌డుతున్న వైనాన్ని గుర్తించి.. దిద్దుబాటు చ‌ర్య‌లు చేప‌డ‌తామ‌న్న మాట‌ను ఇప్ప‌టివ‌ర‌కూ చెప్పింది లేదు.

చేసిన త‌ప్పును ఎలా స‌రిదిద్దుకుంటామో చెప్ప‌ని కాంగ్రెస్ నేత‌లు.. బీజేపీ నేత‌ల తీరుపైన మాత్రం తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డుతున్నారు. ప్ర‌త్యేక‌హోదా ఇస్తాన‌ని వెంక‌న్న సాక్షిగా ప్ర‌మాణం చేసి రాష్ట్ర ప్ర‌జ‌ల్ని దారుణంగా మోసం చేశారంటూ ర‌ఘువీరారెడ్డి గుండెలు బాదేసుకుంటున్నారు. బీజేపీ నేత‌ల్ని త‌రిమి.. త‌రిమి కొట్టాల‌ని ఆయ‌న పిలుపునిస్తున్నారు.

ఆ మాట‌కు వ‌స్తే.. ఏపీకి విభ‌జ‌న శాపాన్ని ఇచ్చిన కాంగ్రెస్ నేత‌ల్ని ఏం చేయాలో ర‌ఘువీరా చెబితే బాగుంటుంది. అదే స‌మ‌యంలో తాము చేసిన వెధ‌వ ప‌నిని క‌వ‌ర్ చేసుకునే ప్ర‌య‌త్నంలో భాగంగా.. రాహుల్ ప్ర‌ధానిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన వెంట‌నే తొలి సంత‌కం ప్ర‌త్యేక హోదా ఫైలు మీద‌నే అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ఒక‌వేళ‌.. అదే నిజ‌మైతే.. రాహుల్ గాంధీ చేత‌.. సోనియాగాంధీ చేత ఎందుకు చెప్పించ‌రు ర‌ఘువీరా? అని ప‌లువురు ప్ర‌శ్నిస్తున్నారు. మ‌రి.. దీనికి ర‌ఘువీరా రియాక్ష‌న్ ఏమిటి?
Tags:    

Similar News