నోట్ల రద్దు పెద్ద కుంభకోణమంటున్న కేజ్రీ

Update: 2016-11-12 06:58 GMT
రూ.500 - రూ.1000 నోట్లు రద్దు అంశంపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ నోట్లను రద్దు చేస్తూ ప్రధాని ప్రకటన చేయడానికి ముందే బీజేపీ కీలక నేతల దగ్గర కొత్తగా ప్రవేశపెట్టిన రూ.2వేల నోట్లు ఉన్నాయని ఆయన ఆరోపించారు. పెద్దనోట్ల రద్దు విషయం ప్రధాని మోడీ సన్నిహితులకు ముందే తెలుసని.... వారంతా ముందే జాగ్రత్త పడ్డారని ఆయన ఆరోపించారు. పెద్దనోట్ల రద్దుతో బీజేపీ నేతలకు భారీ లబ్ధి చేకూరిందని, ఈ నోట్ల రద్దు వెనుక అతిపెద్ద కుంభకోణం ఉందని ఆయన ఆరోపించారు. నల్లకుబేరులు డాలర్లను బ్లాక్ లో కొంటున్నారని, ఇది సామాన్యులపై జరిగిన సర్జికల్ స్ట్రయిక్ అని విమర్శించారు. ఇది ఉద్దేశపూర్వకంగా సృష్టించిన సంక్షోభమని, నల్లధనం ఎవరి దగ్గర ఉందో కేంద్రం బహిర్గతం చేయాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు.

మోడీ నిర్ణయంతో అవినీతేమీ అంతం కాదని.. కేవలం డబ్బు చేతులు మారుతుందని ఆయన అన్నారు. డబ్బులు డిపాజిట్ చేసేవాళ్లు పన్నుతో పాటు 200 శాతం పెనాల్టీ కట్టాల్సి ఉంటుందని ప్రభుత్వం చెబుతోందని, అంటే, వాళ్ల వద్ద ఉన్న డబ్బులో 90 శాతం కోల్పోవాల్సి వస్తుందని, అలాంటి సమయంలో నల్లడబ్బు దాచుకున్నవాళ్లు ఎందుకు అలా చేస్తారని ప్రశ్నించారు. అందువల్ల ప్రభుత్వమే పరోక్షంగా డబ్బులు డిపాజిట్ చేయొద్దని చెబుతోందని ఆరోపించారు.

బడాబాబులకు ముందే సమాచారం ఉండడంతో దీనివల్ల నష్టమేమీ కలగలేదని.. సామాన్యులు మాత్రం ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు.. ఈ నిర్ణయం సామాన్యుడిపై ప్రధాని నరేంద్ర మోడీ జరిపిన సర్జికల్ దాడిగా అభివర్ణించారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం నల్లధనంపై కాదు, ఆమ్ ఆద్మీపై ఎక్కుపెట్టిన అస్త్రం అని అన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News