అంత‌రించే త‌లాక్‌ ను తీసేస్తే పోయేదేముంది?

Update: 2017-05-17 14:16 GMT
త‌లాక్ మీద సాగుతున్న చ‌ర్చ ప్రజాస్వామ్య‌వాదుల‌కు విస్మ‌యాన్ని రేకెత్తిస్తోంది. అప్పుడెప్పుడో 1300 ఏళ్ల కింద‌టి ఒక విధానాన్ని నేటి డిజిట‌ల్ యుగంలోనూ కొన‌సాగించ‌టం ఒక ఎత్తు అయితే.. ముస్లిం దేశాలైన సౌదీ.. పాక్ లాంటి దేశాల్లో లేని ఒక విధానాన్ని భార‌త్ లో మాత్రం కొన‌సాగించేందుకు చేస్తున్న ఆరాటం చూస్తే.. ఆశ్చ‌ర్య‌క‌రంగా అనిపించ‌క మాన‌దు.

ఫ‌క్తు ముస్లిం దేశాల్లోనూ తీసి పారేసిన త‌లాక్ ను ఇండియా కొన‌సాగించ‌టం.. మ‌హిళ‌ల సాధికారిత గురించి గుక్క తిప్పుకోకుండా మాట్లాడే వామ‌ప‌క్ష మేథావుల మొద‌లు.. లౌకిక‌వాదులుగా చెప్పుకునే సోకాల్డ్ పెద్ద‌లంతా గ‌ప్ చుప్ అయిపోవ‌టం ఏమిటో ఒక ప‌ట్టాన అర్థం కాదు.

క‌రిగే కాలానికి త‌గ్గ‌ట్లుగా నాట్ నాట్ సెంచురీల నాటి ప‌ద్ధ‌తులు బాగోకుంటే వాటిని ఇప్ప‌టి కాలానికి త‌గ్గ‌ట్లుగా మార్చేసుకోవాల్సింది పోయి.. అలాంటిదేమీ ప‌ట్ట‌న‌ట్లుగా ఉండ‌టం ఒక ఎత్తు అయితే.. ముస్లిం మ‌హిళ‌లు స్వ‌యంగా బ‌య‌ట‌కు వ‌చ్చి.. త‌మ హ‌క్కుల‌కు భంగం వాటిల్లే త‌లాక్ ను తీసి పారేయ‌మ‌ని అడుగుతున్నా.. రాజ‌కీయ ప‌క్షాలు మౌనంగా ఉండ‌టంలో మ‌త‌ల‌బు ఏమిటో?

ఇక‌.. రంగ‌నాయ‌క‌మ్మ లాంటి ఈక‌లు పీకే మేధావులు.. ర‌క‌ర‌కాల పురాణాల మీద రీసెర్చ్ చేసేసి.. వివిధ ర‌కాల పాత్ర‌ల గురించి ర‌క‌ర‌కాల వాదాలు బ‌య‌ట‌కు తీసేసే వారంతా.. ఇప్పుడు నోరు ఎందుకు విప్ప‌ర‌న్న‌ది అర్థం కానిది. ఒక‌వేళ‌.. ముస్లిం స‌మాజం అంతా ఒక్క‌టే.. త‌మ‌కు కావాల‌నుకుంటే అదో ప‌ద్ధ‌తి. ఓప‌క్క‌న అలాంటిదేమీ లేకుండా.. త‌లాక్ కార‌ణంగా త‌మ జీవితాలు బుగ్గి అయిపోయాయ‌ని బ‌య‌ట‌కొచ్చి మ‌రీ చెబుతున్న బాధితుల మాట‌లు కూడా మేధావుల గుండెల్ని ఎందుకు క‌రిగించ‌టం లేద‌న్న‌ది అస‌లు ప్ర‌శ్న‌.

అంతేనా.. ఈ రోజున సుప్రీంలో జ‌రిగిన వాద‌న‌లు చూసిన‌ప్పుడు.. త‌లాక్ విధానం మీద సాగుతున్న విచార‌ణ త‌న‌కు అస్స‌లు ఇష్టం లేన‌ట్లుగా వ్య‌వ‌హ‌రించింది ఆలిండియా ముస్లిం ప‌ర్స‌న‌ల్ లా బోర్డు. దీని గురించి లౌకిక వేదిక‌ల మీద చ‌ర్చించ‌టం కార‌ణంగా న‌ష్టం జ‌రుగుతుంద‌న్న మాట‌ను చెప్పట‌మే కాదు.. భార్య‌కు విడాకులు ఇచ్చేందుకు ముస్లిం భ‌ర్త అనుస‌రించే ట్రిపుల్ త‌లాక్ విధానం ప్ర‌స్తుతం అంత‌రించే ద‌శ‌లో ఉంద‌ని.. సుప్రీం లాంటి లౌకిక వేదిక‌ల మీద చ‌ర్చించ‌టం వ‌ల్ల అది మ‌ళ్లీ పున‌రుజ్జీవ‌నం పొందుతుందంటూ చిత్ర‌మైన వాద‌న‌ను వినిపించింది.

అంత‌రించే ద‌శ‌లో ఉందంటే.. దాన్ని ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌టం లేద‌నే. అదే నిజ‌మైతే.. ప‌ట్టించుకునే కొంద‌రిని సైతం కంట్రోల్ చేసేందుకు వీలుగా చ‌ట్టాన్ని మార్చేస్తే స‌రిపోతుంది క‌దా? కానీ.. ఆ దిశ‌గా ముస్లిం లా బోర్డు ఎందుకు త‌న స‌హ‌కారం అందించ‌టం లేదు?

ముస్లింలు త‌లాక్ ను ఉప‌యోగించ‌టం లేద‌న్న‌ది నిజ‌మే అయిన‌ప్పుడు.. దాన్ని తీసేస్తే స‌రిపోతుంది క‌దా. మెజార్టీ వ‌ర్గం ప‌ట్టించుకోని దాని గురించి ఎందుకంత ప‌ట్టుద‌ల‌? ఇదే ప్ర‌శ్న‌ను త‌లాక్‌ ను ర‌ద్దు చేయాల‌ని కోరే వారిని అడ‌గొచ్చు. వారి స‌మాధానం క్లియ‌ర్‌. మెజార్టీ స‌భ్యులు వ‌ద్ద‌న్నా.. ఎంతోకొంత మంది దాన్ని వినియోగిస్తున్నారు కాబ్ట‌టి.. వారి  కార‌ణంగా అమాయ‌క ముస్లిం మ‌హిళ‌లు న‌ష్ట‌పోతున్నారు కాబ‌ట్టి.. ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు. త‌ర్క‌బ‌ద్ధంగా ఉన్న ఈవాద‌న‌ను ముస్లిం ప‌ర్స‌న‌ల్ లా బోర్డు ఎందుకు ప‌ట్టించుకోవ‌టం లేద‌న్న‌ది పెద్ద ప్ర‌శ్న‌. న‌ష్టం చేకూర్చే దేనినైనా స‌రే.. దాన్ని కంట్రోల్ చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్న విష‌యాన్ని ముస్లిం ప‌ర్స‌న‌ల్ లాబోర్డు పెద్ద‌లు ఎందుకు గుర్తించ‌రు?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News