ముప్పయ్యేళ్ళు...జగన్ నయా వ్యూహం !
రాజకీయాల్లో ఆశలదే అధిక ప్రాధాన్యం. ఆ మాటకు వస్తే మనిషి ఆశాజీవి. చాన్స్ ఉన్న చోట సర్దుకుంటాడు
రాజకీయాల్లో ఆశలదే అధిక ప్రాధాన్యం. ఆ మాటకు వస్తే మనిషి ఆశాజీవి. చాన్స్ ఉన్న చోట సర్దుకుంటాడు. లేని చోట టాటా చెబుతాడు. ఇక రాజకీయాల్లో చెప్పనవసరం లేదు. గతంలో ఎలా ఉన్నా ఇపుడు ఓటమి అన్న మూడు అక్షరాలను ఎవరూ జీర్ణించుకోవడం లేదు. అంతదాకా ఎందుకు అధినేతలే ఓటమిని భరించలేని పరిస్థితిగా ఉంటోంది.
ఈ నేపధ్యంలో క్యాడర్ కి ధైర్యం చెప్పి ఆత్మ స్థైర్యం కలిగించే విధంగా పార్టీ అధినాయకత్వం ఉండాలంటే కొత్త వ్యూహాన్ని రూపొందించాలి. వైసీపీ అధినేత జగన్ అదే ఇపుడు చేస్తున్నారు. ఆయన జగన్ 2.0 అన్నారు అది ఒక ఉత్ప్రేరకం పార్టీకి. ఆ 2.0 రంగు రుచి వాసన క్యాడర్ కి తెలియకపోయినా అదేదో బాగానే ఉంటుందని అనుకుంటున్నారు.
అలా నిబ్బరంగా చెబుతోంది అధినాయకత్వం. గత పాలనలో ప్రజలకు ఎంతో చేశామని ఈసారి అధికారం వస్తే కార్యకర్తలకే పెద్ద పీట అని జగన్ నమ్మకంగా హామీ ఇస్తున్నారు. మరో నాలుగేళ్ళ పాటు కష్టపడితే మనదే అధికారం అని కూడా చెబుతున్నారు. కూటమి పాలన మీద జనాలకు వ్యతిరేకత అపుడే వచ్చిందని అందువల్ల గెలిచేది వైసీపీయే ఇది రాసి పెట్టుకోండని కూడా భరోసా ఇస్తున్నారు.
వీటితో పాటు మరో ముఖ్యమైన ప్రకటన జగన్ తరచుగా ఇటీవల చేస్తున్నారు. మరో ముప్పయ్యేళ్ళ పాటు వైసీపీ అధికారంలో ఉంటుందని. తాను కూడా ఇక్కడ నుంచి మరో మూడు దశాబ్దాల పాటు రాజకీయం చేస్తాను అని. ఇది కూడా పార్టీ క్యాడర్ లో ఉత్సాహం పెంచి కార్యోన్ముఖులను చేయడానికే అంటున్నారు. జగన్ ముప్పయ్యేళ్ళు పార్టీకి సారధిగా ఉంటూ నడుపుతాను అంటే ఇక అనేక సందేహాలు కొట్టుకుని పోయినట్లే.
ప్రత్యర్ధులు ప్రచారం చేస్తున్నట్లుగా వైసీపీ మూతపడిపోదని పక్కా క్లారిటీ వస్తోంది. అంతే కాదు జగన్ లీడర్ గా నిలబడి పోరాడితే ఆ పార్టీలో తామూ ఉంటూ తమదైన రాజకీయం ఎవరి స్థాయిలో వారు చేయవచ్చు అన్నది క్యాడర్ కి నిఖార్సుగా వెళ్తున్న సందేశం. ఈ సందేశం ఇచ్చేందుకే జగన్ ముప్పయ్యేళ్ళు అని అంటున్నారు. జగన్ వయసు దృష్ట్యా ఆయన ఈ ప్రకటన చేయడం కూడా సబబు. ఆయన రాజకీయాల్లో చూస్తే యువ నేతగానే ఉన్నారు. మరిన్ని ఎన్నికల్లో ఉత్సాహంగా పాల్గొనే అవకాశం ఉన్నవారు.
వైసీపీకి ఓటములు వచ్చినా తట్టుకుని పార్టీని నడిపించే సత్తా ఉన్న వారు జగన్. ఆయనకు అంగబలం ఉంది, అర్ధ బలం ఉంది వయసు కూడా ఉంది. ఇక పార్టీని తాను మరిన్ని దశాబ్దాలు ధీటుగా నడిపిస్తాను అని స్పష్టంగా జగన్ చెబుతున్న తీరులోనే ఒక వ్యూహం ఉంది. దాంతో జంపింగ్ చేసేవారు చేసినా క్యాడర్ అయితే డీలా పడదు. తాము నమ్ముకున్న పార్టీలోనే ఉంటూ జెండాకు జేజేలు పలుకుతూ ఉంటుంది.
వైసీపీ అధినాయకత్వానికి అదే కావాల్సింది. క్యాడర్ గట్టిగా నిలబడితే లీడర్లు వస్తూనే ఉంటారు. ఇక జనంలో మార్పు వచ్చి వైసీపీ వైపు మొగ్గితే అధికారమూ దక్కుతుంది. అందుకే తాను ఒక్క ఘోరమైన ఓటమితో కాడె వదిలేసే రకం కాదని బల్ల గుద్ది మరీ చెబుతున్నారు. రానున్న ముప్పయ్యేళ్ళూ వైసీపీకి స్వర్ణ శకం అని కూడా భవిష్యత్తు వాణి వినిపిస్తున్నారు. మొత్తానికి వైసీపీ నయా వ్యూహంతో ఫ్యాన్ ని గిర్రున తిప్పాలని చూస్తోంది. క్యాడర్ ని పరుగులు తీయించాలని ఆశిస్తోంది.