కాషాయం కసరత్తు : బాబు ఊసు లేని ఏపీ రాజకీయ వంటకం

Update: 2022-11-27 03:30 GMT
ఏపీ రాజకీయాలు కానీ తెలుగు రాజకీయాలు కానీ చంద్రబాబు ఊసు లేకుండా సాగుతాయా. అసలు కలలో అయినా ఊహించగలమా. చంద్రబాబు ఆషామాషీ లీడర్ కాదు. ఆయన శ్వాస ఆశ అంతా రాజకీయమే. యువకుడిగా ఉంటూ పాలిటిక్స్ లో అడుగుపెట్టిన చంద్రబాబు ఏడు పదుల వయసు దాటినా  రాజకీయాలను ఇంకా ఇష్టంగానే చేస్తున్నారు. ఎక్కడా ఆయన కష్టం అన్న మాట ఎత్తడంలేదు.

అలాంటి బాబుని 2019 ఎన్నికలు కాస్తా తగ్గించేశాయి. ఆయన పాలిటిక్స్ ప్రతిపక్షానికి పరిమితం చేశాయి. అయినా సరే పడిలేచే కడలితరంగంలా బాబు ముందుకు దూసుకురావలని అనుకుంటున్నారు. ఈ చాన్స్ కనుక తనకు ఇచ్చేస్తే లోకేష్ చేతిలో పార్టీని ప్రభుత్వాన్ని పెట్టేసి మరో నలభయ్యేళ్ల పాటు టీడీపీని చెక్కుచెదరకుండా తయారు చేసి పెట్టాలన్నది బాబు ఎత్తుగడ.

అయితే బాబు ఆలోచనలు అలాగే కొనసాగితే మిగిలిన వారికి సీఎం సీటు మీద ఆశలు పూర్తిగా లేకుండా పోతాయి. ఒక్క చాన్స్ అంటూ సీఎం కుర్చీ ఎక్కిన జగన్ అధికారాన్ని అనుభవిస్తున్నారు. ఆయనకు ఇపుడు మరో చాన్స్ కావాలని ఉంది. ఇక కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన జనసేనాని పవన్ కళ్యాణ్ టార్గెట్ కూడా సీఎం సీటే. ఆయన్ని నమ్ముకుని ఏపీలో కధ నడిపిస్తున్న కమలదళానిది ఏపీ మీద ఏళ్ల నుంచి వ్యామోహం ఉంది.

ఇలా ముగ్గురు పార్టీలకు  ఏపీ  రాజకీయం అందాలంటే సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ చంద్రబాబు రాజకీయంగా మరింతంగా దెబ్బ తినాలి. ఇక ఆయన 2024లో అసలు గెలవకూడదు. అలా కనుక జరిగితే ముఖ్యమంత్రిగా జగన్ మరోసారి కుర్చీ ఎక్కవచ్చు. ఇక పవన్ కళ్యాణ్ ఏకంగా చంద్రబాబు పొజిషన్ అయిన అపొజిషన్ లోకి రావచ్చు. ఆయన పక్కనే బీజేపీ ఉంటూ వీలును బట్టి ఏపీ రాజకీయాల్లో తమదైన చక్రం తిప్పేందుకు కూడా సిద్ధం కావచ్చు.

ఇలాంటి ఆలోచనలతో లోపాయికారీ అవగాహన ఏమైనా ఉందో లేదో తెలియదు కానీ మూడు ప్రధాన పార్టీలు బాబు మీద కత్తి కట్టేశాయని అంటున్నారు. దీనికి తెర వెనక సూత్రధారి మాత్రం కమలం పార్టీ పెద్దలే అని చెబుతున్నారు. నిజానికి ఏపీలో వైసీపీ ముక్త రాజకీయాన్ని చూపిస్తామని చెబుతూ వచ్చిన పవన్ కళ్యాణ్ విశాఖలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో భేటీ కాగానే బాగా మెత్తపడ్డారు.

దాదాపుగా ఆయన మౌన ముద్ర దాల్చుతున్నారు. దానికి కారణం మోడీ ఆయనకు మాస్టర్ ప్లాన్ చెప్పడమే అని అంటున్నారు. చంద్రబాబు లేని ఏపీలో  సీఎం  సీటు దక్కేది పవన్ కే అని మోడీ హిత వచనాలు పలికి ఉంటారని అంటున్నారు. దాంతోనే పవన్ సొంతంగా రాజకీయాలు చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఇంకో వైపు జగన్ కూడా చంద్రబాబు కంటే పవన్ కళ్యాణ్ తన రాజకీయ ప్రత్యర్ధిగా ఉండడాన్నే ఇష్టపడుతున్నారని అంటున్నారు.

వినడానికి ఇది తమాషాగా ఉన్నా రాజకీయాల్లో ఇలాంటివి అనేకం జరుగుతాయి. చంద్రబాబును ఎదుర్కోవడం కంటే పవన్ తో ఫైటింగ్ చేయడం సులువు అన్నది జగన్ మార్క్ ప్లాన్ గా కనిపిస్తోంది. మరి అనుకుని చేశారా లేక వ్యూహాత్మకంగా చేశారా తెలియదు కానీ విశాఖలో గత నెలలో జరిగిన ఎపిసోడ్ తో పవన్ ఒక్కసారిగా ముందు వరసలోకి వచ్చేశారు. అలా పవన్ గ్రాఫ్ ని ఆయన స్థాయిని వైసీపీ తన వంతుగా యధాశక్తిగా పెంచేసింది.

అదే టైం లో బీజేపీ కూడా పవన్ టీడీపీతో కలవకుండా ఉండాలంటే ఆయన హైప్ ని పెంచేయాలని ఆయన్ని ఎలివేట్ చేస్తూ పోవాలని డిసైడ్ అయింది అంటున్నారు. అందులో భాగమే ప్రధాని  మోడీ పవన్ తో జరిపిన భేటీ అని అంటున్నారు. దీంతో పవన్ ఇపుడు సీఎం సీటు మీద ఫోకస్ పెట్టి పనిచేసుకుంటున్నారు. ఏపీలో 2024 ఎన్నికల్లో పవన్ దూకుడు చేయాలి.దానికి బీజేపీ సాయం చేస్తుంది. అదే విధంగా మరోమారు ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చినా బీజేపీకి ఫరవాలేదు, కానీ చంద్రబాబు మాత్రం రాకూడదు,

ఈ లెక్కలతోనే ఇపుడు ఏపీలో రాజకీయం సాగుతోంది. బాబు విముక్త ఏపీ కోసం అన్ని పార్టీలు చూస్తున్నాయని అంటున్నారు. దీనికి బీజేపీ తెర వెనక డైరెక్షన్ చేస్తూంటే తెర ముందున వైసీపీ జనసేన కూడా అలాగే వ్యవహరిస్తున్నాయని అంటున్నారు. ఏపీ రాజకీయాల్లో చంద్రబాబు ప్లేస్ లో పవన్ కళ్యాణ్ కనుక ఉంటే తమకు రాజకీయంగా పట్టు దొరుకుతుంది అని బీజేపీ పక్కా ప్లాన్ తో ఉంది అని అంటున్నారు. ఇంకో వైపు చూస్తే బీజేపీ ఏపీలో పవన్ని కీలకం చేయడం ద్వారా మొత్తం రాజకీయాన్ని తన కంట్రోల్ లో ఉంచుకోవాలని చూస్తోంది అని అంటున్నారు. మొత్తానికి చూస్తే చంద్రబాబు మీద అంతా కలసి టార్గెట్ చేస్తున్నారా అన్న చర్చ మొదలైపోయింది.

టీడీపీని దానికి మద్దతుగా ఉన్న  మీడియా సంస్థల మీద వైసీపీ సర్కార్ టార్గెట్ చేయడం ఈ వ్యూహంలో భాగమే అని అంటున్నారు. మొత్తానికి చూస్తే వైసీపీ విముక్త ఏపీ రాజకీయం కాస్తా ఇపుడు బాబు లేని రాజకీయ వంటకం తయారు చేసే పనిలో పడింది అని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News