ఎడ్ల‌ను అరెస్టు చేసిన ఏపీ పోలీసులు.. టీడీపీపై కోప‌మే కార‌ణం

Update: 2022-09-19 07:30 GMT
తెలుగుదేశం శాసనసభాపక్షం నిరసన ర్యాలీపై పోలీసులు ఆంక్షలు విధించారు. తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసుకున్న ఎడ్లను అరెస్టు చేసి బండ్లతో స‌హా తుళ్లూరు ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఎండ్లను పోలీస్‌స్టేషన్‌ నుంచి దూరంగా తరలించి టైర్లలోని గాలి తీసేశారు. రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ.. మందడం నుంచి ఎడ్ల బండ్లపై నిరసన ర్యాలీ చేపట్టాలని టీడీపీ నేతలు సిద్దం కావ‌డంతోపోలీసులు ఇలా వ్య‌వ‌హ‌రించ‌డం గ‌మ‌నార్హం.

రైతు సమస్యలపై తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆధ్వర్యంలో సోమ‌వారం టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేపట్టిన  నిరసనపై పోలీసులు ఆంక్షలు విధించారు. మందడం గ్రామం నుంచి అసెంబ్లీ వరకూ ఎడ్ల బళ్లపై ర్యాలీగా వెళ్లాలని టీడీపీ నేతలు నిర్ణయించుకున్నారు. కానీ పోలీసులు ముందస్తుగా పలువురు నేతలను గృహనిర్భందం చేశారు.

తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసుకున్న ఎడ్ల బండ్లను తుళ్లూరు ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఈ విష‌యంలో నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎడ్లను అరెస్టు చేయడమేంటని పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

ఫలితంగా అసెంబ్లీ పరిసరాల బయట ఉద్రిక్తత నెలకొంది. ఎడ్లబండి కాడె మోస్తూ అసెంబ్లీకి లోకేష్ నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ నిరసనలో అచ్చెన్నాయుడు, రామానాయుడు, చినరాజప్ప, బుచ్చయ్య చౌదరి, ఇతర ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. పోలీసు వలయాన్ని తోసుకుంటూ అసెంబ్లీ ప్రధాన ద్వారం వరకూ ఎడ్ల బండిని లాక్కుంటూ నేతలు వెళ్లారు.

తెలుగుదేశం నిరసనకు ఎడ్ల బండి ఇచ్చిన రైతును సీఐ తీవ్రంగా కొట్టారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. రైతుపై చెయ్యి చేసుకున్న పోలీసుల పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

రైతుని కొట్టిన అంశంపై అసెంబ్లీలోనూ నిరసన తెలుపుతామని తేల్చిచెప్పారు. ప్రభుత్వం దుర్మార్గపు చర్యల వల్లే పంట విరామం ప్రకటించాల్సి వచ్చిందని నేతలు వ్యాఖ్యానించారు. అంతకుముందు తుళ్లూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్ద ఉన్న తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసనకు దిగారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News