ఆర్నాబ్ కొత్త ఛానల్ పెడుతున్నాడా..?

Update: 2016-11-04 09:19 GMT
ఎవరైనా.. ఎంతటి వారైనా సరే ఆయన నోటి ముందు కాస్త తగ్గాల్సిందే. దేశం ప్రశ్నిస్తోందంటూ వెనుకాముందు చూసుకోకుండా చెడామడా మాట్లాడేసే సీనియర్ జర్నలిస్ట్ అర్నబ్ గోస్వామి తాను పని చేస్తున్న టైమ్స్ నౌ న్యూస్ ఛానల్ కు గుడ్ బై చెప్పటం తెలిసిందే. ఏమైందో తెలీదు కానీ అర్నాబ్ ను టైమ్స్ నౌ నుంచి బయటకు రావటం హాట్ టాపిక్ గా మారింది. ఆయన ఆ ఛానల్ నుంచి ఎందుకు బయటకు వచ్చారన్న అంశంపై ఇప్పటికి స్పష్టత లేని పరిస్థితి.

ప్రతి రోజూ తన ‘‘ద న్యూస్ అవర్’’ కార్యక్రమంతో ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్న ఆయన్ను.. ద్వేషించేవారు.. జోకులేసుకునే వారు ఎంతోమంది. విషయం ఏదైనా ఒక స్టాండ్ తీసుకొని.. రాజకీయ నాయకుల మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడే ఆయన.. టైమ్స్ నౌ ఛానల్ నుంచి బయటకు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడే చేయనున్నారు? అన్నది ఒక ప్రశ్నగా మారింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఆయన త్వరలో ఒక కొత్త ఛానల్ ను సొంతంగా ఏర్పాటు చేయనున్నట్లుగా చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.. ఆర్నాబ్ వీడ్కోలు సమావేశానికి సంబంధించిన ఒక వీడియో తాజాగా బయటకు వచ్చింది. మూడు నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో తన సహచరులను ఉద్దేశించి ఆర్నాబ్ చెప్పిన మాటలు ఉత్తేజంగా ఉండటంతో పాటు.. కొన్ని వ్యాఖ్యల వెనుక మర్మం ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది. ‘ఆట ఇప్పుడే మొదలైంది’’ అంటూ తన సహచరులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్య దేనికి సంబందించిందన్నది చర్చగా మారింది.

మీడియా గురించి మాట్లాడుతూ.. ఇండిపెండెంట్ మీడియా గురించి మనకు ఎవరూ చెప్పరని.. ఎవరికి వారుగా నేర్చుకోవాలని.. తానింత స్వేచ్ఛగా పని చేశానంటే దానికి కారణం టీమ్ మెంబర్లే అంటూ.. ‘‘విధి నిర్వహణలో భాగంగా నేను కొంతమంది మీద  నోరు పారేసుకున్నాను. వారికి క్షమాపణలు చెబుతున్నాను. మన ఛానల్ ను టాప్ లో నిలబెట్టాలన్న ఉద్దేశంతోనే నేను అలా వ్యవహరించాను’’ అని చెప్పుకొచ్చారు. ఆర్నాబ్ కొత్త ఛానల్ సమాచారం గురించి సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతుంది. మరి.. ఆ వివరాలు ఎప్పుడు బయటకు వస్తాయో చూడాలి.
Full View


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News