ఏపీలో కండక్టర్ల వ్యవస్థకు చెల్లుచీటేనా?..మరి వారి భవిష్యత్తేంటీ?

Update: 2020-05-09 17:30 GMT
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్సార్టీసీ)ని రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సర్కారు... ప్రభుత్వంలో విలీనం చేస్తూ... ఏపీఎస్సార్టీసీ పేరును ‘ప్రజా రవాణా’గా మార్చేశారు. ఈ చర్యతో తమ బతుకులకు గట్టి హామీ దొరికిందని ఆర్టీసీ ఉద్యోగులంతా సంబరపడిపోయిన వైనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఈ సంబరం కొంత మందికే వర్తిస్తుందన్న చేదు వార్త ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తోంది. ఆర్డీసీలో డ్రైవర్ల సంఖ్య ఎంతుందో.. కండక్టర్ల సంఖ్య కూడా ఇంచూమించూ అంతే ఉంది. అయితే ఇప్పుడు ఆర్టీసీ బస్సులను వన్ మన్ సర్వీసులుగా మార్చేస్తూ... కండక్టర్ల పనినీ డ్రైవర్లే చేసేలా ప్రభుత్వం తాజాగా కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల కారణంగా సంస్థలో పనిచేస్తున్న కండక్టర్ల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసిందని చెప్పక తప్పదు. ప్రయాణికుల నుంచి టికెట్ల డబ్బు వసూలు చేసే పనిని టికెట్ ఇష్యూయింగ్ మెషీన్స్ (టిమ్స్) ద్వారా డ్రైవర్లతోనే చేయించేస్తే... నిజంగానే ఆర్టీసీ బస్సుల్లో కండక్టర్లకు అసలు పనే ఉండదు. అలాంటప్పుడు ఆర్టీసీకి కండక్టర్ల వ్యవస్థ అవసరమే లేదు. మరి ఇప్పుడు సంస్థలో వేలాదిగా పనిచేస్తున్న కండక్టర్ల పరిస్థి ఏమిటి? వారందరి ఉద్యోగాలను పీకేసి వాళ్లను రోడ్డున పడేయక తప్పదా? అంటే కండక్టర్ల భవిష్యత్తు అగమ్యగోచరమే కదా.

ఏళ్ల తరబడి కండక్టర్ల వ్యవస్థ ఆర్టీసీలో కొనసాగుతోంది. తెలుగు నేల ఉమ్మడి రాష్ట్రంగా ఉండగా ఏర్పాటైన ఆర్టీసీ... డ్రైవర్ల సంఖ్యకు సరిసమానంగా కండక్టర్లనూ నియమించుకుంది. ఆర్టీసీ బస్సు బయలుదేరిందంటే.. డ్రైవర్ తో పాటు కండక్టర్ కూడా అందులో ఉండాల్సిందే. అయితే కాలక్రమంలో ఆర్టీసీకి కొన్ని ప్రభుత్వాల హయాంలో భారీ ఎత్తున నష్టాలు పేరుకుపోతున్న తరుణంలో కాస్ట్ కటింగ్ చర్యలపై ఆయా ప్రభుత్వాలు దృష్టి సారించాయి. ఇలాంటి నేపథ్యంలో అందివచ్చిన ఆధునిక టెక్నాలజీని వినియోగించేందుకు తలుపులు తెరచిన ఆర్టీసీ టిమ్స్ ను ప్రవేశపెట్టాయి. టిమ్స్ ఉన్న బస్సులో కండక్టర్ లేకుండా డ్రైవర్లతోనే పనికానిచ్చేయడం మొదలైపోయింది. ఈ తరహా పరిణామాలపై ఆర్టీసీ కార్మిక సంఘాలు ఆది నుంచే ఉద్యమాలను మొదలెట్టాయి. కండక్టర్ల వ్యవస్థకు గొడ్డలిపెట్టుగా మారిన టిమ్స్ ను రద్దు చేయాలన్న డిమాండ్లు వినిపించాయి. అయితే ఈ డిమాండ్లను ఓ చెవిన వినేసి మరో చెవితో వదిలేసే చందంగా ప్రభుత్వాలు వ్యవహరించాయి. వెరసి టిమ్స్ ను వీలయినన్ని బస్సుల్లో అమలు చేస్తూ ఆయా ప్రభుత్వాలు సాగాయి.

తాజాగా రెండు రాష్ట్రాలు విడిపోవడం, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ప్రత్యేకంగా ఆర్డీసీని విడగొట్టుకుని కొనసాగించడం తెలిసిందే. ఇలాంటి క్రమంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామంటూ విపక్ష నేతగా ఉన్నప్పుడే హామీ ఇచ్చేసిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... గతేడాది తాను సీఎం కుర్చీ ఎక్కిన తర్వాత ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ చర్యతో అటు డ్రైవర్లు, ఇతర టెక్నికల్, అడ్మినిస్ట్రేటివ్ సిబ్బందితో పాటు కండక్టర్లు కూడా తమ భవిష్యత్తుకు ఎలాంటి ఢోకా లేదని భావించారు. అయితే ఉరుము లేని పిడుగులా ఇప్పుడు ఆర్టీసీలో వన్ మన్ సర్వీసులకు ప్రాధాన్యం ఇవ్వాలని, దాదాపుగా అన్ని బస్సుల్లో టిమ్ప్ ను ప్రవేశపెట్టాలని జగన్ సర్కారు నిర్ణయించింది. దీంతో మరోమారు కండక్టర్ల భవిష్యత్తు ప్రశ్నార్థకంలో పడిపోయింది. ప్రభుత్వ విభాగంగా మారిన ఆర్టీసీలో నుంచి కండక్టర్లను ఇంటికి సాగనంపడం దాదాపుగా సాధ్యం కాదు. మరి పనిలేకుండా వేలాది మంది కండక్టర్లను ఎలా కొనసాగిస్తారన్నది కూడా మరో కీలక ప్రశ్నగా మారింది. దీనిపై జగన్ సర్కారు నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చేదాకా... ఆర్టీసీలోని కండక్టర్లంతా దినదిన గండంగానే బతుకు వెళ్లదీయక తప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయి.

   

Tags:    

Similar News