ట్యాంప‌రింగ్ ఎలానో చెబుతాన‌న్న సీఎం

Update: 2017-04-14 17:43 GMT
ఢిల్లీ ముఖ్య‌మంత్రి కేజ్రీవాల్ విచిత్ర వైఖ‌రి గురించి అంద‌రికి తెలిసిన విష‌య‌మే. న‌మ్మ‌కంతో ప్ర‌జ‌లు అప్ప‌గించిన అధికారాన్ని ప‌ట్టించుకోకుండా.. దూర‌పు కొండ‌లు నునుపు అన్న చందంతో.. ఎక్క‌డెక్క‌డో ప‌వ‌ర్ ను సాధించాల‌ని ఆయ‌న చేసే ప్ర‌య‌త్నాల్ని చూస్తే.. న‌వ్వాలో.. ఏడ‌వాలో అర్థం కాని ప‌రిస్థితి. ఇచ్చిన ప‌నిని చేయ‌కుండా.. సంబంధం లేని ప‌నిని క‌ల్పించుకొని మ‌రీ చేస్తాన‌ని చెప్ప‌టం ఆయ‌న‌కు మాత్ర‌మే సాధ్య‌మయ్యే ప‌నిగా చెప్పాలి. ఢిల్లీ రాష్ట్ర ప‌గ్గాల్ని అప్ప‌గించిన ఢిల్లీ ప్ర‌జ‌ల న‌మ్మ‌కాన్ని మ‌రింత పెంచేలా.. దేశానికే ఒక మార్గ‌ద‌ర్శ‌కంగా వ్య‌వ‌హ‌రించాల్సింది పోయి.. అందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రించ‌టం కేజ్రీవాల్ కే చెల్లింది.

ఈ కార‌ణంతోనే కావొచ్చు.. సంచ‌ల‌న విజ‌యాన్ని సాధించిన ఢిల్లీ రాష్ట్రంలో.. తాజాగా నిర్వ‌హించిన ఉప ఎన్నిక‌ల్లో ఊహించ‌ని ప‌రాజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకున్నారు. విజ‌యంసాధించిన‌ప్పుడు ఈవీఎంల గురించి ప‌ల్లెత్తు మాట మాట్లాడ‌ని అధినేత‌లు.. ప‌రాజ‌యం ప‌లుక‌రిస్తే చాలు.. ఈవీఎంల మీద విప‌రీతంగా ఆడిపోసుకోవ‌టం అల‌వాటే. ఇప్పుడు అలాంటి అధినేత జాబితాలోకి కేజ్రీవాల్ ఎక్కేశారు.

ఈవీఎం ట్యాంప‌రింగ్ ల మీద తాజాగా రియాక్ట్ అయిన కేజ్రీవాల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈవీఎంల ట్యాంప‌రింగ్‌ల‌ను తోసిపుచ్చ‌లేమ‌ని.. తాను కూడా ఒక ఐఐటీ ఇంజ‌నీర్‌నేన‌ని.. ట్యాంప‌రింగ్‌లు ఎలా చేయొచ్చో ప‌ది మార్గాల్ని చెబుతాన‌ని వ్యాఖ్యానించారు. త‌న వాద‌న‌కు బ‌లాన్ని చేకూరేలా ఒక ఉదాహ‌ర‌ణ చెప్పారు. ఫుణేలో ఒక వ్య‌క్తి ఇండిపెండెంట్ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగార‌ని.. ఆ వ్య‌క్తికి ఒక్క ఓటు ప‌డిన‌ట్లుగా కూడా చూప‌లేద‌ని.. దీని ప్ర‌కారంగా చూస్తే.. బ‌రిలో నిలుచున్న వ్య‌క్తి త‌న ఓటు తాను కూడా వేసుకోలేదా? అని ప్ర‌శ్నించారు. అలాంట‌ప్పుడు త‌న ఓటును తాను వేసుకున్న ఆయ‌న ఓటు ఏమైన‌ట్లు? అంటూ కొత్త సందేహాన్ని తెర మీదకు తీసుకొచ్చారు. త‌మ పార్టీని ఓడించ‌ట‌మే మోడీ లక్ష్య‌మ‌ని.. అందుకోసం ఎంత‌కైనా వెళ‌తారంటూ ప‌లు సందేహాల్ని వ్య‌క్తం చేయ‌టం గ‌మ‌నార్హం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News