ఆగమేఘాల మీద ఏర్పాట్లు.. అమరావతి గ్రామాల్లో ఇళ్ల స్థలాల పంపిణీ

Update: 2023-05-09 09:43 GMT
తాను అనుుకున్నది ఏదైనా అనుకున్నట్లుగా జరిగిపోవాలని భావించే పట్టుదల ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కాస్త ఎక్కువే. ఈ సందర్భంగా ఎదురయ్యే సమస్యల్ని ఆయన పెద్దగా పట్టించుకోరు. తాను చేస్తున్నది మంచి అయినప్పుడు ఎవరో ఏదో అంటే ఎందుకు పట్టించుకోవాలి? అన్నది ఆయన ఆలోచనగా చెబుతారు.

ఏపీ రాజధానిగా అమరావతిని తాను వ్యతిరేకించటం లేదని 2019 ఎన్నికలకు ముందు చెప్పటమే కాదు.. తాను సీఎంగా వస్తే అమరావతిని రాజధానిగా మారుస్తానంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు వాపోయారు.

అధికారంలోకి వచ్చిన కొన్ని నెలలకే రాజధాని అమరావతి మీద ఏం జరిగిందో అందరికి తెలిసిందే. అయితే.. ఆయన రాజధాని గ్రామాల్లో ఇళ్ల స్థలాల్ని పెద్ద ఎత్తున పంపిణీ చేయాలన్న ఆలోచనలో సీఎం జగన్ ఉండటం తెలిసిందే. హైకోర్టు ఆదేశాల మేరకు గుంటూరు.. ఎన్టీఆర్ జిల్లాల్లోని లబ్థిదారులకు రాజధానిగా పేరున్న ఐదు గ్రామాల్లో ఇళ్ల స్థలాల్ని ఇచ్చేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున కసరత్తు చేస్తోంది.

రాజధాని అమరావతిలో గ్రామాలుగా చెప్పే నిడమర్రు.. క్రిష్ణాయపాలెం.. కురగల్లు.. ఐనవోలు.. మందడం గ్రామాల్లో ఇళ్ల స్థలాల పంపిణీకి ఏపీ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం ఆగమేఘాల మీద పనుల్ని పూర్తిచేస్తున్నారు.

దీనికి సంబంధించినపనుల్ని ఈ నెల 15లోపు పూర్తి చేయాలన్నది వారి ఆలోచనగా చెబుతున్నారు. ఇందులో భాగంగా అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారు. లబ్థిదారులకు ఇచ్చేందుకు రాజధాని గ్రామాల్లో ఇప్పటికే 20 లేఅవుట్లు ఏర్పాటు చేశారు.

లేఔట్లకు సంబంధించిన మొత్తం పనులు పూర్తి అయిన తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఇళ్ల పట్టాల్ని ఇవ్వనున్నట్లుగా చెబుతున్నారు. రాజధాని గ్రామాల్లో లేఔట్లు వేసి.. ఇళ్ల పట్టాల్ని ఇవ్వటాన్నిపలువురు తప్పు పడుతున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం మాత్రం రెండు జిల్లాలకు చెందిన లబ్థిదారులకు ఐదు గ్రామాల్లోనే ఇళ్ల పట్టాల్ని పంపిణీ చేయాలన్న పట్టుదలతో ఉంది.

Similar News