మార్గదర్శిలో అవకతవకలు.. చెప్పిందెవరు? ఈనాడు ఏం చెప్పింది?

Update: 2022-11-29 04:45 GMT
ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు గురించి తెలియని వారు ఉండరు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. జాతీయ స్థాయిలోనూ తెలుగు మీడియా అన్నంతనే ఆయన పేరు గుర్తుకు వస్తుంది. అంతటి బలమైన నెట్ వర్కుతో పాటు.. భారీ సంస్థగా తన మీడియా హౌస్ ను ఆయన తీర్చిదిద్దారు.

ఆయనకున్న వ్యాపారాల్లో మార్గదర్శి చిట్ ఫండ్ ఒకటి. దివంగత మహానేత వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న వేళలో మార్గదర్శి చిట్ ఫండ్స్ సంస్థ అక్రమాలకు పాల్పడుతుందని అప్పటి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన ఆరోపణలు సంచలనంగా మారటమే కాదు.. షాకింగ్ గా మారింది.

అయితే.. ఈ ఎపిసోడ్ ను ఎంత దూరం తీసుకెళ్లినా.. అది కాస్తా ఒక స్థాయి వరకు వెళ్లి ఆగిపోవటం తెలిసిందే. కట్ చేస్తే.. మళ్లీ ఈ మధ్యన అలజడి మొదలైంది. మార్గదర్శి లో అవకతవకలు జరిగాయంటూ రోజుల తరబడి సోదాలు నిర్వహించటం.. ఈ తీరుపై రామోజీ గ్రూప్ తన అభ్యంతరాల్ని.. వాదనల్ని వినిపించటం తెలిసిందే.

ఇదిలా ఉంటే.. తాజాగా ఈ ఎపిసోడ్ కు సంబంధించిన కీలక వ్యాఖ్యల్ని చేశారు ఏపీ రిజిస్ట్రేషన్లు.. స్టాంపుల శాఖ ఐటీ రామక్రిష్ణ. చిట్ ఫండ్స్ నిధులను నాన్ చిట్ ఫండ్స్ కార్యకలాపాలకు మళ్లించినట్లుగా కనిపిస్తోందని.. దానిపై ప్రత్యేక ఆడిట్.. ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహిస్తామని ఆయన చెబుతున్నారు. మార్గదర్శి చిట్ ఫండ్స్ కార్యకలాపాలపై నిర్దిష్టంగా ప్రజల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాలేదని.. అయినప్పటికీ మోసాలు జరిగేంతవరకు వేచి ఉండకూదదన్న ఉద్దేశంతో శాఖాపరంగా మిగిలిన చిట్ ఫండ్స్ ఆఫీసుల్లో మాదిరి తనిఖీలు చేసినట్లుగా ఆయన చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.. మార్గదర్శి వాదన మరోలా ఉంది. ఐజీ రామక్రిష్ణ చేసిన ఆరోపణలన్ని అసత్యాలేనని పేర్కొన్నారు. జగన్ ప్రభుత్వం చేసిన ఆరోపణలన్నీ అసత్యాలేనని.. ప్రభుత్వం కక్షపూరితంగా చేస్తున్న దాడిలో ఇదొకటిగా అభివర్ణించారు. 60 ఏళ్లుగా చట్టబద్దంగా నడుస్తున్న మార్గదర్శి ఛిట్ ఫండ్స్ పై ప్రభుత్వం దురుద్దేశపూర్వకంగానే దాడులకు తెగబడుతుందని వ్యాఖ్యానించింది.

తమ సంస్థకు చెందిన ఖాతాదారుల్లో అనుమానాలు రేకెత్తించి.. సంస్థ వ్యాపార ప్రయోజనాల్ని దెబ్బ తీయటమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పన్నిననట్లుగా వెల్లడైందని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. అధికారులు చేస్తున్న ఆరోపణల్లోని అసత్యాల్ని.. కుట్ర కోణాన్ని ప్రజల ముందు ఉంచుతామని పేర్కొన్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News