పెయిడ్ టీఆర్పీ ఆరోపణలను ఖండించిన ఆర్నబ్

Update: 2020-10-08 17:00 GMT
మహారాష్ట్రలో టీఆర్‌పీ రేటింగ్‌ కుంభకోణం జరిగిందంటూ ముంబై పోలీసులు వెల్లడించిన సంగతి తెలిసిందే. టీఆర్‌పీల విషయంలో రిపబ్లిక్ టీవీవోపాటు మరో రెండు ఛానెళ్లు మోసాలకు పాల్పడుతున్నాయని పోలీస్‌ కమిషనర్‌ పరమ్‌ వీర్‌ సింగ్ వెల్లడించారు. కొందరు వినియోగదారులకు రూ.500-1500 డబ్బులు ఇచ్చి వాళ్ల ఛానెళ్లు మాత్రమే చూసేలా ఏర్పాటు చేస్తున్నాయని ఆరోపించారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఇద్దరిని అరెస్టు చేశామనీ.. వారిలో ఒకరు రేటింగ్‌లను సమీక్షించేందుకే ఏర్పాటు చేసే పీపుల్‌ మీటర్ల ఏజెన్సీకి చెందిన మాజీ ఉద్యోగి అని తెలిపారు. ఈ వ్యవహారాన్ని ఇంతటితో వదలబోమని, మరింత లోతుగా దర్యాప్తు చేస్తామని అన్నారు. ఈ కేసులో ఎంతటి వారినైనా విచారణ చేస్తామని, తప్పుడు టీఆర్‌పీలతో అడ్వర్టయిజ్‌మెంట్ల ద్వారా ఆదాయం సంపాదించాలనుకునే వారిని వదిలిపెట్టమని అన్నారు.

ఈ నేపథ్యంలో ముంబై పోలీసుల ప్రకటనను రిపబ్లిక్‌ టీవీ ఖండించింది. నిజాన్ని నిర్భయంగా ప్రజల ముందు ఉంచుతున్నందుకు తమ చానెల్ పై అసత్య ఆరోపణలు చేస్తున్నారని రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ ఆర్నబ్ గోస్వామి ఖండించారు. రేటింగ్ లను నిర్ణయించే BARC...రిపబ్లిక్ టీవీ పేరు వెల్లడించలేదని ఆర్నబ్ స్పష్టం చేశారు.సుశాంత్‌ కేసులో ముంబై పోలీసులు, పరమ్ వీర్ వైఫల్యాలను ప్రశ్నించినందుకే తమపై చర్యలు తీసుకుంటున్నారని ఆరోపించారు. పోలీస్‌ కమిషనర్‌పై క్రిమినల్ పరువు నష్టం దావా వేస్తామని అన్నారు పరమ్ వీర్ క్షమాపణలు చెప్పాలని, చట్టపరమైన చర్యలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆర్నబ్ చెప్పారు. ఇటువంటి చర్యలతో తాము నిజాన్ని మరింత నిర్భయంగా వెల్లడిస్తామని అన్నారు.
Tags:    

Similar News